steven smith: అప్పుడు ఛీటర్ అన్నారు.. ఇప్పుడు 5 టెస్టుల్లో 4 సెంచరీలు.. సంచలన ఫామ్ లో స్మిత్
steven smith: ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ మాములు ఫామ్ లో లేడు. టెస్టుల్లో వరుసగా సెంచరీలు బాదేస్తున్నాడు. శ్రీలంకతో సిరీస్ లో వరుసగా రెండో శతకం నమోదు చేశాడు. ఒకప్పుడు బాల్ టాంపరింగ్ వివాదంలో ఛీటర్ గా పేరు తెచ్చుకున్న స్మిత్.. ఇప్పుడు బ్యాటింగ్ తో అదరగొడుతున్నాడు.

స్మిత్ ఆగేదే లేదు
ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న ఆస్ట్రేలియా ఆటగాడు స్మిత్ అసలు ఆగేదే లేదన్నట్లు దూసుకెళ్తున్నాడు. సెంచరీల మీద సెంచరీలు కొట్టేస్తున్నాడు. తాజాగా శ్రీలంకతో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో 131 పరుగులు చేశాడు. ఇదే సిరీస్ లో తొలి టెస్టు లోనూ అతను సెంచరీ (141)తో అదరగొట్టాడు. అతనాడిన గత 5 టెస్టుల్లో 4 సెంచరీలు చేయడం విశేషం.
అప్పుడు ఛీటర్
స్మిత్ ఎప్పుడూ నాణ్యమైన ఆటగాడే. ముఖ్యంగా టెస్టుల్లో అయితే ప్రదర్శన గొప్పగా సాగుతూనే వచ్చింది. కానీ 2018లో దక్షిణాఫ్రికాలో కేప్ టౌన్ టెస్టులో బాల్ టాంపరింగ్ కుంభకోణంలో స్మిత్ దోషిగా తేలాడు. ఆ బాల్ టాంపరింగ్ ప్రపంచ క్రికెట్ నే కుదిపేసింది. అప్పుడు ఆసీస్ కెప్టెన్ గా ఉన్న స్మిత్ పై క్రికెట్ ఆడకుండా 12 నెలల నిషేధం పడింది. రెండేళ్ల పాటు కెప్టెన్సీపై వేటు వేశారు. దీంతో అప్పుడందరూ స్మిత్ ను ఛీటర్ అంటూ విమర్శించారు. దక్షిణాఫ్రికా నుంచి వస్తూ సిడ్నీ ఎయిర్ పోర్ట్ లో స్మిత్ కన్నీళ్లు పెట్టుకున్నాడు.
పడి లేచిన స్మిత్
పరుగుల ఆకలితో ఉన్న స్మిత్ ఆ బాల్ టాంపరింగ్ తర్వాత మళ్లీ పుంజుకున్నాడు. క్రికెట్లో పునరాగమనం చేయడమే కాదు 2019 యాషెస్ సిరీస్ లో 774 పరుగులతో సత్తాచాటాడు. కానీ ఆ తర్వాత లయ తప్పాడు. వార్నర్ రిటైర్మెంట్ తో ఓపెనర్ గా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేద్దామనుకున్న స్మిత్ ఆ పొజిషన్ లో ఫెయిల్ అయ్యాడు. మధ్యలో 12 టెస్టుల్లో ఒక్క సెంచరీ కూడా చేయలేదు.
భారత్ తో సిరీస్ తో
బోర్డర్- గావస్కర్ సిరీస్ లో మూడో టెస్టులో భారత్ పై సెంచరీతో శతక నిరీక్షణకు ముగింపు పలికిన స్మిత్.. నాలుగో టెస్టులోనూ మూడంకెల స్కోరు అందుకున్నాడు. ఇప్పుడు శ్రీలంకతో రెండు టెస్టుల్లోనూ సెంచరీలు బాదాడు. ఇటీవల టెస్టుల్లో 10 వేల పరుగుల క్లబ్ లో చేరాడు. ప్రస్తుతం 36 టెస్టు శతకాలతో అత్యధిక సెంచరీల జాబితాలో అయిదో స్థానంలో ఉన్నాడు.
సంబంధిత కథనం