Nitish Kumar Reddy: ఆసీస్ గడ్డపై తెలుగోడి సత్తా.. తొలి సెంచరీతో అదరగొట్టిన నితీశ్.. కన్నీరు పెట్టుకున్న తండ్రి
Nitish Kumar Reddy Century: భారత బ్యాటర్ నితీశ్ కుమార్ రెడ్డి ఆసీస్ గడ్డపై కదం తొక్కాడు. ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో శతకం బాదేశాడు. అంతర్జాతీయ క్రికెట్‍లో తన తొలి సిరీస్‍లోనే తొలి సెంచరీ చేశాడు ఈ తెలుగు ఆటగాడు. భారత్‍ను ఫాలోఆన్ గండం నుంచి తప్పించాడు.
ఆస్ట్రేలియా గడ్డపై తెలుగు ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి గర్జించాడు. అద్భుతమైన ఆటతో భారత్‍ను ఫాలోఆన్ గండం నుంచి తప్పించడంతో పాటు సెంచరీతో కదం తొక్కాడు. టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన తన తొలి సిరీస్‍లోనే శతకంతో అదరగొట్టాడు. తన నాలుగో టెస్టులో సెంచరీ మార్క్ చేరి దుమ్మురేపాడు. మెల్‍బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టు మూడో రోజైన నేడు (డిసెంబర్ 28) సెంచరీ చేశాడు నితీశ్.
కష్టాల్లో వచ్చి సెంచరీ.. బాహుబలి సెలెబ్రేషన్స్
171 బంతుల్లోనే నితీశ్ కుమార్ రెడ్డి సెంచరీ మార్క్ చేరాడు. సంతోషంగా సెలెబ్రేట్ చేసుకున్నాడు. బ్యాట్ హ్యాండిల్‍పై హెల్మెట్ పెట్టి.. బాహుబలి చిత్రంలో ప్రభాస్ కూర్చున్న స్టైల్‍లో సంబరం చేసున్నాడు. టీమిండియా కష్టాల్లో ఉన్న సమయంలో వచ్చి అద్భుతమైన బ్యాటింగ్‍తో ఆస్ట్రేలియా బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు నితీశ్. నిలకడగా ఆడుతూనే వీలైనప్పుడల్లా బౌండరీలు బాదాడు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ పరుగులు రాబట్టాడు. 171 బంతుల్లోనే శతకం బాదేశాడు నితీశ్. 191 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి ఫాలోఆన్ ప్రమాదంలో ఉన్న భారత్‍ను అద్భుత శతకంతో ఆదుకొని చిరస్మరణీయ సెంచరీ సాధించాడు నితీశ్ కుమార్. బ్యాటింగ్ ఆర్డర్లో ఎనిమిదో స్థానంలో వచ్చి శతకం బాదాడు.
నితీశ్ తండ్రి భావోద్వేగం
నితీశ్ కుమార్ రెడ్డి సెంచరీ చేయడంతో అతడి తండ్రి ముత్యాల రెడ్డి ఎమోషనల్ అయ్యారు. భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారు. స్టాండ్స్‌లో కూర్చున్న ముత్యాల రెడ్డి.. నితీశ్ సెంచరీ మార్క్ చేరగానే నమస్కరిస్తూ భావోద్వేగంతో కాస్త కన్నీరు పెట్టుకున్నారు. నితీశ్ క్రికెట్ కెరీర్ కోసం ఉద్యోగం కూడా ముత్యాల రెడ్డి ఓ దశలో వదులుకున్నారు. ఇప్పుడు కుమారుడు శతకం చేయడం చూసి ఎమోషనల్ అయ్యారు.
నితీశ్ రికార్డు
ఆస్ట్రేలియా గడ్డపై బ్యాటింగ్ ఆర్డర్లో ఎనిమిదో స్థానంలో వచ్చి టెస్టు సెంచరీ చేసిన తొలి భారత బ్యాటర్‌గా నితీశ్ కుమార్ రెడ్డి చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియాలో 8వ స్థానంలో వచ్చి అత్యధిక స్కోరు చేసిన భారత బ్యాటర్ రికార్డు ఇప్పటి వరకు అనిల్ కుంబ్లే (85) పేరుతో ఉండేది. దాన్ని నితీశ్ ఇప్పుడు బద్దలుకొట్టి చరిత్ర సృష్టించాడు.
నాలుగో టెస్టులో టీమిండియా ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్లకు 358 పరుగుల వద్ద ఉంది. నితీశ్ కుమార్ రెడ్డి (176 బంతుల్లో 105 నాటౌట్; 10 ఫోర్లు, ఓ సిక్స్), మహమ్మద్ సిరాజ్ (2 నాటౌట్) క్రీజులో ఉన్నారు. వాన వల్ల అంతరాయం ఏర్పడింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ స్కోరుకు భారత్ ఇంకా 116 పరుగుల దూరంలో ఉంది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగులు చేసింది.
సుందర్.. అదుర్స్
వాషింగ్టన్ సుందర్ కూడా మంచి అర్ధ శతకం చేశాడు. నితీశ్, సుందర్ కలిసి భారత్‍ను ఆదుకున్నారు. సుందర్ 162 బంతుల్లో 50 పరుగులు చేశాడు. నితీశ్, సుందర్ 127 పరుగుల భాగస్వామ్యం జోడించి భారత్‍ను ఫాలోఆన్ గండం నుంచి కాపాడారు. సుందర్ ఔటయ్యాక బుమ్రా డకౌట్ అయ్యాడు. నితీశ్ సెంచరీకి సమీపించిన సమయంలో చివరి వికెట్‍గా సిరాజ్ వచ్చాడు. అయితే, మూడు బంతులను సిరాజ్ సేఫ్‍గా ఆడాడు. ఆ తర్వాత నితీశ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.