Nitish Kumar Reddy: 'తగ్గేదేలే’ అంటూ బ్యాట్‍తోనే పుష్ప గెస్చర్ చేసిన నితీశ్ కుమార్.. టెస్టుల్లో తొలి హాఫ్ సెంచరీ: వీడియో
Nitish Kumar Reddy IND vs AUS 4th Test: ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో భారత ప్లేయర్, తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ అదరగొట్టాడు. అద్భుతమైన బ్యాటింగ్‍తో ఇండియాను ఫాలోఆన్ గండం నుంచి తప్పించాడు.
భారత యంగ్ బ్యాటర్, తెలుగు ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి తన తొలి టెస్టు సిరీస్‍లోనే అదరగొడుతున్నాడు. ఆస్ట్రేలియాపై సిరీస్‍లో నిలకడగా అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. అరంగేట్రం సిరీస్‍లోనే ఆసీస్ గడ్డపై మెరిపిస్తూ ప్రశంసలు పొందుతున్నాడు. మెల్‍బోర్న్ వేదికగా ప్రస్తుతం జరుగుతున్న నాలుగో టెస్టులోనూ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు నితీశ్ కుమార్ రెడ్డి రాణించాడు. ఇండియాను ఫాలోఆన్ గండం నుంచి తప్పించాడు. తన అంతర్జాతీయ కెరీర్లో నేడు (డిసెంబర్ 28) తొలి అర్ధ శతకం చేశాడు. ఆ సమయంలో ‘తగ్గేదేలే’ అంటూ పుష్ప సిగ్నేచర్ గెస్చర్ చేశాడు. ఆ వివరాలివే..
నితీశ్ సూపర్ బ్యాటింగ్.. తొలి అర్ధ శతకం
ఆస్ట్రేలియాతో ఈ సిరీస్‍లో నితీశ్ మరోసారి భారత్‍ను కష్టాల నుంచి గట్టెక్కించాడు. తన అరంగేట్ర మ్యాచ్‍లోనే 41, 38 చేసి భారత్ గెలువడంలో నితీశ్ కీలకపాత్ర పోషించాడు. మూడు టెస్టుల్లో మూడుసార్లు నలభై స్కోరు చేరాడు. నేడు నాలుగో టెస్టులో అర్ధ శతకం మార్కును నితీశ్ కుమార్ చేరుకున్నాడు. భారత్ ఫాలోఆన్ చిక్కుల్లో పడుతుందనే సమయంలో నితీశ్ చెలరేగాడు. ఆస్ట్రేలియా బౌలర్లను నితీశ్ దీటుగా ఎదుర్కొన్నాడు.
ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టు మూడో రోజైన నేడు (డిసెంబర్ 28) అర్ధ శతకం మార్క్ చేశాడు నితీశ్. టెస్టుల్లో తన తొలి అర్ధ శతకం నమోదు చేశాడు. ఆ తర్వాత కూడా జోరు కొనసాగిస్తున్నాడు. 81 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్కు దాటాడు నితీశ్.
‘పుష్ప’ సెలెబ్రేషన్స్
హాఫ్ సెంచరీ చేరాక ‘పుష్ప’ సెలెబ్రేషన్స్ చేసుకున్నాడు నితీశ్. తగ్గేదేలే అంటూ బ్యాట్‍తోనే పుష్ప సిగ్నేచర్ గెస్చర్ చేశాడు. పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ చేసిన పాపులర్ గెస్చర్ చేసి.. తాను బ్యాటింగ్‍లో తగ్గనని చెప్పేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నాలుగో టెస్టు మూడో రోజు ప్రస్తుతం టీమిండియా 7 వికెట్లకు 315 పరుగుల వద్ద ఉంది. నితీశ్ కుమార్ రెడ్డి (77 నాటౌట్), వాషింగ్టన్ సుందర్ (39 నాటౌట్) బ్యాటింగ్ చేస్తున్నారు. ఇప్పటికే వీరి భాగస్వామ్యం 94 పరుగులకు చేరింది. ఇద్దరూ జోరుగా ఆడుతున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఇంకా ఆస్ట్రేలియా స్కోరుకు 159 పరుగులు వెనుకబడి ఉంది. ఇంకా జోరుగా ఆడుతున్న నితీశ్ తన తొలి టెస్టు శతకం చేస్తాడేమో చూడాలి.