Pakistan Cricket Players: పాపం పాకిస్థాన్ క్రికెటర్లు.. ఆ లీగ్‌లోనూ ఒక్కరూ పట్టించుకోలేదు.. 50 మంది ప్లేయర్స్ ఉన్నా..
Pakistan Cricket Players: పాకిస్థాన్ క్రికెట్ టీమ్ కు, అక్కడి ప్లేయర్స్ కు బ్యాడ్ టైమ్ నడుస్తూనే ఉంది. ఇంగ్లండ్ లో జరిగే ది హండ్రెడ్ టోర్నమెంట్లో 50 మంది పాక్ ప్లేయర్స్ డ్రాఫ్ట్‌లో ఉన్నా ఒక్కరినీ తీసుకోలేదు.
Pakistan Cricket Players: పాకిస్థాన్ క్రికెట్ టీమ్ పరిస్థితి కొన్నేళ్లుగా ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం. దారుణమైన ప్రదర్శనతో ఐసీసీ టోర్నీల్లో తొలి రౌండ్లలోనే ఇంటిదారి పట్టడం అలవాటుగా మార్చుకుంది. ఇక ఇప్పుడు ఇంగ్లండ్ లో జరిగే ది హండ్రెడ్ టోర్నీ ప్లేయర్స్ డ్రాఫ్ట్‌లో ఏకంగా 50 మంది పాకిస్థాన్ క్రికెటర్లు ఉన్నా.. ఒక్కరిని కూడా ఒక్క ఫ్రాంఛైజీ పట్టించుకోలేదు.
పాక్ ప్లేయర్స్.. తొలిసారి ఇలా..
ది హండ్రెడ్ టోర్నీ 2021లో ప్రారంభమైంది. అప్పటి నుంచి చూసుకుంటే పాకిస్థాన్ ప్లేయర్స్ ఒక్కరు కూడా లేకపోవడం ఇదే తొలిసారి. ఐదుగురు మహిళా క్రికెటర్లు సహా మొత్తంగా 50 మంది డ్రాఫ్ట్‌లో ఉన్నారు. కానీ ఎవరూ అమ్ముడుపోలేదు. ది హండ్రెడ్ టోర్నీలో మొత్తం 8 ఫ్రాంఛైజీలు ఉండగా.. ఈ మధ్యే వాటిలో నాలిగింటిని ఇండియాకు చెందిన వాళ్లు సొంతం చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో ఇప్పుడు పాకిస్థాన్ ప్లేయర్స్ ను పట్టించుకోకపోవడం మరింత చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికే ఐపీఎల్ తోపాటు ఈ లీగ్ కే చెందిన ఓనర్లు సొంతం చేసుకున్న ఎస్ఏ20 లీగ్ టీమ్స్ లోనూ పాక్ ప్లేయర్స్ కు అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు ఇంగ్లండ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ది హండ్రెడ్ లోనూ పాక్ ప్లేయర్స్ లేకపోవడంతో వాళ్లకు పెద్ద షాకే తగిలినట్లయింది.
కారణాలు ఇవేనా?
ది హండ్రెడ్ కోసం డ్రాఫ్ట్ లో పాకిస్థాన్ కు చెందిన స్టార్ ప్లేయర్స్ షాదాబ్ ఖాన్, నసీమ్ షా, సల్మాన్ అలీ ఆఘా, యువ ప్లేయర్ సయీమ్ ఆయుబ్ లాంటి వాళ్లు ఉన్నారు. అయితే ఫ్రాంఛైజీలు వీళ్లను పట్టించుకోలేదు. గతేడాది నసీమ్ షా, మహ్మద్ ఆమిర్, హారిస్ రౌఫ్, ఉసామా మిర్ తోపాటు మొత్తం ఆరుగురు పాక్ ప్లేయర్స్ ఆడారు. ఈసారి ఒక్కరు కూడా లేరు. 8 ఫ్రాంఛైజీల్లో నాలుగు భారతీయుల చేతికి చిక్కడంతో పాక్ ప్లేయర్స్ పై అనధికారిక నిషేధం విధించినట్లు భావిస్తున్నారు.
అయితే ఇదొక్కటే కాదని, ఈ మధ్యకాలంలో పాక్ ప్లేయర్స్ ప్రదర్శన దారుణంగా ఉండటం కూడా వాళ్లపై ఆసక్తి చూపకపోవడానికి మరో కారణం కావచ్చని క్రికెట్ పండితులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు ది హండ్రెడ్ టోర్నమెంట్ జరిగే ఆగస్ట్ సమయంలో పాక్ ప్లేయర్స్ షెడ్యూల్ బిజీగా ఉండటం కూడా ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఈ మధ్యకాలంలో పాక్ బోర్డు అంత సులువుగా తమ ప్లేయర్స్ కు ఎన్వోసీలు ఇవ్వకపోవడంతో ఫ్రాంఛైజీలు వాళ్లపై ఆసక్తి చూపడం లేదని వార్తలు వస్తున్నాయి.
మొత్తానికి కారణాలు ఏవైనా పాకిస్థాన్ ప్లేయర్స్ కు మాత్రం ప్రస్తుతం బ్యాడ్ టైమ్ నడుస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మధ్యే స్వదేశంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలోనూ తొలి రౌండ్లోనే ఆ టీమ్ ఇంటిదారి పట్టిన విషయం తెలిసిందే.
సంబంధిత కథనం