Nz vs Pak T20 Series: నిన్న శ్రేయస్.. ఈ రోజు సీఫర్ట్.. 97 నాటౌట్.. పాకిస్థాన్ ను చిత్తు చేసిన కివీస్-new zealand vs pakistan t20 series won by kiwis with 4 1 in the absence of 10 key players tim seifert shreyas iyer 97 ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Nz Vs Pak T20 Series: నిన్న శ్రేయస్.. ఈ రోజు సీఫర్ట్.. 97 నాటౌట్.. పాకిస్థాన్ ను చిత్తు చేసిన కివీస్

Nz vs Pak T20 Series: నిన్న శ్రేయస్.. ఈ రోజు సీఫర్ట్.. 97 నాటౌట్.. పాకిస్థాన్ ను చిత్తు చేసిన కివీస్

Nz vs Pak T20 Series: 10 మంది కీ ప్లేయర్ లేకపోయినా టీ20 సిరీస్ లో పాకిస్థాన్ ను న్యూజిలాండ్ చిత్తుచిత్తు చేసింది. 5 టీ20ల సిరీస్ ను 4-1తో సొంతం చేసుకుంది. చివరి వన్డేలోనూ బ్లాక్ క్యాప్స్ టీమ్ అదరగొట్టింది. సీఫర్ట్ 97 నాటౌట్ గా నిలిచాడు.

టీ20 సిరీస్ ట్రోఫీతో న్యూజిలాండ్ టీమ్ (AFP)

న్యూజిలాండ్ క్రికెట్ జట్టు అదరగొట్టింది. 10 మంది కీ ప్లేయర్స్ లేకపోయినా పాకిస్థాన్ టీమ్ ను ఓ ఆటాడుకుంది. అయిదు టీ20ల సిరీస్ లో ఆధిపత్యం ప్రదర్శించింది. సిరీస్ ను 4-1తో సొంతం చేసుకుంది. బుధవారం (మార్చి 26) జరిగిన చివరి టీ20లోనూ పాక్ కు ఓటమి తప్పలేదు. ఆ జట్టు 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ చేతిలో ఓడింది. ఓపెనర్ సీఫర్ట్ 97 నాటౌట్ గా నిలిచాడు. మంగళవారం (మార్చి 25) ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ పై పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా 97 పరుగులతో నాటౌట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

సీఫర్ట్ ధనాధన్

పాకిస్థాన్ తో అయిదో టీ20లో 129 పరుగుల స్వల్ప ఛేదనలో న్యూజిలాండ్ ఓపెనర్ టిమ్ సీఫర్ట్ రెచ్చిపోయాడు. ఎడాపెడా బౌండరీలు బాదేశాడు. పాకిస్థాన్ బౌలర్లను చితక్కొట్టాడు. మరో ఓపెనర్ ఫిన్ అలెన్ (12 బంతుల్లో 27) కూడా దంచడంతో కివీస్ స్కోరు బోర్డు రాకెట్ లా దూసుకెళ్లింది. 6 ఓవర్లకే ఆ టీమ్ 92 పరుగులు చేసింది. టీ20లో న్యూజిలాండ్ కు ఇదే అత్యధిక పవర్ ప్లే స్కోరు. అలెన్, చాప్ మన్ (3) ఔటైనా.. సీఫర్ట్ దంచుడు ఆగలేదు.

సెంచరీ అందలేదు

పాకిస్థాన్ ఇంకో 3 రన్స్ ఎక్కువ చేసినా బాగుండేదని అనుకోని కివీస్ ఫ్యాన్ ఉండడు. ఎందుకంటే పాక్ ఇంకో 3 పరుగులు ఎక్కువ చేసి ఉంటే.. సీఫర్ట్ సెంచరీ చేసే అవకాశం ఉండేది. షాదాబ్ వేసిన పదో ఓవర్లో నాలుగు సిక్సర్లతో సీఫర్ట్ మ్యాచ్ ముగించాడు. 38 బంతుల్లో 6 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో అజేయంగా 97 పరుగులు చేశాడు. 10 ఓవర్లలోనే టీమ్ ను గెలిపించాడు.

నీషమ్ అదుర్స్

మొదట టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పాకిస్థాన్ ను కివీస్ పేసర్ జేమ్స్ నీషమ్ వణికించాడు. 5 వికెట్లతో పాక్ నడ్డి విరిచాడు. ఆ టీమ్ లో కెప్టెన్ సల్మాన్ అఘా (39 బంతుల్లో 51) ఒక్కడే కాస్త రాణించాడు. ఒకే ఓవర్లో షాదాబ్ ఖాన్ (28), జహందాద్ ఖాన్ (1)ను ఔట్ చేసిన నీషమ్.. ఆ తర్వాత మరో ఓవర్లో సల్మాన్ అఘా, సుఫియాన్ (0) వికెట్లు పడగొట్టాడు. నీషమ్ ధాటికి తల్లడిల్లిన పాక్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 128 పరుగులే చేసింది.

10 మంది లేకపోయినా

పాకిస్థాన్ తో సిరీస్ కు న్యూజిలాండ్ టీమ్ కు 10 మంది కీ ప్లేయర్స్ దూరమయ్యారు. ఐపీఎల్ లో ఆడటంతో పాటు ఇతర కారణాలతో ఈ సిరీస్ కు అందుబాటులో లేరు. కేన్ విలియమ్సన్, శాంట్నర్, రచిన్ రవీంద్ర, ఫిలిప్స్, బౌల్ట్, కాన్వే, ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ, లేథమ్, విల్ యంగ్ లేకపోయినా పాక్ ను కివీస్ చిత్తుచేసింది. దాదాపు కొత్త టీమ్ తో ఆడిన కివీస్ కు పాక్ ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది.

Chandu Shanigarapu

TwittereMail
చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం