Nitish Kumar Reddy Father: కొడుకు క్రికెట్ కెరీర్ కోసం గవర్నమెంట్ జాబ్ వదులుకున్న నితీష్‌కుమార్ రెడ్డి తండ్రి
Nitish Reddy: బాక్సింగ్ డే టెస్ట్‌లో నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ సాధించడంతో అతడి తండ్రి ముత్యాల రెడ్డి ఎమోషనల్ అయ్యాడు. కొడుకును క్రికెటర్‌గా తీర్చిదిద్దడం కోసం ముత్యాల రెడ్డి ఎన్నో త్యాగాలు చేశాడట. గవర్నమెంట్ జాబ్ కూడా వదులుకున్నట్లు సన్నిహితులు చెబుతోన్నారు.
బాక్సింగ్ డే టెస్ట్‌లో టీమిండియా పరువును తెలుగు క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి కాపాడాడు. 221 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి ఫాలో ఆన్ ప్రమాదంలో పడ్డ టీమిండియాను వాషింగ్టన్ సుందర్‌తో కలిసి గట్టెక్కించాడు. కెరీర్‌లోనే తొలి టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి 105 పరుగులతో నితీష్ కుమార్ రెడ్డి నాటౌట్‌గా నిలిచాడు.
సిరాజ్ సహకారంతో...
ఆస్ట్రేలియా జట్టుపై ఎనిమిదో ప్లేస్‌లో బ్యాటింగ్ దిగి అత్యధిక పరుగులు చేసిన టీమిండియా క్రికెటర్‌గా నిలిచాడు. నితీష్ కుమార్ రెడ్డిపై క్రికెట్ వర్గాలతో పాటు అభిమానులు ప్రశంసలు కురిపిస్తోన్నారు. నితీష్ కుమార్ 99 పరుగుల వద్ద ఉండగా... బుమ్రా ఔట్ కావడంతో సెంచరీ పూర్తవుతుందా లేదా అని అభిమానులు టెన్షన్ పడ్డారు. బ్యాటింగ్ దిగిన సిరాజ్ ఆస్ట్రేలియా బౌలింగ్‌ను ఎదురుకుంటూ నితీష్ సెంచరీ పూర్తిచేయడానికి సహకారం అందించాడు.
సోషల్ మీడియాలో వైరల్...
నితీష్ సెంచరీ సెలబ్రేషన్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి. నితీష్ కుమార్ రెడ్డి సెంచరీ చేయగానే గ్యాలరీలో మ్యాచ్ చూస్తోన్న అతడి తండ్రి ముత్యాల రెడ్డి ఎమోషనల్ అయ్యాడు కన్నీళ్లు పెట్టుకున్నాడు. నితీష్ తండ్రిని ఫ్యాన్స్ అభినందనల్లో ముంచెత్తారు.
గవర్నమెంట్ జాబ్‌కు రిజైన్
కొడుకును క్రికెటర్‌గా తీర్చిదిద్దేందుకు నితీష్ తండ్రి ముత్యాల రెడ్డి ఎన్నో త్యాగాలు చేశాడు. చాలా కష్టాలను అనుభవించాడు. కొడుకు కెరీర్ కోసం ముత్యాల రెడ్డి ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశాడట. వైజాగ్‌లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినా హిందుస్థాన్ జింక్‌లో ముత్యాల రెడ్డి ఉద్యోగం చేసేవాడట. వైజాగ్ నుంచి ఉదయ్‌పూర్‌కు ట్రాన్స్‌ఫర్ కావడంతో కొడుకు క్రికెటర్ కల నెరవేరదనే ఆలోచనతో జాబ్‌కు రిజైన్ చేశాడట.
మరో ఇరవై ఐదేళ్ల సర్వీస్ ఉండగానే కొడుకు కోసం జాబ్ వదులుకున్నట్లు సన్నిహితులు చెబుతోన్నారు. జాబ్‌కు రిజైన్ చేసిన తర్వాత వచ్చిన డబ్బులను సైతం కొడుకు క్రికెట్ కోచింగ్ కోసమే ఖర్చు చేశాడట. ఈ క్రమంలో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదురైన వాటిని దాటుకొంటూ నితీష్‌ను క్రికెటర్‌గా తీర్చిదిద్దాడు.
అప్పుడు ఇరవై లక్షలు...
తండ్రి కలను అర్థం చేసుకున్న నితీష్ కూడా వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇప్పుడు ఏకంగా టీమిండియాలో స్థానం దక్కించుకోవడమే కాకుండా సెంచరీతో అదరగొట్టాడు. 2023 ఐపీఎల్ వేలంలో నితీష్ కుమార్ రెడ్డిని 20 లక్షలకు సన్‌రైజర్స్ సొంతం చేసుకున్నది. ఐపీఎల్ 2024లో బ్యాటింగ్‌తో బౌలింగ్‌లో అదరగొట్టిన ఈ తెలుగు క్రికెటర్‌ను ఆరు కోట్లకు సన్‌రైజర్స్ రిటైన్ చేసుకున్నది.
నాలుగో టెస్ట్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 474 పరుగులు చేసింది. మూడో రోజు ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా తొమ్మిది వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. నితీష్ కుమార్ రెడ్డి 105 రన్స్, సిరాజ్ 2 రన్స్‌తో క్రీజులో ఉన్నారు. యశస్వి జైస్వాల్ 82, సుందర్ 50 పరుగులు చేశారు.