Pink Ball Test: పింక్ బాల్ టెస్టులో ఓటమి అంచున టీమిండియా.. రెండో రోజూ ఆస్ట్రేలియాదే పైచేయి.. మళ్లీ బ్యాట్లెత్తేసారు
Pink Ball Test: పింక్ బాల్ టెస్టులో టీమిండియా ఓటమి అంచున నిలిచింది. రెండో రోజు కూడా ఆస్ట్రేలియాదే పైచేయి కాగా.. రెండో ఇన్నింగ్స్ లోనూ మన బ్యాటర్లు చేతులెత్తేశారు. ప్రస్తుతం ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకునేందుకు మాత్రమే పోరాడుతోంది.
Pink Ball Test: ఆస్ట్రేలియాతో జరుగుతున్న డేనైట్ టెస్టులో టీమిండియా ఓటమి దాదాపు ఖాయమైంది. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియాకు భారీ స్కోరు సమర్పించుకున్న ఇండియన్ టీమ్.. తర్వాత రెండో ఇన్నింగ్స్ లోనూ బ్యాట్ తో విఫలమవుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్ లో 5 వికెట్లకు 128 రన్స్ చేసింది. ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకునేందుకు మరో 29 పరుగులు చేయాల్సి ఉంది.
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
పింక్ బాల్ టెస్టు చేజారినట్లే..
అడిలైడ్ లో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో మూడో రోజే టీమిండియా ఓటమి దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియాకు 157 పరుగుల ఆధిక్యం సమర్పించుకోగా.. రెండో ఇన్నింగ్స్ లోనూ టాప్, మిడిలార్డర్ బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ఓపెనర్లు రాహుల్ (7), యశస్వి (24), విరాట్ కోహ్లి (11), శుభ్‌మన్ గిల్ (28), రోహిత్ శర్మ (6) చేతులెత్తేశారు.
రెండో రోజు ఆట ముగిసే సమయానికి రిషబ్ పంత్ 28, నితీష్ కుమార్ రెడ్డి 15 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఐదు వికెట్లకు 128 పరుగులతో ఉండగా.. ఇంకా 29 పరుగులు వెనుకబడే ఉంది. మూడో రోజు ఉదయం ఈ ఇద్దరూ ఎంత సేపు క్రీజులో ఉంటారన్నదానిపై టీమిండియాకు ఆధిక్యం ఆధారపడి ఉంది.
రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా పేసర్ల దెబ్బకు టీమిండియా బ్యాటర్లు నిలవలేకపోయారు. నాలుగో ఓవర్లో 12 పరుగుల దగ్గరే తొలి వికెట్ పడింది. రాహుల్ 7 పరుగులకే ఔటయ్యాడు. ఆ తర్వాత గిల్ తో కలిసి యశస్వి ఇన్నింగ్స్ నిర్మించేలా కనిపించినా.. అతడు కూడా 24 రన్స్ చేసి పెవిలియన్ చేరాడు.
ఆస్ట్రేలియా బౌలర్లలో కమిన్స్, బోలాండ్ చెరో రెండు వికెట్లు తీయగా.. స్టార్క్ కు ఒక వికెట్ పడింది. రెండో ఇన్నింగ్స్ లో ఓవర్ కు ఐదుకుపైగా పరుగులు చేసినా.. వికెట్లు కాపాడుకోవడంలో మాత్రం మనవాళ్లు విఫలమయ్యారు. దీంతో ఈ మ్యాచ్ లో ఓటమి నుంచి గట్టెక్కడం అంత సులువుగా కనిపించడం లేదు.
ఆస్ట్రేలియా 337 ఆలౌట్
అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 337 రన్స్ కు ఆలౌటైంది. ట్రావిస్ హెడ్ (140) సెంచరీ, లబుషేన్ (64) హాఫ్ సెంచరీతో తొలి ఇన్నింగ్స్ లో 337 పరుగులకు ఆలౌటైంది. ఇండియా తరఫున బుమ్రా, సిరాజ్ చెరో నాలుగు వికెట్లు తీసుకున్నారు.
నితీష్ కుమార్ రెడ్డి, అశ్విన్ చెరొక వికెట్ తీయగా.. కొత్త బౌలర్ హర్షిత్ రాణా వికెట్ తీయకపోగా భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. టీమిండియా అంటేనే చెలరేగిపోయే ట్రావిస్ హెడ్ మరోసారి మన బౌలర్లకు చుక్కలు చూపించాడు. గతేడాది డబ్ల్యూటీసీ ఫైనల్, వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మరోసారి గుర్తు చేస్తూ.. అడిలైడ్ లో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో సెంచరీ బాదాడు. రెండో రోజు ఆటలో హెడ్ కేవలం 111 బంతుల్లోనే సెంచరీ చేయడం విశేషం.