NZ vs Pak 2nd T20: న్యూజిలాండ్ పర్యటనలోనూ పాకిస్థాన్ క్రికెట్ టీమ్ తీరు మారడం లేదు. ఆ టీమ్ వరుసగా రెండో టీ20లోనూ ఓడిపోయింది. మంగళవారం (మార్చి 18) జరిగిన ఈ మ్యాచ్ లో కివీస్ టీమ్ 5 వికెట్ల తేడాతో పాక్ ను చిత్తు చేసి 2-0 ఆధిక్యం సంపాదించింది. ఆ టీమ్ ఓపెనర్ టిమ్ సీఫర్ట్ 22 బంతుల్లోనే 45 రన్స్ చేశాడు.
వర్షం కారణంగా ఈ రెండో టీ20ని ఒక్కో ఇన్నింగ్స్ 15 ఓవర్లకు కుదించారు. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 9 వికెట్లకు 135 రన్స్ చేసింది. ఆ టీమ్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా 46 రన్స్ చేశాడు. ఆ తర్వాత న్యూజిలాండ్ చేజింగ్ లో తొలి ఓవరే షహీన్ షా అఫ్రిది మెయిడెన్ వేశాడు.
కానీ తర్వాతి ఓవర్ నుంచే పరిస్థితి మారిపోయింది. న్యూజిలాండ్ ఓపెనర్లు తర్వాత 12 బంతుల్లో ఏకంగా 7 సిక్స్ లు బాదడం విశేషం. ఓపెనర్ల జోరు న్యూజిలాండ్ టీమ్ 136 పరుగుల లక్ష్యాన్ని మరో 11 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్లు కోల్పోయి చేజ్ చేసింది.
15 ఓవర్లలో 136 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ మొదట కాస్త జాగ్రత్తగా ఆడింది. తొలి ఓవర్ లో ఒక్క పరుగు కూడా రాలేదు. రెండో ఓవర్ నుంచి ఓపెనర్లు సీఫర్ట్, అలెన్ జోరు పెంచారు. తర్వాతి 4 ఓవర్లలో ఏకంగా 66 పరుగులు రావడం విశేషం. పవర్ ప్లే 5 ఓవర్లు ముగిసే సమయానికి లక్ష్యం 60 బంతుల్లో 70 పరుగులకు దిగి వచ్చింది.
సీఫర్ట్, అలెన్ ఇద్దరూ చెరో ఐదు సిక్స్‌లు బాదారు. సీఫర్ట్ 22 బంతుల్లోనే 5 సిక్స్ లు, 3 ఫోర్లతో 45 రన్స్ చేశాడు. ఇక అలెన్ కూడా కేవలం 16 బంతుల్లోనే ఒక ఫోర్, 5 సిక్స్ లతో 38 రన్స్ చేయడం విశేషం. ఈ ఇద్దరూ తొలి వికెట్ కు 4.4 ఓవర్లలోనే 66 పరుగులు జోడించారు. ఆ తర్వాత కివీస్ మిడిల్ ఓవర్లలో వరుసగా మూడు వికెట్లు కోల్పోయినా అప్పటికే పాకిస్థాన్ కు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్ లో న్యూజిలాండ్ 2-0 ఆధిక్యం సంపాదించింది.
సంబంధిత కథనం