Bracewell Banned: మత్తులో 4 భారీ సిక్సర్లు కొట్టి మ్యాచ్‌ను గెలిపించిన న్యూజిలాండ్ ప్లేయర్, కానీ గేమ్ ముగియగానే ట్విస్ట్
Cricketer Bracewell banned: అథ్లెట్స్ డోప్ టెస్టులో దొరికిపోవడం సాధారణంగా మనం వింటుంటాం. కానీ.. న్యూజిలాండ్ క్రికెటర్ కొకైన్ తీసుకుని మ్యాచ్ ఆడి అడ్డంగా దొరికిపోయాడు.
New Zealand Cricketer Bracewell banned: న్యూజిలాండ్ ప్లేయర్ డోగ్ బ్రాస్‌వెల్ ఒంటిచేత్తో తన జట్టుకి విజయాన్ని అందించాడు. కానీ.. మ్యాచ్ ముగిసిన గంటల వ్యవధిలోనే అతనితో పాటు టీమ్‌కి ఊహించని షాక్ తగిలింది. అతను చేసిన తప్పిదానికి నెల రోజుల నిషేధం వేటు పడింది.
కివీస్ టీమ్‌కి దూరమైన లోకల్ టోర్నీలు
34 ఏళ్ల డోగ్ బ్రాస్‌వెల్ న్యూజిలాండ్ తరఫున 28 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. అయితే.. ఫేలవ ఫామ్, ఫిట్‌నెస్ లేమి కారణంగా న్యూజిలాండ్ టీమ్‌కి దూరమైన ఈ ఆల్‌రౌండర్ లోకల్ టోర్నమెంట్స్‌లో ఆడుతున్నాడు. ఈ క్రమంలో సెంట్రల్ డిస్ట్రిక్ట్స్, వెల్లింగ్టన్ టీమ్స్ మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌లో డోగ్ బ్రాస్‌వెల్ భీకర ప్రదర్శనతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
కొకైన్ మత్తులో భారీ సిక్సర్లు
సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ టీమ్ తరఫున మ్యాచ్ ఆడిన డోగ్ బ్రాస్‌వెల్.. తొలుత బౌలింగ్‌లో 4 ఓవర్లలో 2 వికెట్లు పడగొట్టాడు. దాంతో వెల్లింగ్టన్ 147 పరుగులే చేయగా.. అనంతరం ఛేదనలో 4 భారీ సిక్సర్లు బాదిన డోగ్ బ్రాస్‌వెల్ కేవలం 11 బంతుల్లోనే 30 పరుగులు చేసి సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ జట్టుని గెలిపించాడు. కానీ.. ఈ మ్యాచ్ తర్వాత డోగ్ బ్రాస్‌వెల్‌కి డోప్ పరీక్ష నిర్వహించగా.. పాజిటివ్‌గా తేలింది. ఈ ప్లేయర్ కొకైన్ వినియోగించినట్లు పరీక్షల్లో తేలింది. దాంతో న్యూజిలాండ్ స్పోర్ట్స్ కమీషన్ అతనిపై నెల రోజుల నిషేధం విధించింది.
మూడు నెలల నిషేధం.. కానీ?
ఈ మ్యాచ్ జనవరిలో జరగగా.. విచారణ తర్వాత ఏప్రిల్‌లో న్యూజిలాండ్ స్పోర్ట్స్ కమీషన్ ఈ ప్లేయర్‌పై మూడు నెలలు నిషేధం విధించింది. అయితే.. నిషేధం తర్వాత డోగ్ బ్రాస్‌వెల్ పశ్చాతాపం వ్యక్తం చేస్తూ వైద్య చికిత్స తీసుకున్నాడు. దాంతో ఆ నిషేధాన్ని ఒక నెలకే పరిమితం చేసింది. ఇప్పటికే డోగ్ బ్రాస్‌వెల్‌పై నిషేధం ముగియడంతో మళ్లీ మ్యాచ్‌లు ఆడేండుకు ఈ ఆల్‌రౌండర్ సిద్ధమవుతున్నాడు.
డోగ్ బ్రాస్‌వెల్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడి ఏడాదిపైనే అవుతోంది. ఆఖరిగా 2023లో శ్రీలంకతో మ్యాచ్ ఆడాడు. 28 టెస్టులే కాదు.. 21 వన్డేలు, రెండు టీ20 మ్యాచ్‌లను ఈ ఆల్‌రౌండర్ ఆడాడు.