Yashasvi Jaiswal Out: యశస్వి ఔట్‍పై థర్డ్ అంపైర్ నిర్ణయం వివాదాస్పదం! స్నికోలో చూపించకున్నా.. నిరాశగా వెళ్లిన బ్యాటర్
Yashasvi Jaiswal Out - IND vs AUS 4th Test: ఆసీస్‍తో నాలుగో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ ఔట్‍పై థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం చర్చగా మారింది. అది ఔటా.. నాటౌటా అనే వివాదం సాగుతోంది. మొత్తంగా నిరాశగా వెనుదిరిగాడు జైస్వాల్. ఆ వివరాలు ఇవే..
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో భారత యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అద్భుతంగా పోరాడాడు. ముఖ్యమైన రెండో ఇన్నింగ్స్‌లో ఓ వైపు వికెట్లు పడుతున్నా నిలకడగా ఆడాడు. మెల్‍బోర్న్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు చివరి రోజైన నేడు (డిసెంబర్ 30) 208 బంతుల్లో 84 పరుగులు చేసి రాణించాడు. ఆసీస్ బౌలర్లను అడ్డుకుంటూ పోరాటపటిమ చూపాడు. అయితే, యశస్వి ఔట్ విషయం వివాదంగా మారింది. ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇవ్వగా.. ఆసీస్ రివ్యూకు వెళ్లింది. యశస్వి బ్యాట్‍కు బంతి తగిలినట్టు స్నికో మీటర్‌లో చూపించకపోయినా థర్డ్ అంపైర్ ఓ కారణం వల్ల ఔట్ ఇచ్చేశారు. మ్యాచ్‍లో అత్యంత కీలకమైన సమయంలో ఇది జరిగింది. దీంతో ఇది కాస్త వివాదంగా మారుతోంది. ఏం జరిగిందంటే..
ఇదే జరిగింది
రెండో ఇన్నింగ్స్‌లో 71వ ఓవర్ ఐదో బంతికి ఆసీస్ కెప్టన్ ప్యాట్ కమిన్స్.. బ్యాటర్ యశస్వి జైస్వాల్‍కు బౌన్సర్ వేశాడు. దీంతో పుల్ షాట్ కొట్టేందుకు జైస్వాల్ ప్రయత్నించాడు. అయితే, బంతి కీపర్ అలెక్స్ కేరీ చేతుల్లోకి వెళ్లింది. ఆసీస్ ఆటగాళ్లు క్యాచ్ కోసం అప్పీల్ చేశారు. ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. దీంతో డీఆర్ఎస్ తీసుకుంది ఆస్ట్రేలియా.
ఈ క్యాచ్‍ను థర్డ్ అంపైర్ చాలా సేపు పరిశీలించారు. అయితే, జైస్వాల్ బ్యాట్‍కు బంతి తగిలినట్టు స్నికో మీటర్‌లో చూపించలేదు. కానీ బంతి దిశ మారిందనే కారణంతో థర్డ్ అంపైర్ ఔట్ ఇచ్చేశాడు. దీంతో జైస్వాల్ ఔట్‍గా వెనుదిరిగాడు.
ఔట్ ఇచ్చింది ఇందుకే! నిరాశగా జైస్వాల్
యశస్వి జైస్వాల్ బ్యాట్, గ్లౌవ్‍కు తగిలినట్టుగా స్నికో మీటర్‌లోని తరంగాల్లో ఎలాంటి ఆధారం థర్డ్ అంపైర్‌కు కనిపించలేదు. వివిధ యాంగిళ్లలో పరిశీలించారు. అయితే.. బంతి బ్యాట్, గ్లౌవ్‍కు తగిలి.. వెళ్లే దిశ మారిందని థర్డ్ అంపైర్ నిర్ణయించారు. బ్యాట్.. ఆ తర్వాత గ్లౌవ్‍కు కాస్త తగిలిందని డిసైడ్ అయ్యారు. దీంతో యశస్విని ఔట్‍గా ప్రకటించారు. దీంతో యశస్వి జైస్వాల్ నిరాశగా పెలివియన్ వైపుగా నడుచుకుంటూ వెళ్లాడు. నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.
నాలుగో టెస్టు చివరి రోజున 340 పరుగుల లక్ష్యఛేదనలో అత్యంత కీలకమైన సమయంలో ఇది జరిగింది. మ్యాచ్ డ్రా చేసుకునేందుకు భారత్ ఇంకా సుమారు 22 ఓవర్లను భారత్ ఆడాల్సిన సమయంలో యశస్వి ఔట్ అయ్యాడు. అద్భుత పోరాటం తర్వాత పెవిలియన్ చేరాడు. యశస్వి ఔట్ అవడంతో 140 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది భారత్. మూడు వికెట్లే చేతిలో ఉండటంతో చాలా ఉత్కంఠ నెలకొంది. మరి టీమిండియా ఈ మ్యాచ్‍ను డ్రా చేసుకుంటుందో.. లేదో చూడాలి.
సంబంధిత కథనం