Pakistan Cricket: అభిమానిపైకి దూసుకొచ్చి గొడవకు దిగిన పాకిస్థాన్ స్టార్ పేసర్: వీడియో
Pakistan Cricket - Haris Rauf: ఓ అభిమానితో పాకిస్థాన్ స్టార్ పేసర్ హరీస్ రవూఫ్ గొడవకు దిగాడు. భార్య ఆపినా ఆగకుండా అభిమానిపైకి దూకుకెళ్లాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది.

Pakistan Cricket - Haris Rauf: టీ20 ప్రపంచకప్ 2024 మెగాటోర్నీలో పాకిస్థాన్ పేలవ ప్రదర్శన చేసింది. గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. గ్రూప్-ఏలో అమెరికా చేతిలో పరాజయం పాలైన పాక్‍కు పరాభవం ఎదురైంది. భారత్ చేతిలోనూ ఓడిపోయింది. నాలుగు మ్యాచ్‍ల్లో రెండు ఓడిన పాక్.. రెండు గెలిచింది. మొత్తంగా గ్రూప్ దశలోనే పాకిస్థాన్ ఔట్ అయింది. ఈ తరుణంలో పాకిస్థాన్ ఆటగాళ్లపై మాజీలతో పాటు ఫ్యాన్స్ కూడా ఆగ్రహంగా ఉన్నారు. ఈ తరుణంలో అమెరికాలో పాకిస్థాన్ పేసర్ హరీస్ రవూఫ్‍పై ఓ అభిమాని కామెంట్ చేశాడు. దీంతో ఆగ్రహించిన అతడు గొడవకు దిగాడు. ఆ వివరాలివే..
ఏం జరిగిందంటే..
అమెరికాలోని ఓ హోటల్ ప్రాంగణంలో హరీస్ రవూఫ్ తన భార్యతో నడుకుంటూ వెళుతుండగా.. పాకిస్థాన్ టీమ్ పర్ఫార్మెన్స్‌పై ఓ అభిమాని కామెంట్ చేశాడు. దీంతో రవూఫ్ సహనం కోల్పోయాడు. ‘ఇండియా నుంచి వచ్చి ఉంటాడు’ అని అతడు గట్టిగా అరవగా.. ‘పాకిస్థాన్ నుంచే’ అని ఆ ఫ్యాన్ కూడా గట్టిగా బదులిచ్చాడు.
దీంతో అభిమానివైపు దూసుకెళ్లాడు హరీస్ రవూఫ్. తన భార్య చేయిపట్టుకొని వద్దని చెప్పినా వినలేదు. ఆమెను విడిపించుకొని అతడివైపునకు దూసుకెళ్లాడు. ఆ తర్వాత గట్టి.. గట్టిగా వాదించుకున్నారు. టీ20 ప్రపంచకప్‍లో పాకిస్థాన్ జట్టు ప్రదర్శన గురించి ఇద్దరూ వాదించుకున్నారు.
మరికొందరు వచ్చి హరిస్ రవూఫ్‍ను అడ్డుకున్నారు. కొడతావా.. కొడతావా అంటూ ఆ అభిమాని అరిచారు. ఇలా వాదన కాసేపు సాగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానిపై దురుసుగా ప్రవర్తించిన రవూఫ్‍పై కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తీరు మార్చుకోవాలని సూచిస్తున్నారు.
పాకిస్థాన్ ఔట్ ఇలా..
టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీలో మంచి అంచనాలతోనే పాకిస్థాన్ అడుగుపెట్టింది. గ్యారీ కిర్‌స్టన్ కూడా హెడ్‍కోచ్‍గా వచ్చాడు. అయితే, ఈ టోర్నీ గ్రూప్-ఏ తొలి మ్యాచ్‍లోనే పాక్‍కు గట్టి షాక్ తగిలింది. ప్రపంచకప్ తొలిసారి అడుతున్న అమెరికా చేతిలో పాక్‍కు ఓటమి ఎదురైంది. సూపర్ ఓవర్ వరకు వెళ్లినా పాకిస్థాన్‍ను పరాజయం తప్పలేదు. దీంతో బాబర్ ఆజమ్ సేనపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇక భారత్ చేతిలోనూ పాకిస్థాన్ మరోసారి ఓటమి చవిచూసింది.
కెనడా, ఐర్లాండ్ జట్లపై పాకిస్థాన్ గెలిచినా ఫలితం లేకపోయింది. ఏడు పాయింట్లతో టీమిండియా, ఐదు పాయింట్లతో అమెరికా.. గ్రూప్-ఏ నుంచి సూపర్-8 దశకు అర్హత సాధించాయి. నాలుగు పాయింట్లే ఖాతాలో వేసుకున్న పాకిస్థాన్ గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. గత ఎడిషన్‍లో ఫైనల్ చేరిన పాక్ ఈసారి గ్రూప్ స్టేజ్ దాటలేకపోయింది.