Prithvi Shaw: “అప్పుడు వదిలేస్తారు”: పృథ్వీ షా ఇంట్రెస్టింగ్ పోస్ట్
Prithvi Shaw: భారత యువ క్రికెటర్ వృథ్వీ షా సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ పోస్ట్ చేశాడు. ఇంగ్లండ్ కౌంటీ మ్యాచ్‍లో గాయపడిన అతడు ప్రస్తుతం కోలుకుంటున్నాడు.

Prithvi Shaw: భారత యువ బ్యాట్స్‌మన్ పృథ్వీ షాకు చాలా టాలెంట్ ఉంది. చిన్న వయసులోనే దేశవాళీ క్రికెట్‍లో చాలా రికార్డులు సృష్టించాడు. టీమిండియాలో అరంగేట్రం కూడా చేశాడు. అయితే, ఫిట్‍నెస్ లోపం, వివాదాలు, నిలకడగా ఆడలేకపోవడం లాంటి కారణాలతో భారత జట్టులో చోటు కోల్పోయాడు. టీమిండియాకు భవిష్యత్తులో స్టార్ అవుతాడని చాలా మంది ఆశించిగా.. పృథ్వీ ఆ స్థాయిలో రాణించలేకపోతున్నాడు. అయితే, టీమిండియాలో మళ్లీ చోటు దక్కించుకునే లక్ష్యంతో ఇటీవల ఇంగ్లండ్ కౌంటీల్లో సైతం ఆడాడు పృథ్వీ షా. ఈ క్రమంలోనే గాయపడ్డాడు.
ఇంగ్లండ్ కౌంటీ వన్డే కప్ టోర్నీలో ఈనెలలో నార్త్ హాంప్టన్‍షైర్ తరఫున బరిలోకి దిగి సత్తాచాటాడు పృథ్వీ షా. ఓ అద్భుతమైన డబుల్ సెంచరీ సహా తర్వాతి మ్యాచ్‍లోనే మెరుపు శతకంతో ఆకట్టుకన్నాడు. మళ్లీ ఫామ్ అందిపుచ్చుకున్నట్టు కనిపించాడు. అయితే, ఈ క్రమంలో అతడి మోకాలికి గాయం అయింది. దీంతో కౌంటీ వన్డే కప్ నుంచి వైదొలిగాడు. ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్నాడు. ఈ తరుణంలో పృథ్వీ షా.. నేడు ఇన్‍స్టాగ్రామ్‍లో ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీని పోస్ట్ చేశాడు. జీవితంలో కష్టాల్లో ఉన్నప్పుడు, పతనం అవుతున్నప్పుడు జనాలు వదిలేస్తారనే అర్థంతో పోస్ట్ చేశాడు.
“జీవితంలో పైకి వస్తున్నప్పుడు జనాలు చేతులు అందిస్తారు. అదే మీరు కిందికి దిగుతుంటే ఎప్పుడూ వదిలేస్తారు” అని ఇన్‍స్టాగ్రామ్‍లో స్టోరీ పోస్ట్ చేశాడు పృథ్వి. అంటే జీవితం పతనావస్థలో ఉంటే అందరూ వదిలేస్తారనే అర్థంతో ఈ పోస్ట్ చేశాడు. తాను మెట్లు దిగుతూ, గాయమైన మోకాలు కనపడే విధంగా ఉన్న ఫొటోను పృథ్వీ పంచుకున్నాడు.
పృథ్వీ షా చివరగా టీమిండియా తరఫున 2021లో శ్రీలంకతో టీ20 ఆడాడు. ఆ తర్వాత జట్టులో చోటు కోల్పోయాడు. మళ్లీ టీమిండియాలో ప్లేస్ కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈనెల ఇంగ్లండ్ కౌంటీ వన్డే కప్‍లో తిరిగి ఫామ్‍లోకి రావటంతో ఆశలు రేగాయి. ఇంతలోనే అతడు గాయపడడం ప్రతికూలంగా మారింది.