Pakistan World Cup Team: పాకిస్థాన్ వరల్డ్ కప్ టీమ్ ఇదే.. ఆ స్టార్ బౌలర్ లేకుండానే బరిలోకి..
Pakistan World Cup Team: పాకిస్థాన్ వరల్డ్ కప్ టీమ్ అనౌన్స్ చేశారు. స్టార్ పేస్ బౌలర్ నసీమ్ షా లేకుండానే ఆ టీమ్ బరిలోకి దిగనుంది. ఆసియా కప్ 2023లో గాయపడిన అతడు.. ఇంకా కోలుకోలేదు.
Pakistan World Cup Team: ఇండియాలో జరగబోయే వరల్డ్ కప్ 2023 కోసం పాకిస్థాన్ తమ 15 మంది సభ్యుల జట్టును శుక్రవారం (సెప్టెంబర్ 22) అనౌన్స్ చేసింది. భుజం గాయంతో బాధపడుతున్న స్టార్ బౌలర్ నసీమ్ షా లేకుండానే ఆ టీమ్ వరల్డ్ కప్ కు రానుంది. దీంతో అతని స్థానంలో ఏడాదికిపైగా అసలు వన్డేలే ఆడని హసన్ అలీని జట్టులోకి తీసుకుంది.
ట్రెండింగ్ వార్తలు
వరల్డ్ కప్ ఆడబోయే 15 మంది సభ్యుల పాకిస్థాన్ జట్టును అక్కడి సెలక్టర్లు ప్రకటించారు. ఆసియా కప్ లోనే గాయపడిన మరో పేస్ బౌలర్ హారిస్ రౌఫ్ మాత్రం జట్టులో చోటు సంపాదించాడు. ఇక ఫామ్ లేమితో తంటాలు పడుతున్న ఫఖర్ జమాన్ కు కూడా సెలక్టర్లు వరల్డ్ కప్ టీమ్ లో చోటు కల్పించడం విశేషం. ఇండియాతో మ్యాచ్ లో నసీమ్ షా భుజానికి గాయమైన విషయం తెలిసిందే.
దీంతో ఆ మ్యాచ్ లో తన ఓవర్ల కోటా పూర్తి చేయకుండానే అతడు బయటకు వెళ్లిపోయాడు. గతేడాది జూన్ లో పాకిస్థాన్ తరఫున చివరిసారి వన్డే ఆడిన హసన్ అలీ జట్టులోకి తిరిగి వచ్చాడు. 2019 వరల్డ్ కప్ జట్టులోనూ అతడు ఉన్నాడు. గాయాల సమస్య ఎక్కువగా ఉందని, అనుభవజ్ఞుడైన పేస్ బౌలర్ ను తీసుకోవాలన్న ఉద్దేశంతోనే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు పీసీబీ చీఫ్ సెలక్టర్ ఇంజిమాముల్ హక్ అన్నాడు.
నసీమ్ షాకు తీసిన స్కాన్లు చూస్తుంటే.. అతడు వరల్డ్ కప్ తర్వాత కూడా జట్టుకు దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయని ఇంజీ చెప్పాడు. షహీన్ అఫ్రిది, హారిస్ రౌఫ్ లతో కలిసి నసీమ్ షా పాక్ జట్టులో కీలక బౌలర్ గా ఎదిగాడు. అతడు లేకపోవడం ఒక రకంగా ఆ జట్టుకు పెద్ద దెబ్బే అని చెప్పాలి. ఇక వరల్డ్ కప్ టీమ్ లో ఫహీమ్ అష్రఫ్ కు చోటు దక్కకపోవడం కూడా ఆశ్చర్యం కలిగించింది.
వరల్డ్ కప్ 2023 కోసం పాకిస్థాన్ టీమ్ ఇదే
ఫఖర్ జమాన్, ఇమాముల్ హక్, అబ్దుల్లా షఫీక్, బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్, సాద్ షకీల్, ఇఫ్తికార్ అహ్మద్, అఘా సల్మాన్, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, ఉసామా మిర్, షహీన్ అఫ్రిది, హారిస్ రౌఫ్, మహ్మద్ వసీం జూనియర్, హసన్ అలీ