Pat Cummins vs Pant: పంత్ పని పడతాం.. మాకో ప్లాన్ ఉంది: హిందుస్థాన్ టైమ్స్ డిజిటల్‌తో ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్-pat cummins says they will silence rishabh pant in the upcoming border gavaskar trophy ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Pat Cummins Vs Pant: పంత్ పని పడతాం.. మాకో ప్లాన్ ఉంది: హిందుస్థాన్ టైమ్స్ డిజిటల్‌తో ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్

Pat Cummins vs Pant: పంత్ పని పడతాం.. మాకో ప్లాన్ ఉంది: హిందుస్థాన్ టైమ్స్ డిజిటల్‌తో ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్

Hari Prasad S HT Telugu
Nov 07, 2024 09:03 AM IST

Pat Cummins vs Pant: రాబోయే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ముందు హిందుస్థాన్ టైమ్స్ డిజిటల్ తో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ మాట్లాడాడు. ఈ సందర్భంగా రిషబ్ పంత్ కు ఎలా చెక్ పెట్టాలో తమకు తెలుసంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

పంత్ పని పడతాం.. మాకో ప్లాన్ ఉంది: హిందుస్థాన్ టైమ్స్ డిజిటల్‌తో ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్
పంత్ పని పడతాం.. మాకో ప్లాన్ ఉంది: హిందుస్థాన్ టైమ్స్ డిజిటల్‌తో ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (AFP)

Pat Cummins vs Pant: ప్యాట్ కమిన్స్.. ఆస్ట్రేలియా విజయవంతమైన కెప్టెన్లలో ఒకడు. ఒత్తిడిలో రాణించడంలో తనకు ఎవరూ దగ్గరగా రారని ఆస్ట్రేలియా కెప్టెన్ పదేపదే నిరూపించాడు. ఒత్తిడిలో కీలక పరుగులు చేసినా, జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కీలక వికెట్లు తీసినా కమిన్స్ ది విజయాల్లో ఎప్పుడూ కీలకపాత్రే. కేవలం రెండేళ్లలోనే కమిన్స్ ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ కెప్టెన్లలో ఒకడిగా ఎదిగాడు.

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ

పాకిస్థాన్ తో ఆస్ట్రేలియా వైట్ బాల్ సిరీస్ ఆడుతున్నప్పటికీ ప్రపంచ దృష్టి రాబోయే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీపైనే ఉంది. పెర్త్, అడిలైడ్, బ్రిస్బేన్, మెల్బోర్న్, సిడ్నీల్లో జరిగే ఐదు టెస్టుల సిరీస్ లో కమిన్స్ సారథ్యంలోని ఆస్ట్రేలియా, రోహిత్ శర్మ సారథ్యంలోని భారత్ తలపడనున్నాయి.

గతేడాది ఇండియాను రెండుసార్లు ఓడించి డబ్ల్యూటీసీ టైటిల్, వన్డే వరల్డ్ కప్ గెలిచినా.. ఓ టెస్టు సిరీస్ లో ఇప్పటి వరకూ కమిన్స్ కెప్టెన్సీలోని ఆస్ట్రేలియా.. భారత్ ను ఓడించలేదు. ఇప్పుడా రికార్డును కూడా తన ఖాతాలో వేసుకోవాలని కమిన్స్ తహతహలాడుతున్నాడు.

2014-15లో చివరిసారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలుచుకున్న ఆస్ట్రేలియా.. తర్వాత వరుసగా నాలుగుసార్లు ఓడిపోయింది. నవంబర్ 22 నుంచి ఐదు మ్యాచ్ ల సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో హిందుస్థాన్ టైమ్స్ డిజిటల్.. కమిన్స్ తో ఫ్రీ వీలింగ్ చాట్ లో మాట్లాడింది.

2014-15 తర్వాత ఆస్ట్రేలియా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని గెలవకపోవడం, గత రెండు టెస్టు సిరీస్ లను భారత్ గెలుచుకోవడంతో ఆస్ట్రేలియాపై ఎంత ఒత్తిడి ఉందని మీరు భావిస్తున్నారు?

