సూపర్ అయ్యర్.. ముంబైను చిత్తుచేసిన పంజాబ్.. ఐపీఎల్ 2025 ఫైనల్‍కు కింగ్స్.. హార్దిక్ సేన ఔట్-punjab kings enters ipl 2025 final after beating mumbai indians in qualifier 2 shreyas iyer super show pbks vs mi ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  సూపర్ అయ్యర్.. ముంబైను చిత్తుచేసిన పంజాబ్.. ఐపీఎల్ 2025 ఫైనల్‍కు కింగ్స్.. హార్దిక్ సేన ఔట్

సూపర్ అయ్యర్.. ముంబైను చిత్తుచేసిన పంజాబ్.. ఐపీఎల్ 2025 ఫైనల్‍కు కింగ్స్.. హార్దిక్ సేన ఔట్

ఐపీఎల్ 2025 ఫైనల్‍లోకి పంజాబ్ కింగ్స్ అడుగుపెట్టింది. క్వాలిఫయర్ 2లో ముంబై ఇండియన్స్ జట్టుపై కింగ్స్ అదిరిపోయే విజయం సాధించింది. శ్రేయస్ అయ్యర్ సూపర్ బ్యాటింగ్‍తో పంజాబ్‍ను గెలిపించాడు. ముంబై నిష్క్రమించింది.

సూపర్ అయ్యర్.. ముంబైను చిత్తుచేసిన పంజాబ్.. ఐపీఎల్ 2025 ఫైనల్‍కు కింగ్స్.. హార్దిక్ సేన ఔట్ (AP)

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 టైటిల్ ఫైట్‍లో పంజాబ్ కింగ్స్ అడుగుపెట్టింది. ఈ లీగ్ చరిత్రలో రెండోసారి ఫైనల్‍కు అర్హత సాధించింది. ముంబై ఇండియన్స్‌తో ఆదివారం (జూన్ 1) జరిగిన ఐపీఎల్ 2025 క్వాలిఫయర్ 2లో పంజాబ్ కింగ్స్ సత్తాచాటింది. 5 వికెట్ల తేడాతో ఓ ఓవర్ మిగిలిన ఉండగానే విజయం సాధించింది. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (41 బంతుల్లో 87 పరుగులు నాటౌట్; 5 ఫోర్లు, 8 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడి జట్టును గెలిపించాడు. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తుదిపోరులో తలపడేందుకు కింగ్స్ క్వాలిఫై అయింది.

అహ్మదాబాద్‍లోని నరేంద్ర మోదీ స్టేడియంలో వాన వల్ల సుమారు రెండు గంటలు ఆలస్యంగా మొదలైన ఈ క్వాలిఫయర్ 2 పోరులో పంజాబ్ దుమ్మురేపింది. ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇంటిబాటపట్టింది. ఈ మ్యాచ్ ఎలా సాగిందంటే..

బెయిర్‌స్టో, తిలక్ షో

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 203 పరుగులు చేసింది. సీనియర్ స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ (8) త్వరగా ఔటైనా.. మరో ఓపెనర్ జానీ బెయిర్‌స్టో (24 బంతుల్లో 38 పరుగులు) రాణించాడు. తెలుగు బ్యాటర్ తిలక్ వర్మ (29 బంతుల్లో 44 పరుగులు; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) అదరగొట్టాడు. బెయిర్ స్టో, తిలక్ దూకుడుగా ఆడడంతో ముంబై స్కోరు బోర్డు వేగంగా ముందుకు సాగింది. ఆరు ఓవర్లకు 65 రన్స్ వచ్చాయి.

అదరగొట్టిన సూర్య, నమన్

ఆ తర్వాత బెయిర్‌స్టోను పంజాబ్ పేసప్ వైశాఖ్ ఔట్ చేశాడు. తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ (26 బంతుల్లో 44 పరుగులు) వేగంగా ఆడారు. సూర్య 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో జోరు చూపాడు. అయితే, 14వ ఓవర్ చివరి బంతికి ఔటయ్యాడు. సూర్యను చాహల్ ఔట్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్లో తిలక్ కూడా పెవిలియన్ చేరాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా (13 బంతుల్లో 15 పరుగులు) వేగంగా ఆడలేకపోయాడు. యంగ్ ప్లేయర్ నమన్ ధీర్ (18 బంతుల్లో 37 పరుగులు) సత్తాచాటాడు. చివర్లో మెరుపులు మెరిపించారు. 7 ఫోర్లు బాది దూకుడు చూపాడు. చివరి ఓవర్లో ఔటయ్యాడు. నమన్ వేగంగా ఆడటంతో 200 మార్క్ దాటింది హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ముంబై. 20 ఓవర్లలో 203 రన్స్ చేయగలిగింది.

పంజాబ్ బౌలర్లలో అజ్మతుల్లా ఒమర్జాయ్ రెండు, కైల్ జెమీసన్, మార్కస్ స్టొయినిస్, విజయ్ కుమార్ వైశాఖ్, చాహల్‍కు తలా ఓ వికెట్ దక్కింది.

ఇంగ్లిస్ దూకుడు

204 పరుగుల లక్ష్యఛేదనలో పంజాబ్ కింగ్స్ ఆరంభంలో కాస్త తడబడింది. వేగంగా ఆడలేకపోయిన ప్రభ్‍సిమ్రన్ సింగ్ (6) మూడో ఓవర్లో ఔట్ కాగా.. ప్రియాన్ష్ ఆర్య (10 బంతుల్లో 20 పరుగులు; 2 ఫోర్లు, ఓ సిక్స్) దూకుడుగా ఆడాడు. మరో ఎండ్‍లో జోస్ ఇంగ్లిస్ (21 బంతుల్లో 38 పరుగులు; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) దుమ్మురేపాడు. జస్‍ప్రీత్ బుమ్రాను ఒకే ఓవర్లో 20 రన్స్ కొట్టాడు. ఇంగ్లిష్ దూకుడుతో పంజాబ్ స్కోరు పరుగులు పెట్టింది. అయితే, ఆరో ఓవర్లో ప్రియాన్ష్ ఔటయ్యాడు. జోరుగా ఆడుతున్న ఇంగ్లిష్‍ను హార్దిక్ పాండ్యా ఎనిమిదో ఓవర్లో ఔట్ చేసి కీలక వికెట్ పడగొట్టాడు.

శ్రేయస్, వధేరా మెరుపులు

పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మ్యాచ్ విన్నింగ్ హిట్టింగ్ చేశాడు. 41 బంతుల్లో అజేయంగా 87 పరుగులు బాది సత్తాచాటాడు. 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో మెరుపులు మెరిపించాడు. నేహాల్ వధేరా (29 బంతుల్లో 48 పరుగులు; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు. సూపర్ బ్యాటింగ్‍తో ముంబై బౌలర్లను ఈ ఇద్దరు ధీటుగా ఎదుర్కొన్నారు. లక్ష్యాన్ని కరిగిస్తూ వచ్చారు. 72 పరుగలే 3 వికెట్లు పడిన దశ నుంచి వీరిద్దరూ.. 47 బంతుల్లోనే 84 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వధేరాను 16న ఓవర్లో ఔట్ చేసి ముంబైకు బ్రేక్ ఇచ్చాడు యంగ్ పేసర్ అశ్వినీ కుమార్.

గర్జించిన అయ్యర్.. ఒకే ఓవర్లో నాలుగు సిక్స్‌లు

వధేరా ఔటైనా పంజాబ్ సారథి శ్రేయస్ అయ్యర్ మాత్రం జోరు కొనసాగించాడు. ధనాధన్ ఆటతో జట్టును విజయం దిశగా ముందుకు నడిపించాడు. ముంబై బౌలర్లను చితక్కొట్టాడు. శశాంక్ సింగ్ (2) రనౌట్‍తో కాస్త ఉత్కంఠ రేగినా.. శ్రేయస్ మాత్రం బాదుడు కంటిన్యూ చేశాడు. 2 ఓవర్లలో విజయానికి 23 పరుగులు అవసరం కాగా.. అశ్వినీ కుమార్ వేసిన 19వ ఓవర్లో నాలుగు సిక్స్‌లు బాదేశాడు శ్రేయస్. జట్టును గెలిపించేశాడు. టైటిల్ ఫైట్‍కు చేర్చాడు. 19 ఓవర్లలోనే 5 వికెట్లకు 207 పరుగుల చేసి గెలిచింది పంజాబ్. ముంబై బౌలర్లలో అశ్వినీ రెండు, హార్దిక్, బౌల్ట్ తలా ఓ వికెట్ తీసుకున్నారు.

కొత్త ఛాంపియన్ కన్ఫర్మ్

ఐపీఎల్ 2025 ఫైనల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య జూన్ 3న ఆహ్మదాబాద్ వేదికగా జరగనుంది. ఇప్పటి వరకు ఐపీఎల్ టైటిల్ గెలువని ఈ ఇరు జట్లు తుది పోరులో తలపడనున్నాయి. దీంతో ఐపీఎల్‍లో కొత్త ఛాంపియన్ అవతరించడం ఖాయంగా మారింది.

చివరగా 2014లో ఐపీఎల్ ఫైనల్ చేరింది పంజాబ్. మళ్లీ ఏకంగా 11 ఏళ్ల తర్వాత ఐపీఎల్ తుదిపోరులో అడుగుపెట్టింది. తొలి టైటిల్ కలను నెలవేర్చుకోవాలని ఆ జట్టు తహతహలాడుతోంది.

శ్రేయస్.. గతేడాది టైటిల్.. ఈసారి ఫైనల్‍కు..

శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో గతేడాది ఐపీఎల్‍లో కోల్‍కతా నైట్‍రైడర్స్ జట్టు టైటిల్ సాధించింది. మెగా వేలంలోకి వచ్చిన శ్రేయస్‍ను పంజాబ్ సొంతం చేసుకొని ఈ సీజన్‍కు కెప్టెన్‍ను చేసింది. ఈ ఐపీఎల్ 2025 సీజన్‍లో తన మార్క్ అగ్రెసివ్ కెప్టెన్సీ, సూపర్ బ్యాటింగ్‍తో పంజాబ్‍ను ఫైనల్‍లోకి తీసుకెళ్లాడు శ్రేయస్. మరి తుదిపోరులోనూ కింగ్స్ మ్యాజిక్ చేస్తుందేమో చూడాలి.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం