Varun Chakravarthy: ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు జట్టులోకి వచ్చిన మిస్టరీ స్పిన్నర్.. ఏకంగా ఐదుగురు స్పిన్నర్లతో..
Varun Chakravarthy: మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి కూడా ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ కోసం జట్టులోకి వచ్చాడు. ఈ విషయాన్ని బీసీసీఐ మంగళవారం (ఫిబ్రవరి 4) వెల్లడించింది. దీంతో స్పిన్నర్ల సంఖ్య ఐదుకి చేరింది.
Varun Chakravarthy: ఇంగ్లండ్ తో టీ20 సిరీస్ లో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ గా నిలిచిన మిస్టరీ స్పిన్నర్ ఊహించినట్లే వన్డే సిరీస్ కు కూడా వచ్చాడు. గురువారం (ఫిబ్రవరి 6) నుంచి ప్రారంభం కానున్న మూడు వన్డేల సిరీస్ కోసం వరుణ్ ను కూడా జట్టులోకి తీసుకున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. నిజానికి అంతకుముందే అతడు నాగ్‌పూర్ లో రోహిత్ సేనతో కలిసి ప్రాక్టీస్ చేస్తూ కనిపించడం గమనార్హం.

వన్డే జట్టులోకి వరుణ్ చక్రవర్తి
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీమిండియాలోకి వస్తాడని భావిస్తున్న వరుణ్ చక్రవర్తిని అంతకుముందు ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ కు ఎంపిక చేశారు. ఫిబ్రవరి 6 నుంచి 12 వరకు ఇండియా, ఇంగ్లండ్ మూడు వన్డేల సిరీస్ జరగనుంది.
నాగ్‌పూర్ లో 6న తొలి వన్డే జరగనుంది. దీనికి రెండు రోజుల ముందు జట్టులోకి మిస్టరీ స్పిన్నర్ వరుణ్ ను ఎంపిక చేశారు. "ఇంగ్లండ్ తో మూడు వన్డేల సిరీస్ కోసం పురుషుల సెలెక్షన్ కమిటీ ఇండియా జట్టులోకి వరుణ్ చక్రవర్తిని ఎంపిక చేసింది" అని బీసీసీఐ వెల్లడించింది.
వరుణ్ రాకతో 16 మంది సభ్యుల జట్టులో స్పిన్నర్ల సంఖ్య ఐదుకి చేరడం విశేషం. ఇప్పటికే జట్టులో రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ ఉన్నారు. వరుణ్ తో కలిపి ఐదుగురు స్పిన్నర్లు అయ్యారు. వరుణ్ చక్రవర్తి తొలిసారి మూడేళ్ల కిందట టీమిండియాలోకి వచ్చినా ఇప్పటి వరకూ వన్డేలు మాత్రం ఆడలేదు.
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు టీమిండియా ఇదే
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్, హర్షిత్ రాణా, మహ్మద్ షమి, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి
టాప్ ఫామ్‌లో వరుణ్
వరుణ్ చక్రవర్తి మిస్టరీ స్పిన్ కి టీ20 సిరీస్ లో ఇంగ్లండ్ దాసోహమైంది. ఈ సిరీస్ ను టీమిండియా 4-1తో గెలిచిన విషయం తెలిసిందే. ఇందులో వరుణ్ 14 వికెట్లు తీసుకున్నాడు. ఒక ఐదు వికెట్ల ప్రదర్శన కూడా ఉంది. దీంతో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది.
ఈ మధ్యే అతడు విజయ్ హజారే ట్రోఫీలోనూ తమిళనాడు తరఫున రాణించాడు. వన్డే ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీలో అతడు 16 వికెట్లు తీశాడు. అందులో రెండుసార్లు ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లు ఉన్నాయి. వరుణ్ ను ఛాంపియన్స్ ట్రోఫీకి కూడా ఎంపిక చేస్తారన్న అంచనాల నేపథ్యంలో ఇంగ్లండ్ తో వన్డే సిరీస్ కు ఎంపిక చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
సంబంధిత కథనం