NZ vs Pak 4th T20I: నాలుగో టీ20లోనూ ఓడిన పాకిస్థాన్.. న్యూజిలాండ్ ఘన విజయం
NZ vs Pak 4th T20I: న్యూజిలాండ్ తో జరిగిన నాలుగో టీ20లోనూ పాకిస్థాన్ ఓడిపోయింది. ఇప్పటికే సిరీస్ కోల్పోయిన ఆ టీమ్.. శుక్రవారం (జనవరి 19) జరిగిన నాలుగో మ్యాచ్ లోనూ 7 వికెట్లతో ఓడింది.
NZ vs Pak 4th T20I: పాకిస్థాన్ టీమ్ మారలేదు. న్యూజిలాండ్ చేతుల్లో వరుసగా నాలుగో టీ20లోనూ పరాజయం పాలైంది. ఆ టీమ్ బ్యాటర్ రిజ్వాన్ 90 పరుగులతో వీరోచిత ఇన్నింగ్స్ ఆడినా.. ఆ టీమ్ కు ఓటమి తప్పలేదు. ఇప్పటికే మొదటి మూడు టీ20లు గెలిచి సిరీస్ సొంతం చేసుకున్న న్యూజిలాండ్.. ఇప్పుడు నాలుగో మ్యాచ్ లోనూ విజయం సాధించింది.

క్రైస్ట్‌చర్చ్ లో జరిగిన ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ 7 వికెట్లతో గెలిచింది. పాకిస్థాన్ ఇచ్చిన 159 పరుగుల లక్ష్యాన్ని ఆ టీమ్ 18.1 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి చేజ్ చేసింది. ఒక దశలో 20 పరుగులకే 3 వికెట్లు కోల్పోయినా.. డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో మరో వికెట్ నష్టపోకుండానే కివీస్ టీమ్ విజయం సాధించింది.
రిజ్వాన్ దంచికొట్టినా..
పాకిస్థాన్ టీమ్ లో మహ్మద్ రిజ్వాన్ మాత్రమే రాణించాడు. అతడు కేవలం 63 బంతుల్లోనే 90 పరుగులు చేయడం విశేషం. రిజ్వాన్ ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు, 2 సిక్స్ లు ఉన్నాయి. బాబర్ ఆజం 11 బంతుల్లో 19 రన్స్ చేయగా.. చివర్లో మహ్మద్ నవాజ్ 9 బంతుల్లోనే 21 రన్స్ చేయడంతో పాకిస్థాన్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 158 పరుగులు చేయగలిగింది.
ఆ తర్వాత చేజింగ్ లో పవర్ ప్లేలోనే షహీన్ షా అఫ్రిది మూడు వికెట్లు తీయడంతో పాకిస్థాన్ కు విజయంపై ఆశలు రేగాయి. కానీ డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ వాళ్ల ఆశలపై నీళ్లు చల్లారు. ఇద్దరూ కలిసి నాలుగో వికెట్ కు అజేయంగా 139 రన్స్ జోడించి న్యూజిలాండ్ ను గెలిపించారు. డారిల్ మిచెల్ 44 బంతుల్లోనే 72 రన్స్ చేశాడు.
అతని ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, 2 సిక్స్ లు ఉన్నాయి. ఇక గ్లెన్ ఫిలిప్స్ 52 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్ లతో 70 రన్స్ చేశాడు. ఈ ఇద్దరూ పాక్ బౌలర్లను చితకబాదారు. మరో 11 బంతులు మిగిలి ఉండగానే టీమ్ ను గెలిపించారు. ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్ లో న్యూజిలాండ్ ఆధిక్యం 4-0కి చేరింది.
పాపం పాకిస్థాన్
గతేడాది వరల్డ్ కప్ లో పాకిస్థాన్ తొలి రౌండ్లోనే ఓడిన తర్వాత బాబర్ ఆజం కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు. ఆ తర్వాత కెప్టెన్సీ షహీన్ షా అఫ్రిదిని వరించింది. టెస్టుల్లో షాన్ మసూద్ కెప్టెన్ గా ఉన్నాడు. అయితే బాబర్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత పాకిస్థాన్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఆస్ట్రేలియా చేతుల్లో మూడు టెస్టుల్లోనూ ఓడిన ఆ టీమ్.. ఇప్పుడు న్యూజిలాండ్ తో నాలుగు టీ20ల్లోనూ ఓడిపోయింది.
దీంతో పాక్ టీమ్ పై అక్కడి అభిమానులు దుమ్మెత్తి పోస్తున్నారు. వరల్డ్ కప్ లో పాక్ ఓటమికి బాబర్ ను నిందించిన వాళ్లకు ఇప్పుడు ఎవరిని లక్ష్యంగా చేసుకోవాలో కూడా అర్థం కావడం లేదు. న్యూజిలాండ్ తో తొలి మూడు టీ20ల్లో అయితే ప్రతి మ్యాచ్ లోనూ 200కుపైగా పరుగులు సమర్పించుకుంది పాక్ టీమ్. ఇది ఆ టీమ్ ను మరింత కుంగదీసింది.