వికెట్ తీశాడు.. ప్లేయర్ ను తలపై కొట్టాడు..పాకిస్థాన్ సూపర్ లీగ్ లో వింత ఘటన-pakistan super league psl 2025 cricketer punches his own teammate bizzare incident ubaid shah hits usman khan ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  వికెట్ తీశాడు.. ప్లేయర్ ను తలపై కొట్టాడు..పాకిస్థాన్ సూపర్ లీగ్ లో వింత ఘటన

వికెట్ తీశాడు.. ప్లేయర్ ను తలపై కొట్టాడు..పాకిస్థాన్ సూపర్ లీగ్ లో వింత ఘటన

పాకిస్థాన్ సూపర్ లీగ్ లో ఏవేవో వింత ఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఆట తప్ప అన్ని విషయాల్లో ఈ లీగ్ వార్తల్లో నిలుస్తూనే ఉంటోంది. తాజాగా ఓ పేసర్ తోటి క్రికెటర్ తలపై కొట్టాడు. ఈ వీడియో వైరల్ గా మారింది.

Ubaid Shah accidentally punches Usman Khan during PSL 2025 (PSL)

ముల్తాన్ సుల్తాన్స్, లాహోర్ ఖలందర్స్ మధ్య మంగళవారం (ఏప్రిల్ 23) రాత్రి జరిగిన పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) మ్యాచ్‌లో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. పేసర్ తన తోటి క్రికెటర్ తలపై కొట్టడం వింతగా మారింది. ముల్తాన్ సుల్తాన్స్ పేసర్ ఉబైద్ షా.. అనుకోకుండానే తన టీమ్ వికెట్ కీపర్ ఉస్మాన్ ఖాన్ తలపై కొట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఏం జరిగిందంటే?

పీఎస్ఎల్ 2025లో లాహోర్ ఖలందర్స్ ఛేజింగ్ లో సామ్ బిల్లింగ్స్ ను ఉబైద్ షా ఔట్ చేశాడు. ఈ వికెట్ పడగొట్టిన ఆనందంతో ఉబైద్ సంబరాలు చేసుకున్నాడు. ఆ జోష్ లో వికెట్ కీపర్ ఉస్మాన్ ఖాన్ తలపై అనుకోకుండా కొట్టాడు. ఉస్మాన్ ఖాన్ చేతులు ముందుకు తేగా.. వాటి మధ్యలో నుంచి ఉబైద్ తలమీద బలంగా కొట్టాడు. ఈ ఘటన ఒక్కసారిగా అందరినీ షాక్ కు గురి చేసింది.

వెంటనే ట్రీట్ మెంట్

పాకిస్థాన్ సూపర్ లీగ్ 2025లో ఈ ఘటన జరిగిన సమయంలో ఉస్మాన్ ఖాన్ తలపై హెల్మెట్ కు బదులు టోపీ ఉంది. అతని తలపై దెబ్బ బలంగా తగిలింది. వెంటనే అతను గ్రౌండ్ లో నొప్పితో కూలిపోయాడు. ఒక్కసారిగా గందరగోళ పరిస్థితి తలెత్తింది. వెంటనే ముల్తాన్ సుల్తాన్స్ క్యాంప్ నుంచి ఫిజియో పరుగెత్తుకుంటూ వచ్చి ట్రీట్ మెంట్ అందించాడు. వెంటనే ఉస్మాన్ ఖాన్ కోలుకుని తిరిగి వికెట్ కీపింగ్ కొనసాగించడంతో ప్రమాదం తప్పింది.

ఉబైద్ అదుర్స్

ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముల్తాన్ సుల్తాన్స్ 229 పరుగుల భారీ స్కోరు చేసింది. ఛేజింగ్ లో లాహోర్ ఖలందర్స్ ను ఉబైద్ షా దెబ్బకొట్టాడు. మూడు వికెట్లతో అదరగొట్టాడు. చివరకు లాహోర్ 195/9 స్కోరుకే పరిమితమై 34 పరుగుల తేడాతో ఓడిపోయింది. ముల్తాన్ సుల్తాన్స్ టోర్నమెంట్‌లో వరుసగా మూడు ఓటముల తర్వాత మొదటి విజయాన్ని నమోదు చేసింది.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం