New Zealand World Cup Team: వన్డే వరల్డ్ కప్ కోసం న్యూజిలాండ్ సోమవారం (సెప్టెంబర్ 11) 15 మందితో కూడిన జట్టును అనౌన్స్ చేసింది. ఈ టీమ్ కు కెప్టెన్ గా కేన్ విలియమ్సన్ ఉండనున్నాడు. చాలా రోజులుగా గాయంతో బాధపడుతున్న విలియమ్సన్ కాలంతో పోటీ పడి సమయానికి పూర్తిగా కోలుకున్నాడు. దీంతో కివీస్ టీమ్ లో అతనికి చోటు దక్కింది.
ఐపీఎల్లో గుజరాత్ టైటన్స్ జట్టుకు ఆడిన కేన్ విలియమ్సన్.. ఆ లీగ్ లో తీవ్రంగా గాయపడ్డాడు. ఆడిన తొలి మ్యాచ్ లో గాయపడి లీగ్ మొత్తానికి దూరమయ్యాడు. కుడి మోకాలికి తీవ్ర గాయమైంది. ఓ క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో విలియమ్సన్ గాయపడ్డాడు. ఆ తర్వాత సర్జరీ కూడా అవసరం కావడంతో కొన్ని నెలల పాటు క్రికెట్ కు దూరమయ్యాడు.
వరల్డ్ కప్ టీమ్ ఎంపికకు ముందు కూడా న్యూజిలాండ్ టీమ్ మేనేజ్‌మెంట్ విలియమ్సన్ కు రెండు వారాల గడువు ఇచ్చింది. ఆలోపు కోలుకోలేకపోతే వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కదని స్పష్టం చేసింది. సర్జరీ తర్వాత కఠినమైన రీహ్యాబిలిటేషన్ ప్రక్రియలో పాల్గొన్నా.. వరల్డ్ కప్ సమయానికి తాన పూర్తిగా కోలుకోవడం అనుమానమే అని గతంలో విలియమ్సన్ చెప్పాడు.
అయితే సమయానికి అతడు కోలుకోవడం న్యూజిలాండ్ కు పెద్ద ఊరటనే చెప్పాలి. ఎంపిక ప్రక్రియకు ముందు తన ఫిట్‌నెస్ ను అతడు నిరూపించుకున్నాడు. 2015, 2019 వరల్డ్ కప్ లలో ఫైనల్ వరకూ వచ్చిన న్యూజిలాండ్.. ఈసారి కూడా అదే స్థాయిలో రాణించాలంటే విలియమ్సన్ జట్టులో ఉండటం కీలకం. ఈ నేపథ్యంలో అతడు తిరిగి రావడం ఫ్యాన్స్ కు ఊరట కలిగించింది.
విలిమయ్సన్ తన కెరీర్లో నాలుగో వరల్డ్ కప్ ఆడనున్నాడు. మరో సీనియర్ పేసర్ టిమ్ సౌథీకి కూడా ఇది నాలుగో టోర్నీ. ఇక మార్క్ చాప్‌మాన్, డెవాన్ కాన్వే, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్, విల్ యంగ్, రచిన్ రవీంద్ర లాంటి వాళ్లు తమ తొలి వరల్డ్ కప్ ఆడబోతున్నారు.
కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ట్రెంట్ బౌల్ట్, మార్క్ చాప్‌మాన్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ, టామ్ లేథమ్, డారిల్ మిచెల్, జిమ్మీ నీషమ్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, మిచెల్ సాంట్నర్, ఇష్ సోధి, టిమ్ సౌథీ, విల్ యంగ్.