ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్ లోనే ఉద్రిక్తకర వాతావరణం నెలకొంది. బుధవారం (ఫిబ్రవరి 19) పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ లో ఆటగాళ్లు మాటల దాడికి దిగారు. కానీ పాకిస్థాన్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్, పేసర్ షహీన్ షా అఫ్రిది మధ్యే ఈ మాటల యుద్ధం జరగడం గమనార్హం.
పాకిస్థాన్ తో మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 320/5 భారీ స్కోరు చేసింది. విల్ యంగ్, టామ్ లేథమ్ సెంచరీలతో చెలరేగారు. పాకిస్థాన్ బౌలర్లు వీళ్లను కట్టడి చేయలేకపోవడంతో పాక్ కెప్టెన్ రిజ్వాన్ కు చిర్రెత్తుకొచ్చింది. ఫ్రస్టేషన్ కంట్రోల్ చేసుకోలేకపోయాడు. బౌలర్లపై పదే పదే ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్ తో మ్యాచ్ లో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 47వ ఓవర్లో షహీన్ షా అఫ్రిది బౌలింగ్ లో లేథం ఫోర్ కొట్టాడు. నిజానికి అది గుడ్ డెలివరీనే. కానీ లేథం బ్యాట్ ను తగిలి అది ఫోర్ వెళ్లింది. దీంతో పట్టరాని కోపంతో ‘‘ఇదేం బౌలింగ్? ఫీల్డింగ్ చూసుకోని బాల్ వేయ్’’ అన్నట్లు రిజ్వాన్ ఏదో మాటలన్నాడు. దీనికి షహీన్ కూడా గట్టిగానే రిప్లే ఇచ్చాడు. ‘‘ముందు సరిగ్గా ఫీల్డింగ్ సెట్ చేయ్’’ అనే అర్థం వచ్చేలా మాటలన్నట్లు కనిపించాడు.
బౌలర్లు మంచి బంతులేసినా కొన్ని సార్లు బౌండరీలు వస్తాయి. ఆ సమయంలో బౌలర్లను కెప్టెన్ ఎంకరేజ్ చేయాలి. కానీ రిజ్వాన్ మాత్రం బౌలర్లపై అరవడం పై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయి. అంతకుముందు స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ఓ ఓవర్లో 16 పరుగులు ఇవ్వడంతో రిజ్వాన్ అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎంత చెప్పినా ఉత్తమంగా బంతులు వేయడం లేదని అరిచాడు.
సంబంధిత కథనం