IPL 2025 PBKS vs GT: భయపెట్టిన గుజరాత్.. కానీ పంజాబ్ కింగ్స్ దే గెలుపు.. శ్రేయస్, శశాంక్ మెరుపులు-punjab kings opened ipl 2025 campaign with big win vs gujarat titans pbks vs gt shreyas iyer shashank priyansh sudarshan ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Ipl 2025 Pbks Vs Gt: భయపెట్టిన గుజరాత్.. కానీ పంజాబ్ కింగ్స్ దే గెలుపు.. శ్రేయస్, శశాంక్ మెరుపులు

IPL 2025 PBKS vs GT: భయపెట్టిన గుజరాత్.. కానీ పంజాబ్ కింగ్స్ దే గెలుపు.. శ్రేయస్, శశాంక్ మెరుపులు

IPL 2025 PBKS vs GT: ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ శుభారంభం చేసింది. పరుగుల మోత మోగిన మ్యాచ్ లో గుజరాత్ జెయింట్స్ పై ఆ టీమ్ విజయం సాధించింది. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 97 నాటౌట్ గా నిలిచాడు.

శ్రేయస్ అయ్యర్ (PTI)

కెప్టెన్ శ్రేయస్, ప్రియాన్ష్, శశాంక్ సింగ్ మెరుపులతో ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ బోణీ కొట్టింది. మంగళవారం (మార్చి 25) అహ్మదాబాద్ లో జరిగిన మ్యాచ్ లో ఆ జట్టు 11 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ పై గెలిచింది. భారీ టార్గెట్ ఛేజింగ్ లో గుజరాత్ గొప్పగా పోరాడినా విజయాన్ని అందుకోలేకపోయింది. 5 వికెట్లకు 232 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ (41 బంతుల్లో 74), బట్లర్ (33 బంతుల్లో 54), రూథర్ ఫర్డ్ (28 బంతుల్లో 46) మెరిశారు.

మొదట పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో5 వికెట్లకు 243 పరుగులు చేసింది. కింగ్స్ కెప్టెన్ గా ఐపీఎల్ లో సరికొత్త ప్రయాణం మొదలెట్టిన స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (42 బంతుల్లో 97 నాటౌట్, 9 సిక్సర్లు) అదరగొట్టాడు.ప్రియాన్ష్ ఆర్య (23 బంతుల్లో 47), శశాంక్ సింగ్ (16 బంతుల్లో 44 నాటౌట్) రెచ్చిపోయారు.

3 ఓవర్లకు 17

కొండంత ఛేజింగ్ ను గుజరాత్ నెమ్మదిగా మొదలెట్టింది. అర్ష్ దీప్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 3 ఓవర్లకు 17 పరుగులే సాధించింది. కానీ ఆ తర్వాత కెప్టెన్ గిల్ గేరు మార్చాడు. అజ్మతుల్లా బౌలింగ్ లో రెండు సిక్సర్లు కొట్టాడు. కానీ బ్యాటింగ్ లో నిరాశపర్చిన మ్యాక్స్ వెల్.. గిల్ వికెట్ తో పంజాబ్ కు ఆనందాన్ని అందించాడు. 6 ఓవర్లకు గుజరాత్ 61/1తో నిలిచింది. అప్పటికే సాధించాల్సిన రన్ రేట్ 13 దాటింది.

ఆ జోడీ ధనాధన్

సాయి సుదర్శన్, బట్లర్ కలిసి పోరాడారు. ముఖ్యంగా సుదర్శన్ దూకుడు ప్రదర్శించాడు. 41 బంతుల్లోనే 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 74 పరుగులు చేశాడు. ఈ జోడీ రెండో వికెట్ కు 84 పరుగులు జోడించింది. కానీ సుదర్శన్ ను ఔట్ చేసి ఈ భాగస్వామ్యాన్ని అర్ష్ దీప్ విడగొట్టాడు. కానీ రూథర్ ఫర్డ్ వస్తూనే విరుచుకుపడ్డాడు. స్టాయినిస్ బౌలింగ్ లో రెండు సిక్సర్లు, ఓ ఫోర్ కొట్టాడు. గుజరాత్ విజయానికి 36 బంతుల్లో 75 పరుగులు కావాల్సి రావడంతో ఆ టీమ్ అద్భుతం చేస్తుందేమో అనిపించింది.

కానీ పంజాబ్ బౌలర్లు గుజరాత్ కు బ్రేక్ వేశారు. ఇంపాక్ట్ ప్లేయర్ వైశాక్, యాన్సెన్ గొప్పగా బౌలింగ్ చయడంతో 18 బంతుల్లో 57 పరుగులతో సమీకరణం గుజరాత్ కు కష్టంగా మారింది. ఆ తర్వాతి ఓవర్లోనే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసిన బట్లర్ ను యాన్సెన్ బౌల్డ్ చేయడంతో గుజరాత్ పనైపోయింది. అర్ష్ దీప్ వేసిన చివరి ఓవర్లో గుజరాత్ కు 27 పరుగులు అవసరమవగా.. 2 వికెట్లు కోల్పోయిన జట్టు 15 పరుగులే చేసింది.

కుర్రాడు కేక

ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో మొదట టాస్ ఓడిన పంజాబ్ కింగ్స్ ఫస్ట్ బ్యాటింగ్ కు దిగింది. ప్రియాన్ష్ ఆర్య, శ్రేయస్ మెరుపు బ్యాటింగ్ తో అలరించారు. పవర్ ప్లేలో పంజాబ్ 73/1తో నిలిచింది. ప్రమాదకర స్పిన్నర్ రషీద్ ఖాన్ తన తొలి ఓవర్లోనే ఆర్యను ఔట్ చేసి ఈ భాగస్వామ్యాన్ని విడగొట్టాడు. ఆర్య 7 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టాడు.

శ్రేయస్ సిక్సర్లు

10 ఓవర్లకు 104/2తో నిలిచిన పంజాబ్ ఆ తర్వాత కాస్త తడబడింది. స్పిన్నర్ సాయి కిశోర్ మూడు వికెట్లు పడగొట్టాడు. కానీ మరో ఎండ్ లో శ్రేయస్ మాత్రం సిక్సర్ల హిట్టింగ్ లో సాగిపోయాడు. ప్రసిద్ధ్ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్లో శ్రేయస్ విశ్వరూపమే చూపించాడు. వరుసగా 6, 4, 6, 6 బాదేశాడు. ఆఖర్లో శశాంక్ సింగ్ చెలరేగాడు. డేంజరస్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఓవర్లో రెండు సిక్సర్లు, ఓ ఫోర్ కొట్టాడు.

శ్రేయస్ సెంచరీపై చివర్లో ఉత్కంఠ నెలకొంది. ఆఖరి ఓవర్ కు ముందు శ్రేయస్ 97 పరుగులతో నిలిచాడు. కానీ సిరాజ్ వేసిన లాస్ట్ ఓవర్లో అన్ని బాల్స్ ను శశాంక్ ఆడాడు. వరుసగా 4, 2, 4, 4, 4, 4 కొట్టాడు. శశాంక్ 16 బంతుల్లోనే 6 ఫోర్లు, 2 సిక్సర్లతో అజేయంగా 44 పరుగులు చేశాడు. శశాంక్, శ్రేయస్ అభేద్యమైన ఆరో వికెట్ కు 28 బాల్స్ లోనే 81 రన్స్ పార్ట్‌న‌ర్‌షిప్‌ నమోదు చేయడం విశేషం.

Chandu Shanigarapu

TwittereMail
చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం