ముంబయి ఇండియన్స్ దే లాస్ట్ ప్లేఆఫ్స్ బెర్తు.. చెలరేగిన సూర్య.. అదరగొట్టిన శాంట్నర్, బుమ్రా.. ఢిల్లీ క్యాపిటల్స్ ఔట్-mumbai indians sealed the play offs berth 59 runs commanding win over delhi capitals ipl 2025 dc out of the race ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  ముంబయి ఇండియన్స్ దే లాస్ట్ ప్లేఆఫ్స్ బెర్తు.. చెలరేగిన సూర్య.. అదరగొట్టిన శాంట్నర్, బుమ్రా.. ఢిల్లీ క్యాపిటల్స్ ఔట్

ముంబయి ఇండియన్స్ దే లాస్ట్ ప్లేఆఫ్స్ బెర్తు.. చెలరేగిన సూర్య.. అదరగొట్టిన శాంట్నర్, బుమ్రా.. ఢిల్లీ క్యాపిటల్స్ ఔట్

ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ చివరి బెర్తును ముంబయి ఇండియన్స్ దక్కించుకుంది. బుధవారం వాంఖడేలో ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఢిల్లీ క్యాపిటల్స్ ను చిత్తుచేసింది. బ్యాటింగ్ లో సూర్యకుమార్.. బౌలింగ్ లో శాంట్నర్, బుమ్రా అదరగొట్టారు.

ముంబయి ఇండియన్స్ టీమ్ (AP)

అయిదు సార్లు ఛాంపియన్ ముంబయి ఇండియన్స్ అదరగొట్టింది. గతేడాది చేదు ఫలితాన్ని చెరిపేస్తూ ఐపీఎల్ 2025లో ప్లేఆఫ్స్ చేరింది. నాలుగో బెర్తును ఆ టీమ్ దక్కించుకుంది. బుధవారం (మే 21) హోం గ్రౌండ్ వాంఖడేలో ఢిల్లీ క్యాపిటల్స్ ను 59 పరుగుల తేడాతో ముంబయి చిత్తుచేసింది.

ఛేజింగ్ లో ఇలా

181 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ 121 రన్స్ కే ఆలౌటైంది. మిచెల్ శాంట్నర్ 3, బుమ్రా 3 వికెట్లతో ఢిల్లీ నడ్డివిరిచారు. 13 మ్యాచ్ ల్లో 8 విజయాలు, 16 పాయింట్లతో ముంబయి ప్లేఆఫ్స్ చేరింది. ఇప్పటికే జీటీ, ఆర్సీబీ, పంజాబ్ ప్లేఆఫ్స్ చేరిన సంగతి తెలిసిందే. ముంబయి చేతిలో ఓడిన ఢిల్లీ ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. 13 మ్యాచ్ ల్లో ఆ టీమ్ ఆరో ఓటమి ఖాతాలో వేసుకుంది.

టపటపా వికెట్లు

ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్ రేసులో ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతులెత్తేసింది. ఛేజింగ్ లో దారుణంగా విఫలమైంది. ముంబయి ఇండియన్స్ బౌలర్ల ధాటికి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న కేెఎల్ రాహుల్ (11), డుప్లెసిస్ (6)తో పాటు అభిషేక్ పోరెల్ (6) పెవిలియన్ కు క్యూ కట్టారు.

స్పిన్ మ్యాజిక్

ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే డుప్లెసిస్ ను ఔట్ చేసిన దీపక్ చాహర్ ఢిల్లీకి షాకిచ్చాడు. తర్వాతి ఓవర్లోనే కేఎల్ రాహుల్ ను బౌల్ట్ బుట్టలో వేసుకున్నాడు. ఆ తర్వాత స్పిన్ మ్యాజిక్ మొదలైంది. శాంట్నర్, విల్ జాక్స్ కలిసి మిడిలార్డర్ పనిపట్టారు. అభిషేక్ పోరెల్ ను జాక్స్ పెవిలియన్ చేర్చాడు.

కాసేపు పోరాటం

27కే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును యువ ప్లేయర్లు సమీర్ రిజ్వీ (39), విప్రజ్ నిగమ్ (20) ఆదుకోవాలని చూశారు. కానీ వీళ్ల పోరాటం కాసేపే. విప్రజ్ ను శాంట్నర్ ఔట్ చేశాడు. వెంటనే స్టబ్స్ (2) ను బుమ్రా ఎల్బీడబ్ల్యూ చేయడంతో ఢిల్లీ పనైపోయింది.

ఇక శాంట్నర్ ఒకే ఓవర్లో సమీర్ రిజ్వీ, అశుతోష్ శర్మ (18)ను ఔట్ చేయడంతో ముంబయి విజయం ఖాయమైంది. కాసేపటికే ఢిల్లీ ఆలౌటైంది.

సూర్యకుమార్ షో

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ముంబయి ఇండియన్స్ ఇన్నింగ్స్ లో సూర్యకుమార్ ఆటే హైలైట్. ఓ ఎండ్ లో వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును ఒంటిచేత్తో సూర్య ఆదుకున్నాడు. అతను 43 బంతుల్లో 73 పరుగులతో అజేయంగా నిలిచాడు. 7 ఫోర్లు, 4 సిక్సర్లు కొట్టాడు. దీంతో ముంబయి ఇండియన్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 180 పరుగులు చేసింది.

సూర్యకుమార్, నమన్ ధీర్ (8 బంతుల్లో 24; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కలిసి లాస్ట్ 2 ఓవర్లలో 48 పరుగులు రాబట్టారు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం