Varanasi Stadium: సచిన్‍కు ‘నమో’ గిఫ్ట్ ఇచ్చిన ప్రధాని మోదీ: వీడియో.. స్టేడియానికి శంకుస్థాపన.. శివుడి థీమ్‍తో..
Varanasi Stadium: వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి శంకుస్థాపన చేశారు ప్రధాని మోదీ. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
Varanasi Stadium: భారత్‍లో మరో అధునాతన అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణం కానుంది. ఉత్తర ప్రదేశ్‍లోని వారణాసి(కాశీ)లో ఈ స్టేడియం రూపొందనుంది. ఈ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియానికి నేడు (సెప్టెంబర్ 23) శంకుస్థాపన చేశారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. వారణాసిలో జరిగిన బహిరంగ సభ వేదికగా ఆయన స్టేడియం నిర్మాణానికి అంకురార్పన చేశారు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, మరికొందరు మాజీ క్రికెటర్లు, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా మరికొందరు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వివరాలివే..
ట్రెండింగ్ వార్తలు
వారణాసిలో క్రికెట్ స్టేడియానికి శంకుస్థాపన సందర్భంగా.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు ఓ కానుక ఇచ్చారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. నమో (Namo) అని రాసి ఉన్న టీమిండియా జెర్సీని సచిన్‍కు అందజేశారు. లిటిల్ మాస్టర్‌ను అభినందించారు. ఆ సమయంలో కార్యక్రమానికి హాజరైన వారందరూ ఆనందంతో హర్షధ్వానాలు చేశారు. ప్రధాని మోదీ.. ఎంపీగా వారణాసి నుంచే ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
సుమారు రూ.451 కోట్ల ఖర్చుతో వారణాసిలో ఈ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మితం కానుంది. శంకుస్థాపన కార్యక్రమానికి బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా కూడా హాజరయ్యారు.
మహా శివుడి థీమ్‍తో..
ప్రముఖ పుణ్యక్షేత్రమైన వారణాసిలో ఈ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం మహాశివుడి థీమ్‍తో ఉంటుందని తెలుస్తోంది. ఈ స్టేడియం డూమ్.. ఢమరుకం షేప్‍లో ఉండనుందని సమాచారం బయటికి వచ్చింది. అలాగే.. ఫ్లడ్ లైట్స్ శివుడి త్రిశూలం ఆకారంలో, ఎంట్రెన్స్ డిజైన్ బిల్వ పత్రాల్లా ఉంటాయని సమాచారం. స్టేడియం రూఫ్ నెలవంక ఆకారాన్ని పోలి ఉండనుంది. స్టేడియంలో సీటింగ్ స్టాండ్స్ గంగాఘాట్ స్ఫూర్తితో నిర్మితమవుతాయని ప్రాథమికంగా తెలుస్తోంది.
స్టేడియానికి శంకుస్థాపన చేసిన తర్వాత సభలో మోదీ మాట్లాడారు. “మహాదేవుడి నగరంలో నిర్మించే ఈ స్టేడియాన్ని మహాదేవుడికే అంకితమిస్తున్నాం. కాశీ (వారణాసి)లో నిర్మించే ఈ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వల్ల క్రీడాకారులు లబ్ధి పొందబోతున్నారు. పూర్వాంచల్ ప్రాంతానికి ఈ స్టేడియం స్టార్ కానుంది” అని మోదీ చెప్పారు.
టాపిక్