వరుసగా మ్యాచ్ లు ఓడుతున్నామంటే ఏ టీమైనా గెలుపు ప్లాన్స్ కోసం కసరత్తు చేస్తుంది. ప్లాన్-ఎ పని చేయకపోతే ప్లాన్-బిని అమలు చేస్తుంది. కానీ ఐపీఎల్ 2025లో సీఎస్కేకు మాత్రం ప్లాన్-బి ఉన్నట్లు కనిపించడం లేదు. ఆ టీమ్ వరుసగా ఓడుతున్నా ఆటతీరులో, గేమ్ ప్లాన్ లో ఎలాంటి మార్పులు చేయడం లేదు. 43 ఏళ్ల వయసులో సీఎస్కే కెప్టెన్ గా లెజెండ్ ధోని తిరిగొచ్చినా ఎలాంటి యూజ్ లేదు. శుక్రవారం (ఏప్రిల్ 11) చెపాక్ లో జరిగిన మ్యాచ్ లో ఆ టీమ్ కేకేఆర్ చేతిలో చిత్తుచిత్తుగా ఓడింది.
ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ అంటే మహేంద్ర సింగ్ ధోనీనే ఫస్ట్ గుర్తుకొస్తాడు. కెప్టెన్ గా ఆ టీమ్ ను అయిదు సార్లు విజేతగా నిలిపాడు. తన వైబ్ తో ఫ్రాంఛైజీకి తిరుగులేని ఫ్యాన్ బేస్ సంపాదించి పెట్టాడు. కానీ దేనికైనా ఎండింగ్ అనేది ఉంటుంది. అలాగే ఎంఎస్ ధోని కెరీర్ కూ ఎండింగ్ ఉంటుంది. ఇప్పటికే అంతర్జాతీయ కెరీర్ కు ధోని వీడ్కోలు పలికి సుమారు అయిదేళ్లవుతోంది. అప్పటి నుంచి ఐపీఎల్ లో మాత్రమే ఆడుతున్నాడు.
ఇప్పడు ధోనీకి 43 ఏళ్లు. అయినా సీఎస్కే మాత్రం ధోని చుట్టూనే తిరుగుతోంది. మోకాలి శస్త్రచికిత్స తర్వాత ధోని ఫిట్ నెస్ మునుపటిలా లేదు. అయినా టీమ్ లో అతను ఉంటే వచ్చే క్రేజ్ వేరని ఫ్రాంఛైజీ నమ్ముతోంది. అందుకే ధోని రిటైర్మెంట్ కాకుండా ఇంకా ఆడుతూనే ఉన్నాడని చెప్పొచ్చు.
ఐపీఎల్ లో ఫస్ట్ సీజన్ నుంచి సీఎస్కేకు ధోని కెప్టెన్. 2022లో రవీంద్ర జడేజాకు టీమ్ పగ్గాలు అప్పజెప్పారు. కానీ టీమ్ ఓడుతుండటంతో ఈ కెప్టెన్సీ తన వల్ల కాదు బాబోయ్ అంటూ జడ్డూ మధ్యలోనే తప్పుకొన్నాడు. మళ్లీ ధోనీనే కెప్టెన్ అయ్యాడు. 2023లో టీమ్ ను ఛాంపియన్ గా నిలిపాడు. ఆ తర్వాతి సీజన్ లో రుతురాజ్ గైక్వాడ్ ను కొత్త కెప్టెన్ గా ఎంపిక చేశారు. ఆ సీజన్ లో టీమ్ 14 మ్యాచ్ ల్లో 7 గెలిచి, 7 ఓడింది. ప్లేఆఫ్స్ చేరలేకపోయింది.
ఇప్పుడు 2025లోనూ రుతురాజ్ కెప్టెన్ గా కొనసాగాడు. కానీ అతనికి ఇంజూరీ కారణంగా మళ్లీ ధోనీనే సారథ్యం తీసుకున్నాడు. 43 ఏళ్ల వయసులో రిటైర్మెంట్ ఎప్పుడా అని ప్రశ్నలు వస్తున్న వేళ.. ధోని మళ్లీ కెప్టెన్ అవడం ఊహించనిదే. ధోని కాకపోతే సీఎస్కేకు దిక్కే లేదా? అంటే ఇప్పుడు మాత్రం నో అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆ టీమ్ దగ్గర ప్లాన్-బి లేదు. రుతురాజ్ లేకపోతే కెప్టెన్ ఎవరు? అనే ప్రశ్నకు ఆ టీమ్ ఇంకా ఆన్సర్ రెడీ చేసుకోలేదు.
టీమ్ వరుసగా ఓడుతుంటే సీఎస్కే మేనేజ్ మెంట్, కోచింగ్ స్టాఫ్ ఏం చేస్తున్నారనేది అర్థం కావడం లేదు. ఎంతసేపు ధోని గురించే డిస్కషన్ తప్పా ఆ టీమ్ ప్రదర్శన బెటర్ కావడం లేదు. బ్యాటింగ్ లో రచిన్, కాన్వే, శివమ్, జడేజా, ధోని.. ఇలా ఎవరూ రాణించడం లేదు. బౌలింగ్ లో నూర్ అహ్మద్ తప్పా అందరూ ఫెయిల్ అవుతున్నారు. అయినా సీఎస్కే దగ్గర ప్లాన్-బి లేదు. టీమ్ కాంబినేషన్ ను మార్చే ఆలోచనే లేదు. ఏమైనా ధోని పేరు తప్పా ఇంకేం వినిపించడం లేదు.
భారత మాజీ క్రికెటర్ కైఫ్ కూడా ఇలాంటి ప్రశ్నలే లేవనెత్తాడు. ధోనీకి ఇదే లాస్ట్ సీజన్ హా? సరైన టైమ్ ఎప్పుడు? అంటూ ఎక్స్ లో ప్రశ్నించాడు. కేకేఆర్ టీమ్ లో నరైన్, వరుణ్ లాంటి స్పిన్నర్లు ఉన్నప్పుడు ఎందుకు చెపాక్ లో స్లో పిచ్ పై సీఎస్కే ఆడిందని అడిగాడు.
సంబంధిత కథనం