Babar Azam Towel: పాక్ కెప్టెన్ బాబర్ అజామ్‌కి ప్యాంట్ దొరక్కపోవడంతో.. గ్రౌండ్‌లో టవల్ చుట్టుకుని పరుగు-pakistan white ball captain babar azam misplaces trousers wraps towel to save face before prayers ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Babar Azam Towel: పాక్ కెప్టెన్ బాబర్ అజామ్‌కి ప్యాంట్ దొరక్కపోవడంతో.. గ్రౌండ్‌లో టవల్ చుట్టుకుని పరుగు

Babar Azam Towel: పాక్ కెప్టెన్ బాబర్ అజామ్‌కి ప్యాంట్ దొరక్కపోవడంతో.. గ్రౌండ్‌లో టవల్ చుట్టుకుని పరుగు

Galeti Rajendra HT Telugu
Sep 10, 2024 01:43 PM IST

Pakistan captain Babar Azam: పాకిస్థాన్ వన్డే, టీ20 కెప్టెన్ బాబర్ అజామ్ ఇప్పుడు ఫామ్ కోల్పోయి తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు. ఇటీవల బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో బాబర్ మళ్లీ ఫెయిలవగా.. పాకిస్థాన్ టీమ్ సొంతగడ్డపై వైట్‌వాష్‌కి గురైంది. దాంతో బాబర్‌పై ఒత్తిడి పతాక స్థాయికి చేరింది.

Babar Azam
Babar Azam

పాకిస్థాన్ వన్డే, టీ20 కెప్టెన్ బాబర్ అజామ్‌కి గత కొన్ని నెలలుగా బ్యాడ్ టైమ్ నడుస్తోంది. పేలవ ఫామ్ కారణంగా ఇప్పటికే ఒకసారి కెప్టెన్సీని కోల్పోయి.. అతి కష్టం మీద మళ్లీ చేజిక్కించుకున్నాడు. కానీ ఫామ్‌ను మాత్రం అందుకోలేకపోతున్నాడు. దాంతో ఇంటా బయట బాబర్ అజామ్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.

సాధారణంగా ప్లేయర్ ఫామ్‌లో ఉన్నప్పుడు అన్నీ బాగుంటాయి. కానీ.. ఒక్కసారి ఫామ్ కోల్పోతే.. ప్రొఫెషనల్‌గానే కాదు.. పర్సనల్ లైఫ్‌పై కూడా ఆ ఒత్తిడి పడుతుంది. దీనికి ఎవరూ అతీతులు కాదు. ఇప్పుడు బాబర్ అజామ్ కూడా ఆ ఒత్తిడిలో ఉన్నాడు. ఎంతలా అంటే.. కనీసం తన ప్యాంట్‌ను ఎక్కడ పెట్టాడో కూడా మర్చిపోయేంతలా బాబర్ ఒత్తిడిలో ఉన్నాడు.

అక్టోబరు 7 నుంచి మూడు టెస్టుల సిరీస్‌లో ఇంగ్లాండ్‌తో పాకిస్థాన్ జట్టు తలపడనుంది. ఇటీవల బంగ్లాదేశ్ చేతిలో రెండు టెస్టుల సిరీస్‌లో చిత్తుగా ఓడిన పాకిస్థాన్ టీమ్.. పరువుని కాపాడుకోవడానికి ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన కనబర్చాలని ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే ప్రాక్టీస్‌ చేస్తోంది.

ప్యాంట్ దొరక్క.. టవల్ చుట్టుకుని

ప్రాక్టీస్ సెషన్ మధ్యలో పాకిస్థాన్ ఆటగాళ్లు రొటీన్ ప్రార్థనలు కూడా చేస్తుంటారు. అయితే.. తాజాగా షార్ట్‌ వేసుకుని ప్రాక్టీస్ చేస్తున్న బాబర్.. ప్రార్థనల కోసం వెళ్లేందుకు తన ప్యాంట్ కోసం వెతికాడు. కానీ.. దాన్ని ఎక్కడ పెట్టాడో మర్చిపోయాడు. అయితే.. అప్పటికే మిగతా పాక్ ఆటగాళ్లు ప్రార్థనల కోసం క్యూ కట్టేశారు. దాంతో బాబర్ తన ప్యాంట్ దొర్కకపోవడంతో అక్కడే ఉన్న ముఖాన్ని తుడుచుకునే టవల్‌‌ను హడావుడిగా నడుముకి చుట్టుకుని ప్రార్థనా స్థలానికి పరుగు తీశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

2023 వన్డే ప్రపంచకప్ తర్వాత కెప్టెన్సీ నుంచి బాబర్ ఆజామ్‌ను తప్పించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు.. అతని స్థానంలో షాహీన్ షా అఫ్రిదిని నియమించింది. కానీ ఒక్క సిరీస్ తర్వాత మళ్లీ షాహిన్‌ను తప్పించి బాబర్ చేతికి వన్డే, టీ20 పగ్గాలిచ్చింది. అదేవిధంగా టెస్టుల్లో బాబర్ స్థానంలోషాన్ మసూద్‌ను కెప్టెన్‌గా నియమించినప్పటికీ ఇటీవల బంగ్లాదేశ్‌తో సిరీస్‌ను 0-2 తేడాతో పాక్ చేజార్చుకోవడంతో అతడ్నీ తప్పించాలనే డిమాండ్ వినిపిస్తోంది.

ఇంగ్లాండ్ టూర్.. ఆ వెంటనే ఆస్ట్రేలియాతో సిరీస్

ఈ నెలాఖరులో లాహోర్ లో క్రికెట్ కనెక్షన్ పేరుతో బోర్డు నిర్వహించే వన్డే వర్క్ షాప్‌లో కెప్టెన్సీ లేదా జట్టు ఎంపికలపై చర్చ జరిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. కానీ.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మాత్రం క్లారిటీ ఇవ్వడం లేదు.

దేశవాళీ క్రికెట్‌, అంతర్జాతీయ క్రికెట్ ప్రమాణాలకు మధ్య అంతరాన్ని పూడ్చేందుకు వీలుగా దేశవాళీ జట్టు కోచ్‌లు, సెలెక్టర్లు, కాంట్రాక్ట్ ఆటగాళ్ల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఈ వర్క్ షాప్‌ను నిర్వహించనున్నారు.

సొంతగడ్డపై బంగ్లాదేశ్ తో జరిగిన టెస్టు సిరీస్‌లో పాకిస్థాన్‌కి ఊహించని విధంగా వైట్ వాష్ అనుభవం ఎదురైంది. బాబర్ కెప్టెన్సీలోనే నవంబరులో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్‌ను పాకిస్థాన్ ఆడే అవకాశం ఉంది. ఈ టూర్‌కి ముందు ఇంగ్లాండ్‌తో అక్టోబరు 7 నుంచి మూడు టెస్టుల్లో పాకిస్థాన్ తలపడనుంది.