Virat Kohli: బస్ డ్రైవర్ కూడా చెప్పాడు కానీ..: విరాట్ కోహ్లిని ఔట్ చేయడంపై రైల్వేస్ బౌలర్ కామెంట్స్ వైరల్-railways bowler himanshu sangwan on dismissing virat kohli makes interesting revelation ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Virat Kohli: బస్ డ్రైవర్ కూడా చెప్పాడు కానీ..: విరాట్ కోహ్లిని ఔట్ చేయడంపై రైల్వేస్ బౌలర్ కామెంట్స్ వైరల్

Virat Kohli: బస్ డ్రైవర్ కూడా చెప్పాడు కానీ..: విరాట్ కోహ్లిని ఔట్ చేయడంపై రైల్వేస్ బౌలర్ కామెంట్స్ వైరల్

Hari Prasad S HT Telugu
Feb 03, 2025 09:24 PM IST

Virat Kohli: విరాట్ కోహ్లిని రంజీ ట్రోఫీలో ఔట్ చేయడంపై రైల్వేస్ టీమ్ బౌలర్ హిమాన్షు సాంగ్వాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. బస్సు డ్రైవర్ కూడా విరాట్ బలహీనత గురించి చెప్పినా.. తాను మాత్రం తన బలానికి అనుగుణంగా బౌలింగ్ చేసినట్లు చెప్పాడు.

బస్ డ్రైవర్ కూడా చెప్పాడు కానీ..: విరాట్ కోహ్లిని ఔట్ చేయడంపై రైల్వేస్ బౌలర్ కామెంట్స్ వైరల్
బస్ డ్రైవర్ కూడా చెప్పాడు కానీ..: విరాట్ కోహ్లిని ఔట్ చేయడంపై రైల్వేస్ బౌలర్ కామెంట్స్ వైరల్ (Himanshu Sangwan - Instagram)

Virat Kohli: విరాట్ కోహ్లిని ఔట్ చేయాలన్నది ప్రతి బౌలర్ కల. అలా ఈ మధ్యే తన కలను నెరవేర్చుకున్నాడు రైల్వేస్ టీమ్ కు చెందిన హిమాన్షు సాంగ్వాన్. ఈ 29 ఏళ్ల బౌలర్.. ఈ మధ్యే ఢిల్లీ, రైల్వేస్ రంజీ ట్రోఫీ మ్యాచ్ లో కోహ్లిని కేవలం 6 పరుగులకే ఔట్ చేయడంతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయాడు. అయితే అతన్ని ఎలా ఔట్ చేశాడన్న విషయంపై సాంగ్వాన్ హిందుస్థాన్ టైమ్స్ తో మాట్లాడుతూ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

బస్ డ్రైవర్ కూడా అదే చెప్పాడు

విరాట్ కోహ్లి ఈ మధ్య కాలంలో ఆఫ్ స్టంప్ కు దూరంగా వెళ్తున్న బాల్ ఆడుతూ ఔట్ అవుతున్నాడు. దీంతో ఏ బౌలర్ అయినా అతన్ని అలా ఊరించి ఔట్ చేయాలని అనుకుంటాడు. చివరికి తాము ప్రయాణిస్తున్న బస్ డ్రైవర్ కూడా తనకు ఇదే విషయం చెప్పాడని, అయితే తాను మాత్రం అతని బలహీనతపై కాకుండా తన బలంపై దృష్టిసారించి బౌలింగ్ చేసినట్లు చెప్పాడు.

"మ్యాచ్ కు ముందు ఢిల్లీ జట్టులో కోహ్లి, పంత్ ఆడుతున్నారని చెప్పారు. కానీ పంత్ ఆడలేదు. కోహ్లి బరిలోకి దిగాడు. చాలా క్రమశిక్షణతో బౌలింగ్ చేయాలని కోచ్ లు మాతో చెప్పారు. నేనే కోహ్లిని ఔట్ చేస్తానని టీమ్ లో ప్రతి ఒక్కరూ అన్నారు. మేము ప్రయాణిస్తున్న బస్ డ్రైవర్ కూడా విరాట్ కోహ్లికి నాలుగు లేదా ఐదో స్టంప్ లైన్ లో బౌలింగ్ చేయాలని సూచించాడు.

కానీ నాపై నాకు నమ్మకం ఉంది. అవతలి వాళ్ల బలహీనతలపైకాకుండా నా బలానికి అనుగుణంగా బౌలింగ్ చేయాలని అనుకున్నాను. అలాగే కోహ్లిని ఔట్ చేశాను" అని సాంగ్వాన్ అన్నాడు. అతడు ఓ అద్భుతమైన ఇన్‌స్వింగర్ తో కోహ్లిని బోల్తా కొట్టించాడు.

అదే బంతితో కోహ్లితో ఫొటో దిగాను

మ్యాచ్ సందర్భంగా లంచ్ టైమ్ లో కోహ్లిని ఔట్ చేసిన బంతితోనే అతనితో కలిసి ఫొటో దిగినట్లు సాంగ్వాన్ చెప్పాడు. "కోహ్లిని ఔట్ చేయడానికి ప్రత్యేకంగా ప్లాన్ చేయలేదు. మా ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్తున్నప్పుడు కోహ్లితో చేతులు కలిపి మాట్లాడాను.

లంచ్ టైమ్ లో ఫొటో దిగుతానని చెప్పాను. అతన్ని ఔట్ చేసిన బంతి తీసుకొని ఢిల్లీ డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లాను. అదే బంతితో కలిసి ఫొటో దిగాను" అని సాంగ్వాన్ చెప్పాడు.

Whats_app_banner

సంబంధిత కథనం