Mohammed Siraj: ఛాంపియన్స్ ట్రోఫీ భారత జట్టులో సిరాజ్‍ను తీసుకోవాల్సింది: భారత మాజీ స్టార్
Mohammed Siraj: ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసిన భారత జట్టులో మహమ్మద్ సిరాజ్‍కు చోటు దక్కలేదు. ఇది కాస్త అనూహ్యమే. ఈ విషయంపై భారత మాజీ స్టార్ బ్యాటర్ నవజోత్ సింగ్ సిద్ధు స్పందించారు.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టును సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఫిబ్రవరి 19 నుంచి జరిగే టోర్నీకి 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించారు. అంతకు ముందు ఇంగ్లండ్‍తో వన్డే సిరీస్‍కు కూడా అదే జట్టు ఉంది. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీకి హైదరాబాదీ పేసర్, స్టార్ బౌలర్ మహమ్మద్ సిరాజ్‍ను సెలెక్టర్లు పక్కన పెట్టారు. సిరాజ్‍కు ప్లేస్ పక్కా అనే అంచనాలు రాగా.. అతడికి చోటు దక్కలేదు. దీంతో కొందరు మాజీలు ఈ నిర్ణయంపై అసంతృప్తిగానే ఉన్నారు. తాజాగా భారత మాజీ స్టార్ బ్యాటర్ నవజోత్ సింగ్ సిద్ధు ఈ విషయంపై రియాక్ట్ అయ్యారు.
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం మహమ్మద్ సిరాజ్‍ను తప్పించిన సెలెక్టర్లు.. అర్షదీప్ సింగ్‍ను ఎంపిక చేశారు. టీ20 స్పెషలిస్టుగా పేరు తెచ్చుకున్న అర్షదీప్ ఇప్పటి వరకు ఎనిమిదే వన్డేలే ఆడాడు. కానీ అతడినే ఈ టోర్నీకి తీసుకున్నారు.
సిరాజ్‍ను తీసుకోవాల్సింది
దుబాయ్‍లో ఉండే పరిస్థితుల దృష్ట్యా మహమ్మద్ సిరాజ్‍ను ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయాల్సిందని నవజోత్ సింగ్ సిద్ధు అన్నారు. తానైతే భారత జట్టులో అతడిని ఉంచేవాడినని చెప్పారు. “ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఆల్‍రౌండర్లకు సెలెక్టర్లు ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపిస్తోంది. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ రూపంలో నలుగురు ఆల్‍రౌండర్లు ఉన్నారు. క్లిష్ట పరిస్థితులను కూడా ఎదుర్కొనేలా ఈ టీమ్ ఉంది. కానీ నేనైతే నలుగురు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లను తీసుకునే వాడిని. జట్టులో మహమ్మద్ సిరాజ్‍కు తప్పకుండా చోటు ఇచ్చేవాడిని” అని స్టోర్ట్స్ టాక్ ఇంటర్వ్యూలో సిద్ధు చెప్పారు.
దుబాయ్, షార్జాల్లో స్పిన్ అంత ప్రభావవంతంగా ఉండదని సిద్ధు అన్నారు. ఛాంపియన్స్ ట్రోఫీకి సెలెక్ట్ చేసిన భారత జట్టు కాస్త అటూఇటూగా ఉన్నా.. మొత్తంగా మంచి సమతూకం కనిపిస్తోందని చెప్పారు.
సిరాజ్ ఇప్పటి వరకు 44 వన్డేల్లో 71 వికెట్లు తీసి రాణించాడు. టీమిండియా పేస్ దళంలో ముఖ్యమైన బౌలర్ అయ్యాడు. షమీ గైర్హాజరీలో సిరాజ్ అదరగొట్టాడు. 2023 వన్డే ప్రపంచకప్‍లోనూ 14 వికెట్లతో రాణించాడు. అయితే, ఇటీవల టెస్టు సిరీస్‍ల్లో అతడు ఆశించిన మేర పర్ఫార్మ్ చేయలేకపోయాడు. గాయం నుంచి కోలుకున్న షమీ కూడా టీమిండియాలోకి తిరిగి వచ్చేశాడు. దీంతో సిరాజ్‍ను తప్పించారు సెలెక్టర్లు.
రోహిత్ చెప్పిన కారణం ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీకి సిరాజ్‍ను ఎందుకు పక్కన పెట్టారో కెప్టెన్ రోహిత్ శర్మ.. మీడియా సమావేశంలోనే చెప్పాడు. గాయం బారిన పడిన బుమ్రా టోర్నీ ఆడతాడో లేదో తమకు ఇంకా క్లారిటీ లేదని తెలిపాడు. అందుకే కొత్త, పాత బంతితో ఎఫెక్టివ్‍గా ఉండే అర్షదీప్ సింగ్‍ను తీసుకున్నట్టు చెప్పాడు. సిరాజ్ పాత బంతితో అంత మెరుగ్గా బౌలింగ్ చేయడం లేదని, దీంతో అర్షదీప్ వైపు మొగ్గుచూపినట్టు కారణంగా చెప్పాడు.
సంబంధిత కథనం