స్వదేశంలో టెస్టు మ్యాచ్ ఆడిన ప్రతిసారీ ఒత్తిడి ఉంటుంది. స్వదేశంలో మంచి ప్రదర్శన చేయాలని ఆస్ట్రేలియా ప్రేక్షకుల్లో ఎక్కువ మంది ఆశిస్తున్నారని, మేము ఆటగాళ్లుగా కూడా రాణిస్తామని నేను అనుకుంటున్నాను. ఇది మాకు అలవాటు అయిన ఒత్తిడే. ఈసారి మేము మెరుగ్గా రాణిస్తాం.

స్వదేశంలో న్యూజిలాండ్ తో టెస్టు సిరీస్ ను భారత్ ఇటీవలే కోల్పోయింది. దాని వల్ల మీకు ఏమైనా ప్రయోజనం కలుగుతుందా?

ఇది నిజంగా నేను చెప్పాల్సిన విషయం కాదు. నిజంగా నాకు తెలియదు. కానీ అది చాలా మంచి సిరీస్. న్యూజిలాండ్ చాలా బాగా ఆడింది. మరి ఆ సిరీస్ ప్రభావం రాబోయే సిరీస్ పై ఎంత వరకూ ఉంటుందో చూడాలి.

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇద్దరూ పరుగుల కోసం కష్టపడుతున్నారు. వీళ్లే ప్రధాన లక్ష్యంగా ఆస్ట్రేలియా బరిలోకి దిగుతోంది. మరి వీళ్ల ఫామ్ చూస్తుంటే మీకు అనుకూలంగా అనిపిస్తోందా?

అది చెప్పడం కష్టం, నిజంగా. ప్రతి ఆటగాడికీ ఇది సహజం. ఫామ్ కోల్పోతుంటారు. సుదీర్ఘమైన టెస్టు కెరీర్లో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఇండియన్ బ్యాటర్లను సాధ్యమైనంత వరకు కట్టడి చేయడమే మా లక్ష్యం. అందువల్ల చూడాలి ఏం జరుగుతుందో. ఆ ఇద్దరూ ఇండియన్ టీమ్ లో ఎంతో అనుభజ్ఞులైన ప్లేయర్స్.

ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో ఇబ్బంది పడినప్పుడల్లా రిషబ్ పంత్ భారత్ ను ఆదుకుంటాడు. ఈ సిరీస్ లో అతడిని కట్టడి చేయడం ముఖ్యమని భావిస్తున్నారా?

అవును, అతను ఎప్పుడూ ఆటను చాలా వేగంగా మార్చగలిగిన వ్యక్తి. అందుకే కొందరు మంచి ప్లేయర్స్ కు ప్రత్యేకంగా ప్లాన్స్ ఉండాల్సిందే. ఆస్ట్రేలియాలో అతడు చాలా బాగా ఆడాడు. అతడు క్రీజులో ఉన్నంతసేపూ చాలా ప్రమాదకరమే. అందుకే అతని కోసం ప్రత్యేకంగా ప్రణాళికలు వేయడానికి ప్రయత్నిస్తాం. అవి వర్కౌట్ అవుతాయని ఆశిస్తున్నాం.

డబ్ల్యూటీసీ పాయింట్లతో ముడిపడి ఉన్న నేపథ్యంలో ఈ సిరీస్ కు మరింత ప్రాధాన్యత ఉందని అనుకుంటున్నారా?

డబ్ల్యూటీసీ అదనపు ప్రేరణను అందిస్తుంది. కిందటిసారి గెలిచాం కాబట్టి ఆ టైటిల్ ను కాపాడుకోవాలనే పట్టుదలతో ఉన్నాం. సహజంగానే ప్రతి టెస్టు మ్యాచ్ గెలవాలని ప్రయత్నిస్తున్నా ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్లను సాధించడానికి ఈ సిరీస్ లో మంచి అవకాశం ఉంది. దాని గురించి చాలా మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు ఇండియాతో సిరీస్ తర్వాత శ్రీలంకతో సిరీస్ ఉంది. ఈ సైకిల్లో మేము ఆడబోయే చివరి రెండు సిరీస్ లు ఇవి.

Whats_app_banner