Pakistan vs New Zealand T20: పాక్ పరువు పాయే..91 పరుగులకే ఆలౌట్.. కివీస్ చేతిలో చిత్తు..ఇదేం ఆట అంటూ ట్రోల్స్
Pakistan vs New Zealand T20: పాకిస్థాన్ క్రికెట్ జట్టు ఆట మాత్రం మారట్లేదు. మ్యాచ్ మ్యాచ్ కూ పరువు పోగొట్టుకోవడమే పాక్ టీమ్ పనిగా మారింది. తాజాగా 91 పరుగులకే కుప్పకూలిన ఆ టీమ్ మరింత అవమానాన్ని ఖాతాలో వేసుకుంది.
టీమ్ మారినా.. ప్లేయర్స్ మారినా పాకిస్థాన్ ఆటతీరు మాత్రం మారడం లేదు. స్వదేశంలో ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యమిచ్చి మరీ అవమానాన్ని మూటగట్టుకున్న పాకిస్థాన్.. ఇప్పుడు ఆటలోనూ పరాభవాన్ని ఎదుర్కొంటోంది. న్యూజిలాండ్ తో తొలి టీ20లో కొత్త ఆటగాళ్లతో బరిలో దిగినా పాక్ జట్టుకు ఓటమి తప్పలేదు. ఆ జట్టు దారుణంగా ఓడింది. ఆదివారం (మార్చి 16) జరిగిన మ్యాచ్ లో న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో పాక్ ను చిత్తు చిత్తుగా ఓడించింది.
టీ20ల్లో టెస్టు బ్యాటింగ్
టీ20ల్లో బ్యాటింగ్ అంటే ధనాధన్ షాట్లతో చెలరేగుతారు. కానీ పాకిస్థాన్ ఆటగాళ్లు మాత్రం టీ20ల్లో కూడా టెస్టు బ్యాటింగ్ చేస్తున్నారు. ఆ టీమ్ బ్యాటింగ్ లో దూకుడే లేదు. న్యూజిలాండ్ తో ఫస్ట్ టీ20లో పాక్ టాప్-7 బ్యాటర్లలో ఒక్కరు కూడా కనీసం 100 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేయలేదు. అంటే బంతికి ఒక్క పరుగు కూడా సాధించలేదు.
లో స్కోర్
బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ తదితర కీ ప్లేయర్స్ ను తప్పించిన పాక్ కుర్రాళ్లతో ఈ సిరీస్ లో బరిలో దిగింది. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తామని చాటింది. కానీ టీమ్ మారినా ఆట మాత్రం మారలేదు. మహ్మద్ హారిస్ (0), హసన్ నవాజ్ (0), కెప్టెన్ సల్మాన్ అఘా (20 బంతుల్లో 18), ఇర్ఫాన్ ఖాన్ (1), షాదాబ్ ఖాన్ (3), అబ్దుల్ సమద్ (7) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు.
న్యూజిలాండ్ తో టీ20లో పాక్ 18.4 ఓవర్లలో 91 పరుగులకే కుప్పకూలింది. కనీసం 100 పరుగులైనా చేయలేకపోయింది. ఇది టీ20 ఫార్మాట్లో అయిదో అత్యల్ప స్కోరు. న్యూజిలాండ్ గడ్డపై ఇదే లో స్కోరు. కైల్ జేమీసన్ 11 బంతుల్లో 3 వికెట్లు తీయగా, జాకబ్ డఫీ 14 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు.
ఛేజింగ్ లో న్యూజిలాండ్ చెలరేగింది. టిమ్ సీఫర్ట్ (44), ఫిన్ అలెన్ (29 నాటౌట్), టిమ్ రాబిన్సన్ (18 నాటౌట్) కివీస్ ను గెలిపించారు. 61 బంతుల్లోనే ఆ టీమ్ మ్యాచ్ ముగించింది.
స్టార్లు లేకపోయినా
ఐపీఎల్ ఆడటం కోసం న్యూజిలాండ్ స్టార్ ఆటగాళ్లు ఈ సిరీస్ కు దూరమయ్యారు. రచిన్ రవీంద్ర, కాన్వే, ఫిలిప్స్ తదితర కీ ప్లేయర్స్ ఈ సిరీస్ లో ఆడటం లేదు. అయినా పాకిస్థాన్ ను కివీస్ చిత్తు చేసింది. కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయినా పాక్ ఆట ప్రమాణాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఆ టీమ్ ఆటపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి.
ఛాంపియన్స్ ట్రోఫీలో దెబ్బ
29 ఏళ్ల తర్వాత ఓ ఐసీసీ టోర్నీకి పాక్ ఇటీవల ఆతిథ్యమిచ్చింది. ఆ దేశం హోస్ట్ గా నిర్వహించిన ఛాంపియన్స్ ట్రోఫీలో పాక్ పరువు పోయింది. ఆ టీమ్ ఒక్క మ్యాచ్ కూడా గెలవకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక వర్షం పడితే గ్రౌండ్ ను పూర్తిగా కవర్ చేసేందుకు కవర్లు లేకపోవడంతో పాకిస్థాన్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఫైనల్ దుబాయ్ లో జరగడం, భారత్ గెలవడంతో అసలు ఈ టోర్నీకి పాకిస్థాన్ హోస్ట్ కాదేమో అనే సందేహాలు కూడా వచ్చాయి.