Dinesh Karthik on Kohli: శ్రీలంకతో సిరీస్‍లో విరాట్ కోహ్లీ వైఫల్యంపై స్పందించిన దినేశ్ కార్తీక్.. ఏమన్నాడంటే..
Dinesh Karthik on Virat Kohli: శ్రీలంకతో వన్డే సిరీస్‍లో విరాట్ కోహ్లీ విఫలమయ్యాడు. మూడు మ్యాచ్‍ల్లోనూ కీలక సమయాల్లో ఔటయ్యాడు. ఈ సిరీస్‍ను టీమిండియా కోల్పోయింది. కాగా, లంకతో సిరీస్‍లో కోహ్లీ వైఫల్యంపై దినేశ్ కార్తీక్ మాట్లాడాడు.
ఇటీవల శ్రీలంక పర్యటనలో భారత్‍కు షాక్ ఎదురైంది. బ్యాటింగ్‍లో ఘోరంగా విఫలమైన టీమిండియా 0-2తో వన్డే సిరీస్ కోల్పోయింది. 27 ఏళ్ల తర్వాత లంకపై ద్వైపాక్షిక వన్డే సిరీస్‍లో పరాజయం పాలైంది. ఈ సిరీస్‍లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా విఫలమయ్యాడు. మూడు మ్యాచ్‍ల్లో వరుసగా 24, 14, 20 పరుగులు చేశాడు. కీలకమైన సమయాల్లో పెవిలియన్ చేరాడు. ఇది టీమిండియాపై ప్రభావం చూపింది.
శ్రీలంకతో వన్డే సిరీస్‍లో మూడు మ్యాచ్‍ల్లోనూ స్పిన్ బౌలర్లకే వికెట్ సమర్పించుకున్నాడు విరాట్ కోహ్లీ. లంకపై అద్బుత రికార్డు ఉన్న విరాట్ ఈ సిరీస్‍లో దారుణంగా విఫలమవడం కాస్త అనూహ్యంగా అనిపించింది. లంక సిరీస్‍లో కోహ్లీ ఫెయిల్ అవడంపై టీమిండియా మాజీ వికెట్ కీపింగ్ బ్యాటర్, ఆర్సీబీలో కోహ్లీ మాజీ టీమ్‍మేట్ దినేశ్ కార్తీక్ స్పందించాడు.
ఆందోళన అవసరం లేదు
విరాట్ కోహ్లీ ఫామ్ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని క్రిక్‍బజ్‍తో ఇంటర్వ్యూలో దినేశ్ కార్తీక్ అన్నాడు. లంకతో వన్డే సిరీస్‍లో ఆ పిచ్‍పై స్పిన్ ఆడడం కష్టంగా ఉండిందని చెప్పాడు. తాను విరాట్ కోహ్లీని ఏం వెనకేసుకోవడం రాలేదని అన్నాడు.
లంకతో సిరీస్‍లో సెమీ-న్యూబాల్‍తో స్పిన్ ఆడడం కఠినతరంగా కనిపించిందని కార్తీక్ చెప్పాడు. “ఈ సిరీస్‍లో స్పిన్ ఆడేందుకు కఠినతమైన పిచ్ అది. ముందుగా అది అంగీకరించాలి. విరాట్ కోహ్లీ అయినా, రోహిత్ శర్మ అయినా.. ఇంకెవరైనా సరే.. అది కష్టమైన పిచ్. 8 నుంచి 30 ఓవర్ల మధ్య కాస్త సెమీ-న్యూబాల్‍ను ఆడడం కఠినతరంగా ఉండింది. ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అలా ఎక్కువ పిచ్‍లు ఉండవు. స్పిన్నర్లను ఆడేందుకు అది కష్టమైన పిచ్. నేను కోహ్లీని ఇక్క వెనుకేసుకొని రావడం లేదు. స్పిన్ ఆడడం ఆ పిచ్‍పై కఠినంగా ఉందని మాత్రమే నేను చెబుతున్నా” అని కార్తీక్ చెప్పాడు.
భారత్, శ్రీలంక మధ్య మూడు వన్డేలు కొలంబో వేదికగానే జరిగాయి. ఆ పిచ్ స్పిన్‍కు ఎక్కువగా అనుకూలించింది. ఈ సిరీస్‍లో తొలి మ్యాచ్ టై కాగా.. తదుపరి రెండు వన్డేల్లో శ్రీలంక గెలిచింది. లంక స్పిన్నర్లు రాణించారు. మూడో వన్డేలో 138 పరుగులకే కుప్పకూలి 110 పరుగుల తేడాతో భారత్ ఘోరంగా ఓడింది. 0-2తో సిరీస్ కోల్పోయింది. టీమిండియా హెడ్ కోచ్‍గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టాక ఇదే తొలి పర్యటన. ఈ లంక టూర్‌లో టీ20 సిరీస్ క్లీన్‍స్వీప్ చేసిన భారత్.. వన్డే సిరీస్ కోల్పోయింది.
ఛాంపియన్స్ ట్రోఫీలో అదరగొడుతుంది
వచ్చే ఏడాది ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నీ జరగనుంది. అయితే, లంకతో వన్డే సిరీస్‍ను భారత్ కోల్పోవడంతో కాస్త దిగులు నెలకొంది. భారత్‍కు వరుసగా టెస్టు మ్యాచ్‍లు ఉన్నా.. ఒకే వన్డే సిరీస్ ఉంది. అయితే, ఇది పెద్ద సమస్య కాదని, చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా అదరగొడుతుందని దినేశ్ కార్తీక్ చెప్పాడు. “ఇప్పటి నుంచి టీమిండియాకు వరుసగా టెస్టులు ఉన్నాయి. వచ్చే ఏడాది ఇంగ్లండ్‍తో జరిగే వన్డే సిరీస్ కల్లా జట్టులో చాలా మార్పులు జరుగుతాయి. దానికి చాలా టైమ్ ఉంది. చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా తప్పకుండా అదరగొడుతుంది” అని కార్తీక్ చెప్పాడు.