వెస్టిండీస్ మాజీ టీ20 కెప్టెన్ నికోలస్ పూరన్ మంగళవారం (జూన్ 10) అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కేవలం 29 ఏళ్ల వయసులోనే ఇంటర్నేషనల్ క్రికెట్ కు వీడ్కోలు పలికి షాకిచ్చాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ తన నిర్ణయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. సూపర్ ఫామ్ లో ఉంటూ, అలవోకగా భారీ షాట్లు ఆడగలిగే పూరన్ ఇంత త్వరగా అంతర్జాతీయ క్రికెట్ ను వీడటం కచ్చితంగా షాకే.
పూరన్ వెస్టిండీస్ తరపున 61 టీ20లు, 106 వన్డేలు ఆడాడు. వన్డేల్లో 1983 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలున్నాయి. టీ20ల్లో 2275 పరుగులు సాధించాడు. 13 ఫిఫ్టీస్ బాదాడు. అంతర్జాతీయ టీ20ల్లో వెస్టిండీస్ తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా నికోలస్ పూరన్ రికార్డు నెలకొల్పాడు. రిటైర్మెంట్ ఆలోచనతోనే ఇంగ్లాండ్ తో వైట్ బాల్ సిరీస్ కు తనను పరిగణించొద్దని పూరన్ కోరినట్లు తెలిసింది. ఐపీఎల్ 2025 లక్నో తరపున పూరన్ అదరగొట్టాడు.
"క్రికెట్ అభిమానులకు.. చాలా ఆలోచనలు, చర్చల తర్వాత నేను అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటిస్తున్నా. మనం ప్రేమించే ఈ క్రీడ ఆనందం, లక్ష్యం, మరపురాని జ్ఞాపకాలు, వెస్టిండీస్ ప్రజలకు ప్రాతినిధ్యం వహించే అవకాశం.. ఇలా ఎంతో ఇచ్చింది. ఇంకా ఇస్తుంది. మెరూన్ ధరించడం, జాతీయ గీతం కోసం నిలబడటం, నేను మైదానంలో అడుగుపెట్టిన ప్రతిసారీ నా శక్తి మేరకు ప్రయత్నించడం.. వీటిని చెప్పడానికి మాటలు లేవు.
జట్టుకు కెప్టెన్‌గా నాయకత్వం వహించడం నేను ఎప్పటికీ నా హృదయానికి దగ్గరగా ఉంచుకునే ఒక గొప్ప అవకాశం" అని పూరన్ పోస్టు చేశాడు.
"మీ స్థిరమైన ప్రేమకు అభిమానులకు ధన్యవాదాలు. కష్ట సమయాల్లో నన్ను ప్రోత్సహించారు. మంచి సమయాల్లో సరితూగలేని ఉత్సాహంతో నన్ను ఆదరించారు. నా కుటుంబం, స్నేహితులు, సహచరులకు - నాతో కలిసి ఈ ప్రయాణం చేసినందుకు ధన్యవాదాలు. మీ నమ్మకం, మద్దతు నన్ను ముందుకు నడిపించాయి" అని తన ప్రకటనలో పూరన్ పేర్కొన్నాడు. "నా కెరీర్‌లో అంతర్జాతీయ అధ్యాయం ముగిసినప్పటికీ, వెస్టిండీస్ క్రికెట్‌పై నా ప్రేమ ఎప్పటికీ తరగదు. జట్టుకు, ప్రాంతానికి రాబోయే రోజుల్లో విజయం, బలం చేకూరాలని కోరుకుంటున్నా" అని అతను చెప్పాడు.
పూరన్ రిటైర్మెంట్ షాకింగ్‌గా ఉంది. ఎందుకంటే భారతదేశం, శ్రీలంకలో జరగనున్న టీ20 ప్రపంచ కప్‌నకు కేవలం 8 నెలలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అతను 2016లో దుబాయ్‌లో పాకిస్తాన్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్ తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత మూడేళ్లకు బ్రిడ్జ్‌టౌన్, బార్బడోస్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వన్డేల్లో అరంగేట్రం చేశాడు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ గత సంవత్సరం వెస్టిండీస్ టీ20 ప్రపంచ కప్ జట్టులో భాగమయ్యాడు. మే 2022లో అతను దేశ వైట్-బాల్ కెప్టెన్‌గా నియమితులయ్యాడు.
అయితే ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచ కప్ తర్వాత పూరన్ కెప్టెన్ పదవికి రాజీనామా చేశాడు. పూరన్ చివరిసారిగా డిసెంబర్ 2024లో కింగ్‌స్టౌన్, జమైకాలో బంగ్లాదేశ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్ తరపున ఆడాడు. కరేబియన్ జట్టు తరపున చివరిసారిగా ఆడిన మ్యాచ్‌లో పూరన్ 10 బంతుల్లో 15 పరుగులు చేశాడు.
సంబంధిత కథనం