Prasad on Team India: సిల్లీ స్టేట్‌మెంట్లు వద్దు.. ఆత్మపరిశీలన చేసుకోండి: టీమిండియాపై మండిపడిన మాజీ బౌలర్
Prasad on Team India: సిల్లీ స్టేట్‌మెంట్లు వద్దు.. ఆత్మపరిశీలన చేసుకోండి అంటూ టీమిండియాపై మండిపడ్డాడు మాజీ పేస్ బౌలర్ వెంకటేశ్ ప్రసాద్. వెస్టిండీస్ చేతుల్లో టీ20 సిరీస్ ఓటమి తర్వాత వరుస ట్వీట్లలో ద్రవిడ్, హార్దిక్ లను అతడు ఏకిపారేశాడు.
Prasad on Team India: వరల్డ్ కప్‌కు అర్హత సాధించని వెస్టిండీస్ చేతుల్లో టీ20 సిరీస్ ఓటమిపై మాజీ పేస్ బౌలర్ వెంకటేశ్ ప్రసాద్ తీవ్రంగా మండిపడ్డాడు. ఐదు టీ20ల సిరీస్ ను ఇండియా 2-3తో ఓడిపోయిన విషయం తెలిసిందే. చివరి మ్యాచ్ ముగియగానే వరుస ట్వీట్లలో ఇండియన్ టీమ్ ను ప్రసాద్ ఏకిపారేశాడు. కొన్నాళ్లుగా పరిమిత ఓవర్ల క్రికెట్ లో ఇండియన్ టీమ్ ప్రదర్శన మరీ దారుణంగా ఉందని అన్నాడు.
ట్రెండింగ్ వార్తలు
"కొన్నాళ్లుగా పరిమిత ఓవర్ల క్రికెట్ లో ఇండియా ప్రదర్శన చాలా చాలా సాధారణంగా ఉంది. కొన్నాళ్ల కిందట కనీసం టీ20 వరల్డ్ కప్ కు కూడా అర్హత సాధించని వెస్టిండీస్ చేతుల్లోనూ ఓడిపోయారు. వన్డే సిరీస్ లో బంగ్లాదేశ్ చేతుల్లో పరాజయం పాలయ్యారు. సిల్లీ స్టేట్‌మెంట్లు చేయకుండా ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకుంటారని ఆశిస్తున్నా" అని వెంకటేశ్ ప్రసాద్ ట్వీట్ చేశాడు.
ఈ ఓటముల కంటే టీమ్ మేనేజ్‌మెంట్ పరిస్థితిని డీల్ చేసిన తీరు తనను బాధిస్తోందని ప్రసాద్ అన్నాడు. ఇప్పుడున్న పరిమిత ఓవర్ల జట్టులో గెలవాలన్న కసి కనిపించడం లేదని ప్రసాద్ స్పష్టం చేశాడు. ఈ ఓటమికి కెప్టెన్ హార్దిక్ పాండ్యా, కోచ్ రాహుల్ ద్రవిడ్ లదే బాధ్యత అని ప్రసాద్ తేల్చి చెప్పాడు. ఈ సందర్భంగా ధోనీ గురించి కూడా గుర్తు చేశాడు.
"ఈ ఓటమికి వాళ్లదే బాధ్యత. వాళ్లే సమాధానం చెప్పాలి. ప్రాసెస్ లాంటి పదాలను దుర్వినియోగం చేస్తున్నారు. ధోనీ అప్పుడు మనస్ఫూర్తిగా ఆ మాట చెప్పాడు. కానీ ఇప్పటి కెప్టెన్లు ఏదో ఆ పదం వాడేస్తున్నారంతే. టీమ్ ఎంపికలో నిలకడ లేదు. ఇండియా తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలి. గెలవాలన్న ఆకలి కనిపించడం లేదు. తరచూ కెప్టెన్ ఏం చేయాలో పాలుపోని స్థితిలో కనిపిస్తున్నాడు. బౌలర్లు బ్యాటింగ్ చేయలేరు. బ్యాటర్లు బౌలింగ్ చేయలేరు. మీ ఫేవరెట్ ప్లేయర్ అని చెప్పేసి ఎంపిక చేయడం కాదు. దీర్ఘకాలంలో జరిగే మంచి చూడండి" అని ప్రసాద్ సూచించాడు.
వెస్టిండీస్ తో ఆదివారం (ఆగస్ట్ 13) జరిగిన చివరి టీ20లో ఇండియా ఓడిపోయిన విషయం తెలిసిందే. 8 వికెట్లతో గెలిచిన విండీస్.. ఏడేళ్ల తర్వాత ఇండియాపై టీ20 సిరీస్ గెలిచింది. ఐదు టీ20ల సిరీస్ ను 3-2తో ఎగరేసుకుపోయింది. ఈ సిరీస్ లో తొలి రెండు మ్యాచ్ లు విండీస్, తర్వాతి రెండు మ్యాచ్ లు ఇండియా గెలవగా.. నిర్ణయాత్మక మ్యాచ్ లో బౌలర్లు చేతులెత్తేయడంతో ఇండియా సిరీస్ కోల్పోయింది.