ఐపీఎల్ 2025లో మూడు ప్లేఆఫ్స్ బెర్తులు కన్ఫామ్ అయ్యాయి. గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ ప్లేఆఫ్స్ కు దూసుకెళ్లాయి. ఇక మిగిలింది ఒకటే ప్లేఆఫ్ బెర్త్. దీని కోసం పోటీపడుతున్న మూడు జట్లలో లక్నో సూపర్ జెయింట్స్ ఒకటి. డూ ఆర్ డై మ్యాచ్ లో లక్నోలో సోమవారం (మే 19) సన్ రైజర్స్ హైదరాబాద్ తో లక్నో తలపడుతోంది. టాస్ గెలిచిన హైదరాబాద్ బౌలింగ్ ఎంచుకుంది.
చావోరేవో తేల్చుకునే మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఈ రోజు లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతోంది. ఈ మ్యాచ్ లో ఓడితే ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమిస్తుంది. ఈ సీజన్ లో ఆడిన 11 మ్యాచ్ ల్లో లక్నో 5 మాత్రమే గెలిచింది. ఆరు ఓడింది.
లక్నో ఇంకా మూడు మ్యాచ్ లు ఆడబోతోంది. ఆ టీమ్ ప్లేఆఫ్స్ చేరాలంటే మిగిలిన మూడు మ్యాచ్ లు గెలవడంతో పాటు ఇతర జట్ల ఫలితాలపై డిపెండ్ కావాల్సిన పరిస్థితి. ఒక్క మ్యాచ్ ఓడినా లీగ్ దశలోనే ఇంటిముఖం పడుతుంది.
ఐపీఎల్ 2025 సీజన్ కు ముందు మెగా వేలంలో రిషబ్ పంత్ ను లక్నో రూ.27 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసింది. కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. కానీ పంత్ అంచనాలు అందుకోలేకపోతున్నాడు. బ్యాటింగ్ లో దారుణంగా విఫలమయ్యాడు. 11 మ్యాచ్ ల్లో 128 రన్స్ మాత్రమే చేశాడు. సగటు 12.80 కాగా స్ట్రైక్ రేట్ 100 కూడా దాటలేదు.
కెప్టెన్ గానూ పంత్ ఆకట్టుకోలేకపోతున్నాడు. కీలక మ్యాచ్ ల్లో ఒత్తిడికి తలొగ్గి పేలవ నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అతని నిర్ణయాలపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. మరి ప్లేఆఫ్స్ రేసులో ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన ఈ మ్యాచ్ లో పంత్ ఏం చేస్తాడో చూడాలి.
మరోవైపు ఎంతో హైప్ తో 300 లోడింగ్ అంటూ ఐపీఎల్ 18వ సీజన్ లో అడుగుపెట్టిన సన్ రైజర్స్ హైదరాబాద్ బొక్కబోర్లా పడింది. కనీసం ప్లేఆఫ్స్ కూడా చేరలేకపోయింది. 11 మ్యాచ్ ల్లో మూడు మాత్రమే గెలిచింది. ఆరు ఓడింది. ఓ మ్యాచ్ వర్షంతో రద్దయింది.
ఇక మిగిలిన మూడు మ్యాచ్ ల్లో గెలిచి, టేబుల్ లో లాస్ట్ ప్లేస్ దక్కకుండా చూసుకోవడమే సన్ రైజర్స్ కు మిగిలింది. ఆ టీమ్ ఆడాల్సింది పరువు కోసమే. మరి సన్ రైజర్స్ ఎలా ఆడుతుందో? కరోనా పాజిటివ్ గా తేలడంతో ట్రావిస్ హెడ్ ఈ మ్యాచ్ కు దూరమయ్యాడు.
సంబంధిత కథనం