Pakistan vs South Africa: సిగ్గుండాలి అంటూ పాకిస్థాన్ క్రికెటర్లను ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్.. కారణమేంటో తెలుసా?
Pakistan vs South Africa: పాకిస్థాన్ క్రికెటర్లను క్రికెట్ ఫ్యాన్స్ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ముక్కోణపు సిరీస్ లో భాగంగా సౌతాఫ్రికాతో మ్యాచ్ లో ఆ టీమ్ కెప్టెన్ టెంబా బవుమాను ఔట్ చేసిన తర్వాత వాళ్లు వ్యవహరించిన తీరు దారుణంగా ఉండటంపై మండిపడుతున్నారు.

Pakistan vs South Africa: సౌతాఫ్రికా బ్యాటర్ టెంబా బవుమాను ఔట్ చేసిన తర్వాత పాకిస్థాన్ క్రికెటర్లు అతనిపైకి దూసుకెళ్లిన విధానంపై క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సిగ్గుండాలి అంటూ వాళ్లను ట్రోల్ చేస్తున్నారు. పాక్ క్రికెటర్లు ఒక్కసారిగా బవుమాపైకి దూసుకెళ్లడంతో అంపైర్లు కూడా పాక్ కెప్టెన్ రిజ్వాన్ ను హెచ్చరించాల్సి వచ్చింది.
పాక్ క్రికెటర్ల తీరు దారుణం
పాకిస్థాన్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా మధ్య ముక్కోణపు వన్డే సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ లో భాగంగా మూడో మ్యాచ్ పాకిస్థాన్, సౌతాఫ్రికా మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా ఏకంగా 352 రన్స్ చేసింది. ఓపెనర్ బవుమా 82 రన్స్ చేశాడు.
బ్రీజ్కేతో కలిసి రెండో వికెట్ కు 119 రన్స్ జోడించాడు. చాలాసేపటి నుంచి వికెట్ కోసం ప్రయత్నిస్తున్న పాకిస్థాన్ ఈ సమయంలో బవుమాను రనౌట్ చేసింది. దీంతో పాక్ ఆటగాళ్ల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇన్నింగ్స్ 29వ ఓవర్లో ఈ ఘటన జరిగింది.
బవుమా ఔటై పెవిలియన్ కు వెళ్తున్న సమయంలో పాక్ ప్లేయర్ కమ్రాన్ గులామ్ అతనికి అడ్డుపడి మరీ సెలబ్రేట్ చేసుకున్నాడు. అటు త్రో విసిరిన సాద్ షకీల్, సల్మాన్ అఘాలాంటి వాళ్లు కూడా అతనికి అడ్డుపడ్డారు. ఇది చూసిన అంపైర్లు వెంటనే పాకిస్థాన్ కెప్టెన్ రిజ్వాన్ కు వార్నింగ్ ఇచ్చారు.
సిగ్గుండాలి: క్రికెట్ ఫ్యాన్స్
పాకిస్థాన్ క్రికెటర్ల అతి చూసి క్రికెట్ ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడ్డారు. సిగ్గుండాలి.. మరీ ఇంత దారుణంగా వ్యవహరిస్తారా అంటూ ట్రోల్ చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 50 ఓవర్లలో ఏకంగా 352 రన్స్ చేసింది.
ఆ టీమ్ చివరి 10 ఓవర్లలోనే 110 రన్స్ బాదడం విశేషం. అంతకుముందు న్యూజిలాండ్ తో మ్యాచ్ లోనూ చివరి 10 ఓవర్లలో 123 రన్స్ సమర్పించుకున్న పాక్ బౌలర్లు.. ఇప్పుడు 110 రన్స్ ఇచ్చారు. బవుమా, బ్రీజ్కే, క్లాసెన్ హాఫ్ సెంచరీలు చేశారు.