New Zealand Cricketers in IPL: పాక్ తో ఎవరాడతారు?.. ఐపీఎల్ ఉండగా..సిరీస్ దండగ.. జట్టు నుంచి తప్పుకొన్న కివీస్ ఆటగాళ్లు
New Zealand Cricketers in IPL: పాపులారిటీలో టాప్ ప్లేస్ లో కొనసాగుతున్న ఇండియన్ ప్రిమియర్ లీగ్ లో ఆడేందుకు విదేశీ క్రికెటర్లు వెయిట్ చేస్తుంటారు. ఛాన్స్ దొరికితే చాలు వచ్చి వాలిపోతుంటారు. ఇప్పుడు ఐపీఎల్ 2025 కోసం కొంతమంది న్యూజిలాండ్ ఆటగాళ్లు పాకిస్థాన్ తో సిరీస్ నుంచి తప్పుకొన్నారు.

ఇండియన్ ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడేందుకు పాకిస్థాన్ సిరీస్ కు న్యూజిలాండ్ ఆటగాళ్లు డుమ్మా కొట్టబోతున్నారు. ఐపీఎల్ 2025 కోసం న్యూజిలాండ్ జాతీయ జట్టు నుంచి తప్పుకొన్నారు. మార్చి 16న పాకిస్థాన్ తో ఆరంభమయ్యే 5 టీ20ల సిరీస్ లో కివీస్ తలపడనుంది. ఈ సిరీస్ కోసం ప్రకటించిన న్యూజిలాండ్ జట్టులో కొంతమంది స్టార్ ఆటగాళ్ల పేర్లు కనిపించలేదు.
కెప్టెన్ తో సహా
ఐపీఎల్ 2025 సీజన్ మార్చి 22న ఆరంభమవుతుంది. ఈ లీగ్ లో ఆడేందుకు నేషనల్ డ్యూటీని కూడా న్యూజిలాండ్ ఆటగాళ్లు పక్కనపెట్టారు. పాకిస్థాన్ తో సిరీస్ ఎవరాడతారు? ఐపీఎల్ ఇంపార్టెంట్ అంటూ జాతీయ జట్టు నుంచి తప్పుకొన్నారు. చివరకు జట్టు కెప్టెన్ శాంట్నర్ కూడా ఐపీఎల్ కే జై కొట్టాడు. శాంట్నర్ తో సహా ఆరుగురు న్యూజిలాండ్ ఆటగాళ్లు ఐపీఎల్ లో తమ ఫ్రాంఛైజీల తరపున ఆడేందుకు రెడీ అవుతున్నారు. శాంట్నర్ లేకపోవడంతో బ్రాస్ వెల్ ను కెప్టెన్ గా ప్రకటించారు.
సీఎస్కేకు ముగ్గురు
ఐపీఎల్ కోసం పాకిస్థాన్ తో సిరీస్ కు దూరంగా ఉంటామని ముందే తమ బోర్డుకు కివీస్ ఆటగాళ్లు చెప్పినట్లు తెలుస్తోంది. అందుకే శాంట్నర్, డెవాన్ కాన్వే, లాకీ ఫెర్గూసన్, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, బెవాన్ జేకబ్స్.. పాకిస్థాన్ తో సిరీస్ కు ప్రకటించిన బ్లాక్ క్యాప్స్ జట్టులో లేరు. ఇందులో శాంట్నర్, కాన్వే, రచిన్ సీఎస్కేకు ఆడబోతుండగా.. ఫెర్గూసన్ ఆర్సీబీకి,ఫిలిప్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ కు , జేకబ్స్ ముంబయి ఇండియన్స్ తరపున బరిలో దిగబోతున్నారు.
2024లో కూడా
2024 లో కూడా పాకిస్థాన్ తో సిరీస్ ను స్కిప్ చేసిన న్యూజిలాండ్ కీ ప్లేయర్స్ ఐపీఎల్ లో ఆడారు. అప్పుడు కేన్ విలియమ్సన్, రచిన్ రవీంద్ర, ట్రెంట్ బౌల్ట్, డెవాన్ కాన్వే, గ్లెన్ ఫిలిప్స్, ఫెర్గూసన్, మ్యాట్ హెన్రీ, డరిల్ మిచెల్, శాంట్నర్ పాక్ తో సిరీస్ కు దూరమయ్యారు. దీంతో పాకిస్థాన్ క్రికెట్ జట్టు కంటే మన ఐపీఎల్ కు వాల్యూ ఎక్కువ అనే విషయం స్పష్టమవుతోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఐపీఎల్ జోష్
టీ20 కిక్కుతో ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు ఐపీఎల్ కొత్త సీజన్ వచ్చేస్తోంది. మరో 10 రోజుల్లోపే సీజన్ ఆరంభం కానుంది. మార్చి 22న డిఫెండింగ్ ఛాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య సీజన్ ఓపెనింగ్ మ్యాచ్ జరగబోతోంది. ఈ సారి 13 స్టేడియాల్లో ఐపీఎల్ మ్యాచ్ లు నిర్వహించబోతున్నారు. హైదరాాబాద్ తో పాటు వైజాగ్ లోనూ మ్యాచ్ లు జరగబోతున్నాయి.
సంబంధిత కథనం