IND vs NZ: వాంఖడే టెస్టులో టీమిండియా చిన్న తప్పిదం.. నిమిషాల్లోనే 2 వికెట్లతో భారీ మూల్యం
IND vs NZ 3rd Test Updates: వాంఖడే పిచ్ స్పిన్‌కి అతిగా అనుకూలిస్తోంది.. టాప్ ఆర్డర్ బ్యాటర్ కూడా క్రీజులో నిలవలేని పరిస్థితి. ఆట మరో 5 నిమిషాల్లో ముగియబోతున్న దశలో టీమిండియా తీసుకున్న ఓ నిర్ణయం శాపంగా మారింది.
న్యూజిలాండ్‌తో వాంఖడే వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా చేసిన చిన్న తప్పిదం కారణంగా నిమిషాల వ్యవధిలోనే రెండు వికెట్లు చేజార్చుకుంది. శుక్రవారం మొదలైన ఈ టెస్టు మ్యాచ్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ టీమ్ 235 పరుగులకి ఆలౌటవగా.. అనంతరం బ్యాటింగ్ చేస్తున్న భారత్ జట్టు శుక్రవారం ఆట ముగిసే సమయానికి 86/4తో నిలిచింది.
నిన్న ఆట మరికొన్ని నిమిషాల్లో ముగుస్తుందన్న దశలో నైట్‌వాచ్‌మన్ మహ్మద్ సిరాజ్ (0), విరాట్ కోహ్లీ (4) వికెట్లని అనూహ్యంగా టీమిండియా చేజార్చుకుంది. ఈ రెండు వికెట్లు చేజారడానికి కారణం టీమిండియా మేనేజ్‌మెంట్ అనాలోచిత నిర్ణయమేనని మ్యాచ్ కామెంటేటర్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు.
సిరాజ్ ప్లేస్‌లో అతను వచ్చి ఉంటే?
వాస్తవానికి వాంఖడే పిచ్ తొలిరోజే స్పిన్‌కి అతిగా అనుకూలించింది. దాంతో రవీంద్ర జడేజా 5 వికెట్లు పడగొట్టగా.. వాషింగ్టన్ సుందర్ 4 వికెట్లు తీశాడు. ఆ తర్వాత భారత్ జట్టు మొదటి ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత న్యూజిలాండ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ చాలా ప్రమాదకరంగా కనిపించాడు. అతని విసిరిన కొన్ని బంతుల్ని ఆడటానికి రోహిత్ శర్మతో పాటు యశస్వి జైశ్వాల్ కూడా ఆడటానికి చాలా ఇబ్బందిపడుతూ కనిపించారు.
టీమ్ స్కోరు 78 వద్ద అజాజ్ పటేల్ విసిరిన బంతిని అంచనా వేయలేపోయిన యశస్వి జైశ్వాల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆ వెంటనే నైట్ వాచ్‌మెన్‌గా మహ్మద్ సిరాజ్ క్రీజులోకి వచ్చాడు. ఇక్కడే టీమిండియా తప్పిదం చేసింది. అసలే స్పిన్ పిచ్... ఆపై బ్యాటింగ్ అనుభవం పెద్దగా లేని సిరాజ్ క్రీజులోకి వచ్చి మొదటి బంతికే ఔటైపోయడు. దాంతో విరాట్ కోహ్లీ క్రీజులోకి వచ్చి ఒక బౌండరీ కొట్టినా.. ఆ వెంటనే లేని పరుగు కోసం ప్రయత్నించి రనౌట్ అయ్యాడు.
నైట్ వాచ్‌మెన్ డ్యూటీ ఏంటి?
నిజానికి ఈ రెండు వికెట్లు పడటానికి కారణం టీమిండియా అనాలోచిత నిర్ణయమే. ఒకవేళ మహ్మద్ సిరాజ్ ప్లేస్‌లో నైట్‌వాచ్‌మెన్‌గా రవిచంద్రన్ అశ్విన్ వచ్చి ఉంటే.. వికెట్ పడకుండా కాపాడుకునేవాడు. అతనికి గతంలో నైట్‌వాచ్‌మెన్‌గా ఆడిన అనుభవం ఉంది. ఒక నైట్ వాచ్‌మెన్ డ్యూటీలు ఏంటో కూడా అతనికి బాగా తెలుసు. ఆట ముగుస్తున్న దశలో పరుగులు చేయడం కంటే మరో వికెట్ పడకుండా అడ్డుకోవడమే నైట్ వాచ్‌మెన్ ప్రధాన కర్తవ్యం. కానీ.. సిరాజ్ ఫెయిలయ్యాడు. పైపెచ్చు న్యూజిలాండ్‌కి బోనస్‌గా రెండు వికెట్లు సమర్పించుకున్నట్లు అయ్యింది.
ప్రస్తుతం క్రీజులో శుభమన్ గిల్ (31 బ్యాటింగ్), రిషబ్ పంత్ (1 బ్యాటింగ్) ఉండగా.. భారత్ జట్టు ఇంకా తొలి ఇన్నింగ్స్‌లో 149 పరుగులు వెనకబడి ఉంది. సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, ఆకాశ్ దీప్ బ్యాటింగ్ చేయాల్సి ఉంది. వీరిలో ఆకాశ్ మినహా.. మిగిలిన వాళ్లు బ్యాటింగ్ చేయగలరు. కానీ.. స్పిన్‌కి అతిగా అనుకూలిస్తున్న పిచ్‌పై ఈరోజు ఎంతసేపు క్రీజులో నిలవగలరు అనేదానిపై భారత్ జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి.
పొంచి ఉన్న వైట్‌వాష్ ప్రమాదం
బెంగళూరు వేదికగా ముగిసిన తొలి టెస్టు, ఆ తర్వాత పుణెలో జరిగిన రెండో టెస్టులోనూ న్యూజిలాండ్ టీమ్‌కి తొలి ఇన్నింగ్స్‌లోనే భారీగా ఆధిక్యాన్ని భారత్ జట్టు కట్టబెట్టింది. ఈ మూడో టెస్టులోనూ ఆధిక్యాన్ని సమర్పించుకుంటే మ్యాచ్‌లో గెలవడం కష్టమే. ఇప్పటికే మూడు టెస్టుల సిరీస్‌లో 0-2తో వెనకబడిన టీమిండియా.. ఈ వాంఖడే టెస్టులోనూ ఓడిపోతే.. 24 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై వైట్‌వాష్ అవమానాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.