వాట్ ఏ మ్యాచ్. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 111 రన్స్ కే ఆలౌటైంది. ఛేజింగ్ లో ఓ దశలో 72/3తో నిలిచిన కేకేఆర్ విక్టరీ ఖాయమే అనిపించింది. కానీ చాహల్ మ్యాజిక్ తో 7 రన్స్ తేడాతో అయిదు వికెట్లు కోల్పోయింది. ఆఖర్లో రసెల్ బాదుడుతో ఉత్కంఠ రేగింది. కానీ పంజాబ్ హిస్టరీ క్రియేట్ చేసింది. ఐపీఎల్ చరిత్రలోనే అతి తక్కువ స్కోరును కాపాడుకున్న టీమ్ గా నిలిచింది.
మంగళవారం (ఏప్రిల్ 15) ముల్లాన్ పూర్ లో పంజాబ్ కింగ్స్ అద్భుతం చేసింది. ఫస్ట్ 111 రన్స్ మాత్రమే చేసిన ఆ టీమ్.. ఛేజింగ్ లో కేకేఆర్ ను 15.1 ఓవర్లలో 95 పరుగులకే ఆలౌట్ చేసింది. చాహల్ 4, యాన్సెన్ 3 వికెట్లతో పంజాబ్ ను గెలిపించారు. తన పాత టీమ్ కేకేఆర్ ను పంజాబ్ కింగ్స్ కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ దెబ్బకొట్టాడు.
ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ తో స్వల్ప ఛేదనలో కేకేఆర్ కు ఆరంభంలోనే షాక్ తగిలింది. రెండు ఓవర్లయినా పూర్తి కాకముందే ఓపెనర్లు పెవిలియన్ చేరిపోయారు. ఫస్ట్ ఓవర్లో నరైన్ ను యాన్సెన్ ఔట్ చేశాడు. ఆ వెంటనే ఐపీఎల్ డెబ్యూ చేసిన పేసర్ జేవియర్.. డికాక్ ను ఔట్ చేసి వికెట్ల ఖాతా తెరిచాడు.
ఛేజింగ్ ఆరంభంలోనే రెండు వికెట్లు పడ్డా కేకేఆర్ పై ఆ ఎఫెక్ట్ పడలేదంటే అందుకు కారణం యంగ్ ప్లేయర్ అంగ్ క్రిష్ రఘువన్శీ (37). ఈ కుర్రాడు మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. జేవియర్ ఓవర్లో రహానె (17) ఓ సిక్సర్, రఘువన్శీ ఓ సిక్సర్, ఫోర్ కొట్టాడు. 6 ఓవర్లకు 55/2తో కేకేఆర్ టార్గెట్ దిశగా దూసుకెళ్లింది.
రహానెను ఔట్ చేసిన చాహల్ ఈ భాగస్వామ్యాన్ని విడగొట్టాడు. రహానె ఎల్బీ రివ్యూ తీసుకుంటే నాటౌట్ గా నిలిచేవాడు. కానీ డీఆర్ఎస్ కోరకుండా వెళ్లిపోయాడు. ఆ వెంటనే జేవియర్ బాల్ ను ఆపి త్రో విసిరే ప్రయత్నంలో అది వెనక్కి వెళ్లి బౌండరీ లైన్ బయట పడటం గమనార్హం.
ఓటమి ఖాయమనుకున్న పంజాబ్ కింగ్స్ కు మ్యాజికల్ బౌలింగ్ లో చాహల్ ఆశలు కల్పించాడు. రహానె వికెట్ తీసిన అతను తర్వాతి ఓవర్లో రఘువన్శీని పెవిలియన్ చేర్చాడు. వెంకటేశ్ అయ్యర్ ను మ్యాక్స్ వెల్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. చాహల్ తన తర్వాతి ఓవర్లో అద్భుతమే చేశాడు. రింకు సింగ్, రమణ్ దీప్ ను వరుస బంతుల్లో ఔట్ చేశాడు.
రమణ్ దీప్ ప్యాడిల్ స్వీప్ ఆడగా ఫస్ట్ స్లిప్ లో ఉన్న శ్రేయస్ షాట్ ను అంచనా వేసి లెగ్ స్లిప్ లోకి వచ్చి క్యాచ్ అందుకోవడం విశేషం. కేకేఆర్ 77/7తో నిలవడంతో ఉత్కంఠ రేగింది. యాన్సెన్ బాల్ ను హర్షిత్ రాణా వికెట్ల మీదకు ఆడుకుని పెవిలియన్ చేరిపోయాడు.
కేకేఆర్ విజయానికి 42 బంతుల్లో 33 పరుగులు కావాలి.. చేతిలో రెండు వికెట్లే ఉన్నాయి. ఆ దశలో క్రీజులో ఉన్న రసెల్ పైనే ఆ టీమ్ ఆశలు పెట్టుకుంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా చాహల్ వేసి తర్వాతి ఓవర్లో రసెల్ రెండు సిక్సర్లు, ఓ ఫోర్ కొట్టాడు. మరో ఎండ్ లో అర్ష్ దీప్ ఓవర్లో అయిదు బాల్స్ ను ఆడిన వైభవ్ లాస్ట్ బంతికి ఔటైపోయాడు.
చేతిలో ఒకే వికెట్ తో కేకేఆర్ గెలుస్తుందన్న అంచనాలు తగ్గిపోయాయి. ఆ తర్వాతి ఓవర్ ఫస్ట్ బాల్ కే రసెల్ ను యాన్సెన్ బౌల్డ్ చేయడంతో పంజాబ్ కింగ్స్ రికార్డు విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ న కేకేఆర్ బౌలర్లు ఆటాడుకున్నారు. పవర్ ప్లేలో హర్షిత్ రాణా.. ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ కలిసి పంజాబ్ కు బ్రేక్ వేశారు. టాప్-3 బ్యాటర్ల వికెట్లను పేసర్ హర్షిత్ ఖాతాలో వేసుకున్నాడు.
మిడిల్ ఓవర్లలో మిస్టరీ స్పిన్నర్లు వరుణ్, సునీల్ చెరో రెండు వికెట్లతో తిప్పేశారు. దీంతో పంజాబ్ కింగ్స్ 15.3 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌటైంది. ప్రభ్ సిమ్రన్ (30) టాప్ స్కోరర్.
సంబంధిత కథనం