Champions Trophy: పాక్ కు షాక్.. న్యూజిలాండ్ దే ఆరంభం.. ఛాంపియన్స్ ట్రోఫీ తొలి మ్యాచ్ లో ఘన విజయం
Champions Trophy: ఛాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ అదరగొట్టింది. టోర్నీ ఆరంభ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్థాన్ కు షాకిచ్చింది. ఆల్ రౌండ్ ప్రదర్శనతో చెలరేగిన కివీస్.. పాక్ ను చిత్తుచేసింది.

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో న్యూజిలాండ్ కు అదిరే ఆరంభం. టైటిల్ ఫేవరెట్లలో ఒకటైన కివీస్ టోర్నీని ఘనంగా మొదలెట్టింది. బుధవారం (ఫిబ్రవరి 19) జరిగిన మ్యాచ్ లో బ్లాక్ క్యాప్స్ 60 పరుగుల తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్థాన్ ను చిత్తు చేసింది. మొదట విల్ యంగ్, లేథమ్ సెంచరీల సాయంతో కివీస్ 320/5 భారీ స్కోరు సాధించింది. ఛేదనలో పాక్ 260 పరుగులకే కుప్పకూలింది.
ఒరోర్క్, శాంట్నర్ అదుర్స్
భారీ లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ ఏ దశలోనూ గెలిచేలా కనిపించలేదు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. 2017లో ఛాంపియన్ గా నిలిచిన పాక్.. సొంతగడ్డపై ఈ ఛాంపియన్స్ ట్రోఫీని ఓటమితో మొదలెట్టింది. బాబర్ ఆజం (64), ఖుష్ దిల్ షా (69), సల్మాన్ అఘా (42) మాత్రమే చెప్పుకోదగ్గ పరుగులు చేశారు. కానీ వీళ్ల పోరాటం ఏ మాత్రం సరిపోలేదు.
వికెట్లు పడగొట్టి
69/3తో కష్టాల్లో పడ్డ పాకిస్థాన్ ను బాబర్ ఆజం, సల్మాన్ ఆదుకునే ప్రయత్నం చేశారు. వికెట్ల పతనాన్ని అడ్డుకున్న వీళ్లు పరుగులు రాబట్టారు. 127/3తో పాక్ కోలుకునేలా కనిపించింది. కానీ స్వల్ప వ్యవధిలో సల్మాన్, తయ్యబ్ (1), బాబర్ ను ఔట్ చేసిన న్యూజిలాండ్ పాక్ ను చావుదెబ్బ కొట్టింది. కివీస్ బౌలర్లు ఒరోర్క్ (3/47), కెప్టెన్ శాంట్నర్ (3/66) ప్రత్యర్థిని కట్టడి చేశారు. మ్యాట్ హెన్రీ రెండు వికెట్లు పడగొట్టాడు.
యంగ్, లేథమ్ సెంచరీలు
మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ భారీ స్కోరు సాధించింది. విల్ యంగ్ (107), టామ్ లేథమ్ (118 నాటౌట్) సెంచరీలతో అదరగొట్టారు. గ్లెన్ ఫిలిప్స్ (61) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఫిలిప్స్ మెరుపు షాట్లతో పాక్ బౌలర్లపై ఎదురు దాడికి దిగాడు. ఎడాపెడా బౌండరీలు బాదాడు. 39 బంతుల్లోనే 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 61 పరుగులు చేశాడు. మరోవైపు 104 బంతుల్లో 118 పరుగులు చేసిన లేథమ్ 10 ఫోర్లు, 3 సిక్సర్లు కొట్టాడు.
సంబంధిత కథనం