Andhra Cricket: ఇంతకుమించి ఏం పీకలేవు: హనుమ విహారిపై పృథ్విరాజ్ కామెంట్లు.. ఇతర ఆటగాళ్ల మద్దతు ఎవరికంటే..-prithvi raj reacts on hanuma vihari comments and controversy erupts in andhra cricket association cricket telugu sports ,cricket న్యూస్
తెలుగు న్యూస్  /  Cricket  /  Prithvi Raj Reacts On Hanuma Vihari Comments And Controversy Erupts In Andhra Cricket Association Cricket Telugu Sports

Andhra Cricket: ఇంతకుమించి ఏం పీకలేవు: హనుమ విహారిపై పృథ్విరాజ్ కామెంట్లు.. ఇతర ఆటగాళ్ల మద్దతు ఎవరికంటే..

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 26, 2024 06:41 PM IST

Hanuma Vihari - KN Prithvi: ఆంధ్ర రంజీ టీమ్ కెప్టెన్సీ నుంచి తనను ఎందుకు తప్పించారో స్టార్ ప్లేయర్ హనుమ విహారీ వెల్లడించాడు. అయితే, దీనికి పృథ్విరాజ్ అనే క్రికెటర్ స్పందించాడు. ఏమీ పీకలేవు అంటూ తీవ్రంగా పోస్ట్ చేశాడు.

హనుమ విహారి
హనుమ విహారి

Hanuma Vihari - Andhra Cricket: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA)లో తీవ్ర దుమారం రేగుతోంది. ఈ సీజన్ మధ్యలోనే కెప్టెన్‍గా ఉన్న సీనియర్ ప్లేయర్ హనుమ విహారీని కెప్టెన్సీ నుంచి ఏసీఏ తప్పించింది. అయితే, అప్పుడు విహారి మౌనంగా ఉన్నాడు. క్వార్టర్ ఫైనల్‍లో ఓటమితో ఆంధ్ర జట్టు ఈ ఏడాది సీజన్ నుంచి నిష్క్రమించింది. ఈ క్రమంలో తనను కెప్టెన్సీ నుంచి ఏసీఏ ఎందుకు తప్పించిందో ఆశ్చర్యకర విషయాలను హనుమ విహారీ నేడు వెల్లడించాడు. దీంతో దీనికి కారణమైన ప్లేయర్ కేఎన్ పృథ్విరాజ్ కూడా స్పందించాడు.

ట్రెండింగ్ వార్తలు

ఓ రాజకీయ నాయకుడి కుమారుడి (కేఎన్ పృథ్విరాజ్)ని అరిచినందుకే తనను ఆంధ్ర జట్టు కెప్టెన్సీ నుంచి ఏసీఏ తొలగించిందని విహారి వెల్లడించాడు. జట్టును ఏడేళ్లుగా విజయవంతంగా ముందుకు నడిపిస్తున్న తనను ఏ తప్పు లేకుండా తొలగించిందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాను అతడిపై ఎలాంటి వ్యక్తిగత దూషణ చేయలేదని వెల్లడించాడు. కెప్టెన్సీ నుంచి తొలగించి తనను అవమానించారని, ఇంకెప్పుడూ ఆంధ్ర జట్టుకు ఆడబోనని తేల్చిచెప్పేశాడు. విహారి కామెంట్లపై ప్లేయర్ కేఎన్ పృథ్విరాజ్ తన వివరణ ఇచ్చాడు.

సింపథి గేమ్స్ అంటూ..

తన గురించి విహారి చెప్పింది అబద్ధమని, అసభ్యకరమైన దూషణ అంగీకరించలేమని కుంట్రపాకం నరసింహ పృథ్విరాజ్ ఇన్‍స్టాగ్రామ్‍లో స్టోరీ పోస్ట్ చేశారు. ఏమైందో టీమ్‍లోని అందరికీ తెలుసని చెప్పాడు. ఇంతకు మించి ఏమీ పీకలేవంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.

హనుమ విహారి విషయంలో అందరూ వెతుకుతున్నది తన గురించే అంటూ స్టోరీ మొదలుపెట్టాడు కేఎన్ పృథ్విరాజ్. “మీరు విన్నదంతా అబద్ధం. అందరికంటే ఆటే ఎక్కువ. అన్నింటికన్నా ఆటనే నేను ఎక్కువగా గౌరవిస్తా. ఎలాంటి చోటైనా అసభ్యకరమైన మాటలు, వ్యక్తిగత దాడి సరైనది కాదు. ఆ రోజు ఏం జరిగిందో జట్టులోని ప్రతీ ఒక్కరికీ తెలుసు. చాంపియన్ అని చెప్పుకునే నువ్వు ఇంతకు మించి ఏమీ పీకలేవు. కావాల్సిన విధంగా సింపథీ గేమ్స్ ఆడుకో” అని పృథ్విరాజ్ పోస్ట్ చేశాడు.

కేఎన్ పృథ్విరాజ్ తండ్రి .. ఆంధ్రప్రదేశ్‍లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయకుడని, ఆయన ఒత్తిడితోనే విహారిని కెప్టెన్సీ నుంచి ఏసీఏ తొలగించినట్టు ఆరోపణలు తీవ్రమవుతున్నాయి. ఏసీఏలో డర్టీ పాలిటిక్స్ నడుస్తున్నాయంటూ విమర్శలు వస్తున్నాయి.

ఆటగాళ్లు మద్దతు విహారికే..

హనుమ విహారినే కెప్టెన్‍గా కొనసాగించాలని ఆంధ్ర జట్టు ఆటగాళ్లందరూ సంతకాలతో కూడిన లేఖను కూడా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‍కు అందించారు. ఈ లెటర్ తాజాగా బయటికి వచ్చింది. బెంగాల్‍తో అద్భుత విజయం తర్వాత విహారిని కెప్టెన్సీ నుంచి ఏసీఏ తప్పించింది. అయితే, సారథిగా విహారి ఉండడం జట్టుకు చాలా ముఖ్యమని ఆటగాళ్లు ఆ లేఖలో తెలిపారు. అయినా.. ఏసీఏ మాత్రం పట్టించుకోలేదు. ఆంధ్ర క్రికెట్‍లో ఈ వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీస్తోంది.

హనుమ విహారి సారథ్యంలో ఆంధ్ర క్రికెట్ జట్టు గత ఏడేళ్లలో ఐదుసార్లు క్వార్టర్ ఫైనల్ చేరింది. విహారి అనేక అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. టీమిండియా తరఫున కూడా 16 టెస్టులు ఆడాడు విహారి. అలాంటి, విహారిని ఈ తరహాలో కెప్టెన్సీ నుంచి తొలగించడం సరికాదంటూ ఏసీఏపై సోషల్ మీడియాలో తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. అయితే, ఈ విషయంపై ఏసీఏ ఇంకా అధికారికంగా స్పందించలేదు.

IPL_Entry_Point