న్యూజిలాండ్ తో అయిదు టీ20ల సిరీస్ పాకిస్థాన్ 1-4తో చిత్తయిన సంగతి తెలిసిందే. ఆ సిరీస్ లో అంటే స్టార్ ఆటగాళ్లు లేరు అని ఓటమి అవమానాన్ని తప్పించుకునేందుకు పాక్ ట్రై చేసింది. కానీ కెప్టెన్ రిజ్వాన్, బాబర్ ఆజం, నసీం షా తదితర ఆటగాళ్లు జట్టులోకి వచ్చారు. మరోవైపు కివీస్ మాత్రం కీలక ఆటగాళ్లు లేకుండానే ఆడింది. అయినా శనివారం (మార్చి 29) తొలి వన్డేలో న్యూజిలాండ్ చేతిలో పాక్ 73 పరుగుల తేడాతో చిత్తయింది. ఛేజింగ్ లో పాక్ చివరి ఆరుగురు బ్యాటర్లు కలిసి 3 పరుగులే చేయడం గమనార్హం.
నెపియర్ లో జరిగిన ఈ వన్డేలో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 344 పరుగుల భారీ స్కోరు సాధించింది. మార్క్ చాప్‌మన్ (111 బంతుల్లో 132 పరుగులు) శతకంతో అదరగొట్టాడు. అతను 13 ఫోర్లు, 6 సిక్సర్లు కొట్టాడు. డరిల్ మిచెల్ (76), డెబ్యూ ఆటగాడు మహ్మద్ అబ్బాస్ (52) హాఫ్ సెంచరీలు చేశారు. పాకిస్థాన్ బౌలర్లలో ఇర్ఫాన్ ఖాన్ 3.. హారిస్ రౌఫ్, అకిఫ్ జావెద్ 2 చొప్పున వికెట్లు పడగొట్టారు.
టీ20 సిరీస్ కు జట్టులో చోటు దక్కలేని కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్, స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం వన్డే సిరీస్ కోసం తిరిగొచ్చారు. న్యూజిలాండ్ పై ఛేజింగ్ లో పాకిస్థాన్ కు మంచి ఆరంభమే దక్కింది. ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్ (36), ఉస్మాన్ ఖాన్ (39) ఫస్ట్ వికెట్ కు 83 పరుగులు జోడించారు.
బాబర్ ఆజం (78), రిజ్వాన్ (30), సల్మాన్ అఘా (58) కూడా రాణించారు. ఛేజింగ్ లో ఓ దశలో పాకిస్థాన్ 249/3తో గెలిచేలా కనిపించింది. పాకిస్తాన్ విజయానికి 96 పరుగులు అవసరం అయ్యాయి. 11 ఓవర్లు మిగిలి ఉన్నాయి. అయితే, స్మిత్ (4-60) అద్భుత బౌలింగ్ తో చివరి ఏడు వికెట్లు 22 పరుగులకే పడటంతో పాకిస్తాన్ కు ఓటమి తప్పలేదు. బాబర్ ను ఒరోర్క్ ఔట్ చేయడంతో పాక్ పేకమేడలా కూలింది.
ఊహకు అందని ఆటతీరుతో ఎప్పుడు ఎలా ఆడుతుందో చెప్పలేని పాకిస్థాన్ మరోసారి ఢమాల్ అంది. ఆ టీమ్ చివరి ఆరుగురు బ్యాటర్లు కలిసి చేసింది 3 పరుగులే. తయ్యబ్ తాహిర్ (1), ఇర్ఫాన్ ఖాన్ (0), నసీం షా (0), హారిస్ రౌఫ్ (1), అకిఫ్ జావెద్ (1), మహ్మద్ అలీ (0 నాటౌట్) పరుగులు చేశారు. గ్రౌండ్ లో కంటే కూడా డ్రెస్సింగ్ గదిలో ఏసీలో ఉండాలని చూశారేమో పాక్ బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. నేథన్ స్మిత్ 4 వికెట్లతో పాక్ ను కుప్పకూల్చాడు.
సంబంధిత కథనం