Pak vs NZ: ఫైనల్లో పాకిస్థాన్‌ను చిత్తు చేసిన న్యూజిలాండ్.. ముక్కోణపు సిరీస్ సొంతం
Pak vs NZ: ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు న్యూజిలాండ్ క్రికెట్ టీమ్ కు ఇది అదిరే విజయం. ముక్కోణపు సిరీస్ ఫైనల్లో పాకిస్థాన్ ను 5 వికెట్లతో చిత్తు చేసిన కివీస్ టీమ్ ట్రోఫీ ఎగరేసుకుపోయింది.

Pakistan vs New Zealand: న్యూజిలాండ్ క్రికెట్ టీమ్ సత్తా చాటింది. పాకిస్థాన్, సౌతాఫ్రికా కూడా తలపడిన ముక్కోణపు సిరీస్ ట్రోఫీని గెలుచుకుంది. శుక్రవారం (ఫిబ్రవరి 14) జరిగిన ఫైనల్లో పాకిస్థాన్ ను 5 వికెట్లతో చిత్తు చేసి ఈ టోర్నీలో అజేయంగా ట్రోఫీ సాధించింది. ఫైనల్లో డారిల్ మిచెల్, టామ్ లేథమ్ హాఫ్ సెంచరీలతో న్యూజిలాండ్ ను సులువుగా గెలిపించారు. ఆ టీమ్ 45.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి టార్గెట్ చేజ్ చేసింది.
ఫైనల్లో పాకిస్థాన్ చిత్తు
సౌతాఫ్రికా కూడా తలపడిన ముక్కోణపు సిరీస్ లో పాకిస్థాన్, న్యూజిలాండ్ ఫైనల్ చేరాయి. శుక్రవారం (ఫిబ్రవరి 14) ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో పాకిస్థాన్ విసిరిన 243 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ 5 వికెట్లు కోల్పోయి సులువుగా ఛేదించింది. ఛేజింగ్ లో డారిల్ మిచెల్ (57), టామ్ లేథమ్ (56) హాఫ్ సెంచరీలు చేశారు.
ఓపెనర్ డెవోన్ కాన్వే 48 పరుగులు చేసి రాణించాడు. ఛేదనలో ఒక దశలో 5 పరుగులకే తొలి వికెట్ కోల్పోయినా.. ఈ ముగ్గురూ చెలరేగడంతో న్యూజిలాండ్ కు తిరుగు లేకుండా పోయింది. పాకిస్థాన్ బౌలర్లు ఏకంగా 20 అదనపు పరుగులు ఇవ్వడం కూడా ఆ టీమ్ కొంప ముంచింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు న్యూజిలాండ్ ఆత్మవిశ్వాసాన్ని పెంచే విజయం ఇది.
రిజ్వాన్, సల్మాన్ అఘా రాణించడంతో..
ఫైనల్ మ్యాచ్ లో పాకిస్థాన్ భారీ స్కోరు సాధించలేకపోయింది. మాజీ కెప్టెన్ బాబర్ ఆజం (29) మరోసారి నిరాశపరిచాడు. అయితే కెప్టెన్ రిజ్వాన్ (46), సల్మాన్ అఘా (45), తయ్యబ్ తాహిర్ (38) రాణించడంతో పాకిస్థాన్ 49.3 ఓవర్లలో 242 పరుగులకు ఆలౌటైంది. న్యూజిలాండ్ బౌలర్లలో విల్ రౌర్కీ 4 వికెట్లతో పాక్ పని పట్టాడు. మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.
ఫిబ్రవరి 19 నుంచి పాకిస్థాన్ లోనే ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. తొలి మ్యాచ్ లోనూ ఈ రెండు టీమ్సే తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ కు ఇది ఎంతో కీలకమైన విజయం అని చెప్పొచ్చు. ముక్కోణపు టోర్నీలో ఆ టీమ్ అసలు ఓడిపోలేదు. ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ ఎలో ఇండియా, పాకిస్థాన్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ టీమ్స్ ఉన్నాయి. ఇండియా మ్యాచ్ లన్నీ దుబాయ్ లోనే జరగనున్నాయి.
సంబంధిత కథనం