యూఏఈ వేదికగా ఇటీవల జరిగిన ఉమెన్స్ టీ20 వరల్డ్‌కప్‌లో నిరాశపరిచిన భారత్ మహిళల క్రికెట్ జట్టు.. రెండు వారాల వ్యవధిలోనే గాడిన పడినట్లు కనిపిస్తోంది. మంగళవారం అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో మొదట బ్యాటింగ్ చేస్తున్న న్యూజిలాండ్ టీమ్.. భారత్ బౌలర్ల దెబ్బకి 26 ఓవర్లు ముగిసే సమయానికి 95/5తో కష్టాల్లో నిలిచింది.
ఫామ్‌లో ఉన్న న్యూజిలాండ్ కెప్టెన్ సోఫియా డివైన్ (9) సింగిల్ డిజిట్ స్కోరుకే ఔటైపోవడంతో న్యూజిలాండ్ చాలా తక్కువ స్కోరుకే పరిమితమయ్యే అవకాశం ఉంది. మూడు వన్డేల ఈ సిరీస్‌లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ముగియగా.. భారత్ జట్టు ఒక మ్యాచ్‌లో, న్యూజిలాండ్ ఒక మ్యాచ్‌లో గెలిచింది.
అక్టోబరు 24న అహ్మదాబాద్ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు 44.3 ఓవర్లలో 227 పరుగులకి ఆలౌటైంది. అనంతరం ఛేదనలో భారత్ బౌలర్ల దెబ్బకి న్యూజిలాండ్ టీమ్ 40.4 ఓవర్లలో 168 పరుగులకే ఆలౌటైంది. మ్యాచ్‌లో బ్యాట్‌తో 51 బంతుల్లో 41 పరుగులు చేసి, ఒక వికెట్ కూడా పడగొట్టిన దీప్తి శర్మకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
అక్టోబరు 27న అహ్మదాబాద్ వేదికగానే జరిగిన రెండో వన్డేలో ఫస్ట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ టీమ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 259 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో తడబడిన భారత్ జట్టు 47.1 ఓవర్లలో 183 పరుగులకి ఆలౌటైంది. ఆ మ్యాచ్‌లో కివీస్ కెప్టెన్ సోఫియా 86 బంతుల్లో 79 పరుగులు చేసింది.
మూడు వన్డేల సిరీస్ ప్రస్తుతం 1-1తో సమం అవగా.. ఈరోజు మ్యాచ్‌లో గెలిచిన జట్టుకి వన్డే సిరీస్ దక్కనుంది. ఉమెన్స్ టీ20 వరల్డ్‌కప్‌లో కనీసం సెమీస్ బెర్తుని కూడా దక్కించుకోలేకపోయిన భారత్ జట్టు.. ఆ మెగా టోర్నీలో కూడా గ్రూప్ దశలో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయింది. దాంతో ఈ వన్డే సిరీస్‌ను గెలవడం ద్వారా న్యూజిలాండ్ టీమ్‌పై ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉంది.