Pakistan Cricket Team: హైదరాబాద్ బిర్యానీ రోజూ తింటున్నాం.. అందుకే కాస్త స్లో అయ్యాం: షాదాబ్ ఖాన్
Pakistan Cricket Team: హైదరాబాద్ బిర్యానీ రోజూ తింటున్నాం.. అందుకే కాస్త స్లో అయ్యామని అంటున్నాడు పాకిస్థాన్ క్రికెట్ టీమ్ వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్. ఆస్ట్రేలియాతో మ్యాచ్ తర్వాత అతడు మాట్లాడాడు.
Pakistan Cricket Team: పాకిస్థాన్ క్రికెట్ టీమ్ హైదరాబాద్ లో అడుగుపెట్టి వారం రోజులవుతోంది. మన భాగ్యనగరానికి వచ్చిన తర్వాత ఇక్కడి బిర్యానీని టేస్ట్ చేయకుండా ఉంటారా? అందులోనూ ఏడేళ్ల తర్వాత ఇండియాకు వచ్చిన పాక్ టీమ్ అసలే ఊరుకోదు. అందుకే వాళ్లు బిర్యానీ కుమ్మేస్తున్నారు. తాము రోజూ బిర్యానీ తింటున్నామని పాక్ వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ చెప్పడం విశేషం.
ఆస్ట్రేలియాతో హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో మంగళవారం (అక్టోబర్ 3) జరిగిన వామప్ మ్యాచ్ లో పాకిస్థాన్ 15 పరుగుల తేడాతో ఓడిపోయింది. అంతకుముందు న్యూజిలాండ్ తోనూ భారీ స్కోరు చేసినా పాక్ గెలవలేకపోయింది. దీంతో హైదరాబాదీ బిర్యానీ తినడం వల్లే తాము కాస్త స్లో అయ్యామని షాదాబ్ సరదాగా చెప్పాడు.
ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో పాక్ టీమ్ కెప్టెన్ గా షాదాబే ఉన్నాడు. "మేము దానిని రోజూ తింటున్నాం. బహుశా అందుకే మేము కాస్త స్లో అయ్యాం" అంటూ షాదాబ్ నవ్వేశాడు. రెండు వామప్ మ్యాచ్ లలోనూ ఓడి వరల్డ్ కప్ లో అడుగుపెడుతోంది పాకిస్థాన్ టీమ్. ఈ రెండు మ్యాచ్ లలో పాక్ 300కుపైగా రన్స్ చేసింది. తొలి మ్యాచ్ లో 345 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది.
ఇక ఆస్ట్రేలియాతో 352 పరుగుల లక్ష్యానికి చేరువైనా.. చివరికి 337 పరుగుల దగ్గర ఆలౌటైంది. వాళ్ల బ్యాటర్లు ముఖ్యంగా కెప్టెన్ బాబర్ ఆజం మంచి ఫామ్ లో ఉన్నా.. బౌలర్లే ఈ రెండు మ్యాచ్ లలో నిరాశ పరిచారు. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలోనే ఈ రెండు మ్యాచ్ లు జరిగాయి. దీంతో ఇక్కడ జరగబోయే వరల్డ్ కప్ మ్యాచ్ లలోనూ పరుగుల పండగ ఖాయంగా కనిపిస్తోంది.
అయితే తమకు మ్యాచ్ ల ఫలితాలతో సంబంధం లేదని మ్యాచ్ తర్వాత షాదాబ్ చెప్పాడు. "ఫలితం ముఖ్యం కాదు. మాకు చాలా సానుకూలతలు ఉన్నాయి. మా ఆటిట్యూడ్ బాగుంది. ఫలితం మా చేతుల్లో లేదు. మా తుది 11 మంది సమస్య పరిష్కారమైంది. బెంచ్ పై ఉన్న ప్లేయర్స్ కు కాస్త మ్యాచ్ సమయం ఇవ్వాలనుకున్నాం.
ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి టీమ్స్ తో ఆడినప్పుడు ఆత్మవిశ్వాసం వస్తుంది. హైదరాబాద్ కండిషన్స్ పై కూడా అనుభవం వచ్చింది" అని షాదాబ్ చెప్పాడు. అక్టోబర్ 6న వరల్డ్ కప్ లో భాగంగా నెదర్లాండ్స్ తో హైదరాబాద్ లోనే పాకిస్థాన్ తన తొలి మ్యాచ్ ఆడుతుంది.