భారత టీ20 జట్టుకు హార్దిక్ పాండ్యాను కాకుండా సూర్యకుమార్ యాదవ్‍ను కెప్టెన్‍ను చేస్తూ సెలెక్టర్లు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. శ్రీలంక పర్యటనలో టీ20 సిరీస్‍కు పాండ్యాను ఎంపిక చేసినా సూర్యకుమార్ యాదవ్‍ను సారథిగా ప్రకటించారు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ టోర్నీలో హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్‍గా ఉన్నాడు. ఆ టోర్నీలో భారత్ టైటిల్ కైవసం చేసుకుంది. పాండ్యా కూడా ఆల్‍రౌండ్ ప్రదర్శనతో రాణించాడు. అంతర్జాతీయ టీ20లకు రోహిత్ శర్మ గుడ్‍బై చెప్పడంతో హార్దిక్ పాండ్యానే టీ20 టీమ్‍కు కెప్టెన్ అని అంతా అనుకున్నారు. అయితే, సూర్యను సారథిని చేశారు సెలెక్టర్లు. దీనిపై కొందరి నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది.
భారత టీ20 టీమ్‍కు హార్దిక్‍ను కెప్టెన్‍ను చేయకపోవడంపై పాకిస్థాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు. అతడిని సారథి కాకుండా చేసేందుకు చెప్పిన ఫిట్‍నెస్ కారణం సరికాదని, కేవలం సాకుల్లానే అనిపిస్తున్నాయని తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడు.
గొప్ప ఫిట్‍నెస్ లేకున్నా గొప్ప కెప్టెన్‍లు అయిన వారు ఉన్నారని రషీద్ లతీఫ్ అన్నారు. కెప్టెన్సీకి ఫిట్‍నెస్ ఒక్కటే కొలమానం కాదనేలా మాట్లాడాడు. హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇవ్వకూడదని చెప్పిన సాకులే అని ఆగ్రహించాడు. “అతడు ఫిట్‍గా లేడని, ఫిట్‍నెస్‍పై ఆందోళనలు ఉన్నాయని వారు ముద్ర వేసేశారు. అద్భుతమైన ఫిట్‍నెస్ లేకపోయినా గ్రేట్ కెప్టెన్లు అయిన వారు ఉన్నారు. నాకు తెలిసి అదో సాకు మాత్రమే. ఒకవేళ సూర్య లేకపోయి ఉంటే, రిషబ్ పంత్‍ను కెప్టెన్‍ను చేసి ఉండేవారు” అని లతీఫ్ అన్నాడు.
హార్దిక్ పాండ్యాను భారత సెలెక్టర్లు కావాలనే కెప్టెన్సీ రేసు నుంచి తప్పించారనేలా లతీఫ్ అభిప్రాయపడ్డాడు. మరికొందరు మాజీలు కూడా హార్దిక్‍నే కెప్టెన్‍ను చేయాల్సిందనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
శ్రీలంక పర్యటనకు టీమిండియా బయలుదేరే ముందు భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. హార్దిక్‍ను ఎందుకు టీ20లకు కెప్టెన్‍ను చేయలేదో వెల్లడించారు. జట్టుకు ఎక్కువగా అందుబాటులో ఉండే ప్లేయర్ కెప్టెన్ కావాలనుకున్నామని అగార్కర్ అన్నారు. హార్దిక్ విషయంలో ఫిట్‍నెస్ ఆందోళనలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఇతర ఆటగాళ్ల అభిప్రాయాలు కూడా అడిగిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. 2026 టీ20 ప్రపంచకప్ వరకు టీ20 జట్టుకు సూర్యనే కెప్టెన్‍గా కొనసాగించాలని సెలెక్టర్లు వ్యూహం రచించారు.
శ్రీలంక పర్యటనలో మూడు టీ20ల సిరీస్ జూలై 27న మొదలుకానుంది. భారత్, లంక మధ్య తొలి టీ20 జూలై 27న, రెండో టీ20 జూలై 28న, మూడో టీ20 జూలై 30న జరగనుంది. ఈ సిరీస్ నుంచి భారత టీ20 జట్టు రెగ్యులర్ కెప్టెన్‍గా సూర్య బాధ్యతలు తీసుకుంటున్నాడు. సూర్య సారథ్యంలో హార్దిక్ ఆడనున్నాడు. టీమిండియా హెడ్‍కోచ్‍గా గౌతమ్ గంభీర్ తన ప్రస్థానాన్ని మెదలుపెట్టనున్నాడు. శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్ ఆగస్టు 2 నుంచి ఆగస్టు 7 వరకు జరగనుంది. వన్డేలకు రోహిత్ శర్మనే కెప్టెన్సీ చేయనున్నాడు.