ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూసిన ఐపీఎల్ 2025 రీస్టార్ట్ అదిరింది. శనివారమే ఐపీఎల్ 18వ సీజన్ పున:ప్రారంభం కాగా.. వర్షంతో ఆర్సీబీ, కేకేఆర్ మ్యాచ్ రద్దయింది. కానీ ఆదివారం (మే 18) పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ అదుర్స్ అనిపించాయి. జైపూర్ లో పరుగుల మోత మోగించాయి.
ఉత్కంఠ పోరులో చివరకు పంజాబ్ కింగ్స్ గెలిచింది. లాస్ట్ ఓవర్ థ్రిల్లర్ లో రాజస్థాన్ రాయల్స్ ను 10 పరుగుల తేడాతో ఓడించింది. ఛేజింగ్ లో రాజస్థాన్ 20 ఓవర్లలో 209/7 స్కోరు చేసింది. యశస్వి జైస్వాల్ (25 బంతుల్లో 50; 9 ఫోర్లు, ఓ సిక్సర్), ధ్రువ్ జురెల్ (31 బంతుల్లో 53; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), వైభవ్ సూర్యవంశీ (15 బంతుల్లో 40; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) పోరాటానికి ఫలితం దక్కలేదు. 12 మ్యాచ్ ల్లో 8వ విజయంతో పంజాబ్ ప్లేఆఫ్స్ కు అడుగు దూరంలో నిలిచింది.
భారీ లక్ష్య ఛేదనలో రాజస్థాన్ రాయల్స్ కు యువ ఓపెనర్లు యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ టీమ్ కు మెరుపు ఆరంభాన్నిచ్చారు. ఫస్ట్ బంతి నుంచే బాదుడు మొదలెట్టారు. ఫస్ట్ బాల్ కు ఫోర్ తో ఇన్నింగ్స్ ను గ్రాండ్ గా ప్రారంభించిన జైస్వాల్.. అర్ష్ దీప్ వేసిన ఫస్ట్ ఓవర్లో 22 పరుగులు రాబట్టాడు. అక్కడి నుంచి జైస్వాల్, సూర్యవంశీ ఊచకోత కొనసాగించింది.
జైస్వాల్ ఫోర్ కొడితే.. సూర్యవంశీ సిక్సర్ కొట్టడం, సూర్యవంశీ బౌండరీ బాదితే.. జైస్వాల్ బంతిని స్టాండ్స్ లో పడేయం.. ఇన్నింగ్స్ స్టార్టింగ్ లో ఇదే జరిగింది. ముఖ్యంగా 14 ఏళ్ల బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి రెచ్చిపోయాడు. యాన్సెన్ ఓవర్లో రెండు మెరుపు సిక్సర్లు బాదాడు. అర్ష్ దీప్ ఓవర్లో వరుసగా రెండు బంతులను స్టాండ్స్ లో పడేశాడు.
యశస్వి, సూర్యవంశీ దూకుడు చూస్తే రాజస్థాన్ ఈజీగా గెలిచేలా కనిపించింది. కానీ ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన స్పిన్నర్ హర్‌ప్రీత్ బ్రార్ మ్యాజిక్ చేశాడు. తన ఫస్ట్ ఓవర్లోనే సూర్యవంశీని ఔట్ చేశాడు. పవర్ ప్లేలో రాజస్థాన్ 89/1తో నిలిచింది. ఐపీఎల్ హిస్టరీలో ఆ టీమ్ కు ఇదే హైయ్యస్ట్ పవర్ ప్లే స్కోరు.
8 ఓవర్లోనే రాజస్థాన్ స్కోరు 100 దాటింది. కానీ హర్‌ప్రీత్ బ్రార్.. యశస్విని ఔట్ చేసి రాజస్థాన్ ను మళ్లీ దెబ్బకొట్టాడు. కెప్టెన్ శాంసన్ (20) నిలబడలేకపోయాడు. రియాన్ పరాగ్ (13) వికెట్ నూ హర్‌ప్రీత్ బ్రార్ దక్కించుకున్నాడు. ఓ ఎండ్ లో ధ్రువ్ జురెల్ పోరాడాడు.
రాజస్థాన్ సమీకరణం 12 బంతుల్లో 30 పరుగులుగా మారడంతో లాస్ట్ లో ఉత్కంఠ నెలకొంది. 19వ ఓవర్ వేసిన అర్ష్ దీప్ 8 పరుగులు మాత్రమే ఇచ్చాడు. లాస్ట్ ఓవర్లో రాజస్థాన్ విజయానికి 22 పరుగులు కావాల్సి వచ్చింది. కానీ యాన్సెన్ అద్భుతమే చేశాడు. ఫస్ట్ రెండు బంతుల్లో రెండు పరుగులే ఇచ్చాడు. ఆ తర్వాత వరుసగా ధ్రువ్ జురెల్, హసరంగ ను ఔట్ చేయడంతో రాజస్థాన్ పనైపోయింది. మపాక వరుసగా రెండు ఫోర్లు కొట్టినా లాభం లేకపోయింది.
అంతకుముందు టాస్ గెలిచి పంజాబ్ కింగ్స్ ఫస్ట్ బ్యాటింగ్ కు దిగింది. భారీ స్కోరు సాధించింది. 20 ఓవర్లలో 5 వికెట్లకు 219 పరుగులు చేసింది. 3.1 ఓవర్లలోనే 34 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయిన పంజాబ్ అద్భుతంగా పుంజుకుంది.
నేహాల్ వధెరా (37 బంతుల్లో 70; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), శశాంక్ సింగ్ (30 బంతుల్లో 59 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అదరగొట్టారు. ఆఖర్లో అజ్మతుల్లా ఒమర్ జాయ్ (9 బంతుల్లో 21 నాటౌట్; 3 ఫోర్లు, ఓ సిక్సర్) కూడా చెలరేగిపోయాడు.
సంబంధిత కథనం