SA vs BAN World Cup 2023 - Quinton de Kock: దక్షిణాఫ్రికా స్టార్ వికెట్ కీపింగ్ బ్యాట్స్‌మెన్ క్వింటన్ డికాక్ అదరగొట్టాడు. బంగ్లాదేశ్‍తో మ్యాచ్‍లో డికాక్ (140 బంతుల్లో 174 పరుగులు; 15 ఫోర్లు, 7 సిక్సర్లు) భారీ శతకం బాదాడు. వన్డే ప్రపంచకప్‍లో భాగంగా ముంబై వేదికగా బంగ్లాతో నేడు (అక్టోబర్ 24) జరిగిన మ్యాచ్‍లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 50 ఓవర్లలో 5 వికెట్లకు 382 పరుగుల భారీ స్కోరు చేసింది. క్వింటన్ డికాక్ భారీ శకతం చేయగా.. హెన్రిచ్ క్లాసెన్ (49 బంతుల్లో 90 పరుగులు) మెరుపు బ్యాటింగ్ చేశాడు. కాగా, ఈ మ్యాచ్‍లో శతకం బాది ఓ చరిత్ర సృష్టించాడు డికాక్.
ఈ భారీ శతకంతో క్వింటన్ డికాక్ చరిత్ర సృష్టించాడు. వన్డే ప్రపంచకప్ టోర్నీల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన వికెట్ కీపర్‌గా రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఆస్ట్రేలియా మాజీ స్టార్ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‍క్రిస్ట్ (149 పరుగులు - 2007 ప్రపంచకప్)ను డికాక్ అధిగమించాడు.
ఒకే వన్డే ప్రపంచకప్ ఎడిషన్‍లో మూడు సెంచరీ చేసిన తొలి దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్‍గా క్వింటన్ డికాక్ రికార్డు సృష్టించాడు. అలాగే, అంతర్జాతీయంగా ఒకే ఎడిషన్‍లో మూడు శతకాలు బాదిన ఏడో బ్యాటర్‌గా నిలిచాడు.
ఈ ప్రపంచకప్ తర్వాత వన్డే క్రికెట్ నుంచి రిటైర్ అవుతానని క్వింటన్ డికాక్ ప్రకటించాడు. అయితే, తన ఆఖరి వరల్డ్ కప్‍లో అతడు అదరగొడుతున్నాడు.
బంగ్లాదేశ్‍తో ఈ మ్యాచ్‍లో ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా అదరగొట్టింది. ఆరంభం నుంచి స్కోరు బోర్డును పరుగులు పెట్టించిన క్వింటన్ డికాక్ 101 బంతుల్లో సెంచరీ చేశాడు. ఇక ఆ తర్వాత హిట్టింగ్ గేర్ మార్చాడు. ధనాధన్ ఆట ఆడాడు. 129 బంతుల్లోనే 150 పరుగులకు చేరాడు. అయితే, 46వ ఓవర్లో బంగ్లా బౌలర్ హసన్ మహమూద్ అతడిని ఔట్ చేశాడు. ఓ దశలో డబుల్ సెంచరీ చేస్తాడని ఆశించిన డికాక్.. 174 వ్యక్తిగత పరుగుల వద్ద ఔటయ్యాడు. మరోవైపు హెన్రిచ్ క్లాసెన్ కూడా మరోసారి తన మార్క్ హిట్టింగ్ చేసి బంగ్లా బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. 49 బంతుల్లో 90 రన్స్ చేశాడు. మొత్తంగా సఫారీ జట్టు 50 ఓవర్లలో 5 వికెట్లకు 382 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లలో హసన్ మహమూద్ రెండు, షకీబ్, షరీఫుల్, మిరాజా చెరో వికెట్ తీశారు. బంగ్లాదేశ్ ముందు 283 పరుగుల భారీ టార్గెట్ ఉంది.