Champions Trophy: ఐసీసీ చెప్పిందే చేశాం.. భారత జెండా లేకపోవడంపై పీసీబీ వింత వివరణ
Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు కరాచిలో ఎగరేసిన జాతీయ పతాకాల్లో భారత జెండా లేకపోవడం కలకలం రేపింది. అయితే ఐసీసీ సూచనలే పాటించామని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వింత వివరణ ఇచ్చింది.

మరో రెండు రోజుల్లో (ఫిబ్రవరి 19) ఆరంభమయ్యే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) వైఖరి వివాదాస్పదంగా మారింది. కరాచిలోని జాతీయ స్టేడియంలో భారత త్రివర్ణ పతాకం కనిపించకపోవడంతో ఇండియన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అయితే ఐసీసీ సూచనల మేరకే జెండాలు ఏర్పాటు చేశామని పీసీబీ వివరణ ఇచ్చింది.
నాలుగు జెండాలే
మ్యాచ్ లు జరిగే రోజు నాలుగు జెండాలు మాత్రమే ఎగరేయాలని ఐసీసీ నుంచి ఆదేశాలు వచ్చాయని హిందూస్థాన్ టైమ్స్ తో పీసీబీ తెలిపింది. ‘‘మ్యాచ్ ల సమయాల్లో స్టేడియాల్లో ఐసీసీ (ఈవెంట్ అథారిటీ), పీసీబీ (ఈవెంట్ హోస్ట్), ఆ రోజు పోటీ పడే రెండు జట్లు కలిపి నాలుగు జెండాలను మాత్రమే ఎగురవేయాలని ఐసీసీ సూచించింది. సింపుల్’’ అని ఓ పీసీబీ అధికార ప్రతినిధి హిందుస్థాన్ టైమ్స్ తో చెప్పాడు.
మిగతా పతకాలు ఎందుకు?
ఐసీసీ చెప్పినట్లు పీసీబీ పాటిస్తే మ్యాచ్ రోజుల్లో నాలుగు జెండాలు మాత్రమే ఎగరేయాలి. కానీ ఇంకా టోర్నీ ఆరంభం కాకముందే కరాచి జాతీయ స్టేడియంలో భారత్ మినహా టోర్నీలో పాల్గొనే మిగతా జట్ల పతాకాలను ఆవిష్కరించారు. కేవలం త్రివర్ణ పతాకాన్ని మాత్రమే ఏర్పాటు చేయలేదు. ఐసీసీ సూచన ప్రకారం నాలుగు జెండాలు మాత్రమే ఉండాలి కానీ మిగతా దేశాల పతాకాలు ఎందుకు ఎగరవేశారనే ప్రశ్నలు వస్తున్నాయి.
ప్రతీకార చర్య
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాక్ కు వెళ్లేందుకు టీమ్ఇండియా నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో తమ మ్యాచ్ లను దుబాయ్ లో భారత్ ఆడబోతోంది. అందుకే ప్రతీకార చర్యగా భారత పతాకాన్ని పాకిస్థాన్ లో ఎగరవేయలేదనే విమర్శలు వస్తున్నాయి. పైకి ఐసీసీ చెప్పిందని చెబుతున్నా పాక్ మరోసారి భారత్ పట్ల వక్రబుద్ధి ప్రదర్శించిందని ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
సంబంధిత కథనం