Rahul Dravid: నేనింకా సంతకం చేయలేదు: పదవి పొడగింపుపై రాహుల్ ద్రవిడ్ కొత్త ట్విస్ట్
Rahul Dravid: టీమిండియా హెడ్ కోచ్ గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలాన్ని బీసీసీఐ పెంచిన విషయం తెలుసు కదా. అయితే తానింకా సంతకం చేయలేదంటూ ద్రవిడ్ ఓ కొత్త ట్విస్ట్ ఇచ్చాడు.
Rahul Dravid: టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తోపాటు ఇతర సపోర్ట్ స్టాఫ్ పదవీ కాలాన్ని ఈ మధ్యే బీసీసీఐ పొడిగించింది. ఈ పదవీ కాలం ఎంతకాలం పొడిగించారన్నది చెప్పకపోయినా.. అతడు కనీసం వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ వరకైనా ఉంటాడని భావిస్తున్నారు. అయితే ఈ కొత్త కాంట్రాక్ట్ పై ఇంకా సంతకం చేయలేదని ద్రవిడ్ చెప్పడం విశేషం.
రాహుల్ ద్రవిడ్ ఇచ్చిన ఈ కొత్త ట్విస్ట్ తో టీమిండియా హెడ్ కోచ్ పదవిపై మరోసారి గందరగోళం నెలకొంది. సౌతాఫ్రికా టూర్ కోసం ఇండియన్ టీమ్ ను ఎంపిక చేయడానికి చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తో కలిసి ఢిల్లీ వచ్చాడు ద్రవిడ్. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. తాను ఇంకా దేనిపైనా సంతకం చేయలేదని చెప్పి దీనికి ఓ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు.
"ఇప్పటికీ అధికారికంగా ఇంకా ఏదీ బయటకు రాలేదు. ఇంకా నేను సంతకం చేయలేదు. నాకు ఆ పేపర్లు అందిన తర్వాత చర్చిస్తాం. ఆ తర్వాతే మీకేమైనా తెలుస్తుంది" అని ద్రవిడ్ మీడియాతో అన్నాడు. దీనికి సంబంధించిన వీడియోను పీటీఐ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈమధ్యే ముగిసిన వరల్డ్ కప్ తో ద్రవిడ్ పదవీకాలం ముగిసింది.
తర్వాత హెడ్ కోచ్ పదవి కోసం నెహ్రాను బీసీసీఐ సంప్రదించిన అతడు అంగీకరించలేదు. దీంతో ద్రవిడ్ నే కొనసాగించాలని బోర్డు నిర్ణయించింది. ఈ మధ్యే అతనితోపాటు ఇతర సపోర్ట్ స్టాఫ్ పదవీకాలం పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ఆ లెక్కన ద్రవిడే ఈ పదవిలో కొనసాగనున్నా.. ఇంకా ఎంత కాలం అన్నది మాత్రం తెలియలేదు.
టీ20 వరల్డ్ కప్ వరకైతే కచ్చితంగా అతడు కొనసాగుతాడని తెలుస్తోంది. ఈ మధ్యలో ఇండియా.. సౌతాఫ్రికా టూర్ కు వెళ్లనుంది. ఆ తర్వాత స్వదేశంలో ఇంగ్లండ్ తో ఐదు టెస్ట్ ల సిరీస్ ఆడుతుంది. ఇక ఐపీఎల్ తర్వాత జూన్ 3 నుంచి 30 వరకు జరిగే టీ20 వరల్డ్ కప్ లో పాల్గొంటుంది.