Nepal T20 Records: ఒక్క మ్యాచ్‌తోనే ఎన్నో వరల్డ్ రికార్డులు బ్రేక్ చేసిన నేపాల్.. రికార్డుల జాబితా ఇదీ
Nepal T20 Records: ఒక్క మ్యాచ్‌తోనే ఎన్నో వరల్డ్ రికార్డులు బ్రేక్ చేసింది నేపాల్ టీమ్. ఏషియన్ గేమ్స్ 2023లో భాగంగా మంగోలియాతో జరిగిన మ్యాచ్ లో నేపాల్ బ్రేక్ చేసిన రికార్డుల జాబితా ఓసారి చూద్దాం.
Nepal T20 Records: ఏషియన్ గేమ్స్ 2023లో నేపాల్ మెన్స్ క్రికెట్ టీమ్ చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో ఎన్నో వరల్డ్ రికార్డులను బ్రేక్ చేసింది. మంగోలియాతో జరిగిన మ్యాచ్ లో నేపాల్ బ్యాటర్లు, బౌలర్లు చెలరేగిపోవడంతో గతంలో నమోదైన ఎన్నో రికార్డులు తుడిచిపెట్టుకుపోయాయి. చైనాలోని హాంగ్జౌలో ఈ రికార్డులకు వేదికైన మ్యాచ్ జరిగింది.
ఈ మ్యాచ్ లో నేపాల్ బ్యాటర్లు కుశల్ మల్లా, దీపేంద్ర సింగ్ ఐరీలు ఫాస్టెస్ట్ సెంచరీ, హాఫ్ సెంచరీల రికార్డులు క్రియేట్ చేయగా.. నేపాల్ టీమ్ కూడా మరో రెండు వరల్డ్ రికార్డులను నమోదు చేసింది. ఈ క్రమంలో యువరాజ్ సింగ్, రోహిత్ శర్మ, ఆఫ్ఘనిస్థాన్ టీమ్స్ రికార్డులు మరుగునపడ్డాయి. ఆ రికార్డులేంటో ఓసారి చూద్దాం.
నేపాల్ రికార్డులు ఇవీ
- అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లో అత్యధిక టీమ్ స్కోరు నమోదు చేసింది నేపాల్ టీమ్. 20 ఓవర్లలో ఆ టీమ్ 3 వికెట్లకు 314 రన్స్ చేసింది. టీ20 క్రికెట్ చరిత్రలో 300కుపైగా స్కోరు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకూ 278 పరుగులతో ఆఫ్ఘనిస్థాన్ పేరిట ఉన్న రికార్డు బ్రేకయింది.
- ఈ మ్యాచ్ లో నేపాల్ టీమ్ మొత్తం 26 సిక్స్ లు బాదింది. ఒక టీ20 ఇన్నింగ్స్ లో నమోదైన అత్యధిక సిక్స్ లు ఇవే. గతంలో ఆఫ్ఘనిస్థాన్ పేరిట 22 సిక్స్ లతో ఉన్న రికార్డు బ్రేకయింది.
- నేపాల్ బ్యాటర్ కుశల్ మల్లా కేవలం 34 బంతుల్లోనే సెంచరీ బాదాడు. టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు ఇదే. గతంలో రోహిత్ శర్మ, డేవిడ్ మిల్లర్ 35 బంతుల్లో సెంచరీలు చేశారు. కుశల్ తన ఇన్నింగ్స్ లో ఏకంగా 12 సిక్స్ లు కొట్టడం విశేషం. చివరికి 50 బంతుల్లోనే 137 రన్స్ చేశాడు.
- దీపేంద్ర సింగ్ ఐరీ కేవలం 9 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఏ ఫార్మాట్లో అయినా ఇదే వేగవంతమైన హాఫ్ సెంచరీ. 16 ఏళ్ల కిందట 2007 టీ20 వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ పై 12 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన యువరాజ్ సింగ్ రికార్డు మరుగునపడింది. దీపేంద్ర సింగ్ 10 బంతుల్లో 52 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు.
- 315 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మంగోలియా కేవలం 41 రన్స్ కే కుప్పకూలింది. దీంతో నేపాల్ 273 పరుగులతో గెలిచింది. టీ20ల్లో పరుగుల పరంగా ఇదే అతిపెద్ద విజయం.