పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) 2025కు ముందు కొత్త వివాదం చెలరేగింది. పీఎస్ఎల్ ఫ్రాంఛైజీ ముల్తాన్ సుల్తాన్స్ టీమ్ సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఓ వీడియోపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఇటు భారత్, అటు పాక్ ఫ్యాన్స్ ఈ పోస్టుపై తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ ఫ్రాంఛైజీ అధికారిక మస్కట్ కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వాయిస్ ఓవర్ ను ఉపయోగించడమే ఇందుకు కారణం.
2025 ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచిన తర్వాత విలేకర్ల సమావేశంలో ట్రోఫీ గురించి రోహిత్ మాట్లాడాడు. ఇదెంతో ప్రత్యేకమైందని అన్నాడు. ఇప్పుడు అదే వాయిస్ ఓవర్ తో పీఎస్ఎల్ 2025 ట్రోఫీని ముల్తాన్ సుల్తాన్స్ మస్కట్ పరిచయం చేయడం కలకలం రేపింది. క్రీడా లీగ్ ల్లో మస్కట్ లు ఇలాంటి కామెంట్లు చేయడం కామనే. కానీ పాక్, భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పీఎస్ఎల్ ట్రోఫీకి రోహిత్ వాయిస్ వాడటమే ఇక్కడ వివాదానికి కారణమైంది.
ముల్తాన్ సుల్తాన్స్ సోషల్ మీడియోలో పోస్టు చేసిన ఈ వీడియోపై భారత్ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. ఆ మస్కట్ బొద్దుగా ఉండటంతో కావాలనే రోహిత్ వాయిస్ ఓవర్ వాడి బాడీ షేమింగ్ చేస్తున్నారని రోహిత్ ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. పాకిస్థాన్ సూపర్ లీగ్ లో రోహిత్ వాయిస్ వాడటానికి సిగ్గుండాలని పాకిస్థాన్ ను తీవ్రంగా తిడుతున్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ ను అవమానిస్తారా అంటూ మండిపడుతున్నారు.
మరోవైపు పాక్ ఫ్యాన్స్ కూడా ఈ వీడియోపై ఫైర్ అవుతున్నారు. పాకిస్థాన్ సూపర్ లీగ్ లో భారత కెప్టెన్ రోహిత్ వాయిస్ వాడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. రోహిత్ వాయిస్ కాకుండా ఇంకేం దొరకలేదా? అని విమర్శిస్తున్నారు. తమ సొంత టోర్నమెంట్ ను ప్రోత్సహించడానికి టీమిండియా కెప్టెన్ మాటాలను ఎందుకు ఉపయోగించాలని ప్రశ్నిస్తున్నారు.
పాకిస్తాన్ జాతీయ జట్టుకు కూడా నాయకత్వం వహిస్తున్న మహమ్మద్ రిజ్వాన్ ప్రస్తుతం సుల్తాన్స్ కెప్టెన్. అయితే, ఈ నెల ప్రారంభంలో ఐదు టీ20ల సిరీస్ కోసం న్యూజిలాండ్‌కు వెళ్ళిన పాకిస్తాన్ జట్టు కు రిజ్వాన్ ఎంపికవలేదు. సల్మాన్ అఘా పాకిస్తాన్‌కు నాయకత్వం వహిస్తున్నాడు.
పీఎస్ఎల్ 2025 ఏప్రిల్ 11న ప్రారంభం కానుంది. ఐపీఎల్, పీఎస్ఎల్ ఒకేసారి జరగడం ఇదే మొదటిసారి. నిజానికి పాకిస్థాన్ సూపర్ లీగ్.. ప్రతి ఏడాది ఫిబ్రవరి-మార్చిలో జరుగుతుంది. కానీ ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యమివ్వడంతో పీఎస్ఎల్ ను ఏప్రిల్-మే విండోకు మార్చాల్సి వచ్చింది.
సంబంధిత కథనం