ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ మరోసారి అదరగొట్టింది. 11 ఏళ్ల తర్వాత ఫస్ట్ టైమ్ ఈ లీగ్ లో ప్లేఆఫ్స్ చేరిన ఆ టీమ్.. ఇప్పుడు ఏకంగా టాప్-2లో చోటు దక్కించుకుంది. సోమవారం (మే 26) జైపూర్ లో ముంబయి ఇండియన్స్ ను 7 వికెట్ల తేడాతో పంజాబ్ ఓడించింది. 185 పరుగుల ఛేజింగ్ ను 3 వికెట్లు కోల్పోయి 18.3 ఓవర్లలో కంప్లీట్ చేసింది.
జోష్ ఇంగ్లిస్ (42 బంతుల్లో 73; 9 ఫోర్లు, 3 సిక్సర్లు), ప్రియాన్ష్ ఆర్య (35 బంతుల్లో 62; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) పంజాబ్ ను గెలిపించారు. ముంబయిపై విక్టరీతో టాప్-2లో ప్లేస్ కన్ఫామ్ చేసుకున్న పంజాబ్.. నేరుగా క్వాలిఫయర్ 1 ఆడబోతోంది.
ఐపీఎల్ 2025లో ముంబయి ఇండియన్స్ తో ఛేజింగ్ లో పంజాబ్ కింగ్స్ విజయానికి బలమైన పునాది పడింది. అందుకు ప్రధాన కారణం ప్రియాన్ష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్. ప్రభ్ సిమ్రన్ సింగ్ (13)ను బుమ్రా త్వరగానే ఔట్ చేసినా.. ఆర్య, ఇంగ్లిస్ కలిసి పంజాబ్ ను నడిపించారు.
ముంబయి బౌలింగ్ ను ఈ జోడీ ఆటాడుకుంది. రెండో వికెట్ కు ఆర్య, ఇంగ్లిస్ 59 బంతుల్లోనే 109 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే అంతకుముందు పంజాబ్ ఛేజింగ్ నెమ్మదిగా మొదలైంది. దీపక్ చాహర్ రెండో ఓవర్ మెయిడిన్ గా వేశాడు. 5 ఓవర్లకు ఓ వికెట్ కోల్పోయిన పంజాబ్ 35 పరుగులే చేసింది.
ఆరో ఓవర్ నుంచి పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ జోరందుకుంది. ప్రియాన్ష్ ఆర్య, ఇంగ్లిస్ పోటీపడీ మరీ బౌండరీలు బాదారు. బౌలర్ ఎవరన్నది కూడా చూడలేదు. 10 ఓవర్లకు పంజాబ్ స్కోరు 89/1. కానీ ఆ తర్వాత ఇన్నింగ్స్ టాప్ గేరు అందుకుంది. అశ్వని కుమార్ ఓవర్లో ఇంగ్లిస్ హ్యాట్రిక్ ఫోర్లు కొట్టాడు. హార్దిక్ ఓవర్లో ఇంగ్లిస్, ఆర్య వరుసగా హాఫ్ సెంచరీలు కంప్లీట్ చేసుకున్నారు.
హార్దిక్ ఓవర్లో వరుసగా 4, 6తో ప్రియాన్ష్ ఆర్య ఫిఫ్టీ చేరుకున్నాడు. బుమ్రా బౌలింగ్ లోనూ సిక్సర్ కొట్టాడు ప్రియాన్ష్. అయితే ప్రియాన్ష్, ఇంగ్లిస్ ను శాంట్నర్ ఔట్ చేసిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (26 నాటౌట్)మ్యాచ్ ముగించాడు.
అంతకుముందు టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబయి ఇండియన్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 184 పరుగులు చేసింది. సెన్సేషనల్ ఫామ్ లో ఉన్న సూర్యకుమార్ యాదవ్ (39 బంతుల్లో 57; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) మరోసారి అత్యుత్తమ పోరాటంతో ముంబయిని ఆదుకున్నాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్, మార్కో యాన్సెన్, వైశాఖ్ తలో రెండు వికెట్లు తీశారు.
సంబంధిత కథనం